Telangana: 10 సీట్లు మావే..! | Sakshi
Sakshi News home page

Telangana: 10 సీట్లు మావే..!

Published Tue, May 14 2024 7:29 AM

BJP Confident Over 10 Seats In Telangana

ఆశలపల్లకిలో కమలదళం 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం పది సీట్లలో గెలిచి సత్తా చాటుతామనే ధీమా కమలదళంలో కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్‌ జరిగిన తీరును పరిశీలిస్తే బీజేపీ, ప్రధాని మోదీ పట్ల వివిధ వర్గాల ఓటర్లలో సానుకూలత వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా మహిళలు, యువత పెద్దసంఖ్యలో తమకే ఓట్లు వేశారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

పార్టీ సిట్టింగ్‌ ఎంపీ సీట్లయిన సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లను నిలబెట్టుకుంటామని.. వీటితోపాటు మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, జహీరాబాద్, భువనగిరి, వరంగల్, నాగర్‌కర్నూల్, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో కనీసం ఆరు సీట్లు గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కలిపి గెలిచే సీట్ల కంటే కూడా బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందనే విశ్వాసాన్ని ఓ ముఖ్యనేత వ్యక్తం చేయడం గమనార్హం.

ప్రతీ గంటకు నివేదికలు...
సోమవారం ఉదయం పోలింగ్‌ మొదలైనప్పటి నుంచి సాయంత్రం ముగిసే దాకా ఎప్పటి కప్పుడు ఓటింగ్‌ సరళిపై క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోవడంపై రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. అన్ని బూత్‌ల నుంచి గంటగంటకూ పోలింగ్‌ సరళిపై బూత్‌ కమి టీల ద్వారా సమాచారాన్ని తెప్పించి క్రోడీకరించారు. కొన్ని సీట్లలో ఆశించిన మేర ఓటింగ్‌ శాతం నమోదు కాకపోవడంతో సాయంత్రం 6 గంటల తర్వాత వెల్లడయ్యే తుది ఓటింగ్‌ శాతాన్ని బట్టి మళ్లీ తాజా అంచనాల్లో నిమగ్నమయ్యారు.

 ఎన్నికలకు ఎంతో ముందు నుంచే పార్టీ పట్ల ఓ పాజిటివ్‌ ప్రచారం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందని, దానికి తగ్గట్టుగానే బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిస్థాయిలో రాష్ట్రంలో ప్రచారంలో నిమగ్నం కావడంవల్ల ప్రయోజనం చేకూరిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అదీగాక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఓట్లు వేసినా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి వేస్తామనేలా వివిధ వర్గాల ఓటర్ల మనోగతం వ్యక్తమైందని, ఇవన్నీ బీజేపీ మంచి ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయని ముఖ్యనేతలు భావిస్తున్నారు. పార్టీ అభ్యర్థులు కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని భావిస్తున్న ఎంపీ స్థానాల్లో... రాష్ట్ర పార్టీ తరఫున కొందరు నాయకులు పర్యటించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అంచనా వేశారు. 

హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, వ్యాపార వర్గాలు, ఉత్తరాది, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు బీజేపీవైపు మొగ్గు చూపినట్టు కనిపించిందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు పరిమితంగా స్టార్‌ క్యాంపెయినర్లు ఉండగా, జాతీయస్థాయి ఎన్నికలకు ప్రాధాన్యత కల్పించేలా పెద్దసంఖ్యలో పార్టీ ముఖ్యనేతల ప్రచారం సాగడం కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రచారంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, దేశాభివృద్ధి, తెలంగాణ నుంచి అధికసంఖ్యలో బీజేపీ ఎంపీలను గెలిపిస్తే చేకూరబోయే ప్రయోజనాలు వంటివి ప్రస్తావించడంతో.. మిగతా పార్టీలు, బీజేపీకి ఉన్న తేడా స్పష్టంగా కనిపించిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement