చుక్కలు చూపిస్తున్న యష్మి టీమ్‌.. మణిలో ఈ యాంగిల్‌ ఉందా! | Bigg Boss Telugu 8, Sep 6th Full Episode Review: Yashmi Clan is Powerful Team | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: చుక్కలు చూపిస్తున్న యష్మి టీమ్‌.. లబోదిబోమంటున్న నైనిక టీమ్‌

Published Fri, Sep 6 2024 11:37 PM | Last Updated on Fri, Sep 6 2024 11:39 PM

Bigg Boss Telugu 8, Sep 6th Full Episode Review: Yashmi Clan is Powerful Team

సాధారణంగా బిగ్‌బాస్‌ మొదలైన ఒకటీరెండు వారాలవరకు పెద్దగా కంటెంట్‌ ఏమీ ఉండదు. కానీ ఈ సీజన్‌లో మాత్రం కంటెస్టెంట్లు తొలి రోజు నుంచే కావాల్సినంత కంటెంట్‌ ఇస్తున్నారు. శేఖర్‌ బాషా తన వెరైటీ కామెడీతో, సోనియా పాయింట్లు లాగుతూ గొడవ పడుతూ, నాగమణికంఠ ఏడుస్తూ.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎంటర్‌టైన్నారు. మరి ఈరోజు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం జరిగిందో నేటి (సెప్టెంబర్‌ 6) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

తెలివిగా ఆడిన నైనిక టీమ్‌
యష్మి, నైనిక, నిఖిల్‌.. ఈ ముగ్గురు చీఫ్స్‌లో ఎవరు పవర్‌ఫులో తేల్చుకోవాలంటూ బిగ్‌బాస్‌ టాస్కులు ఇచ్చాడు. అయితే నిఖిల్‌ టీమ్‌లో కేవలం ముగ్గురే ఉండటంతో యష్మి, నైనిక టీమ్స్‌కు మాత్రమే పోటీ పెట్టాడు. ఇప్పటికే ఓ టాస్కులో యష్మి టీమ్‌ గెలవగా తాజాగా మరో టాస్క్‌ ఇచ్చాడు. అందులో బుర్ర పెట్టి ఆడిన నైనిక టీమ్‌ను సంచాలకుడు నిఖిల్‌ విజేతగా ప్రకటించాడు. తన ఫ్రెండ్‌ నిఖిల్‌ తన టీమ్‌నే గెలిపిస్తాడని బోలెడు ఆశలు పెట్టుకున్న యష్మి ఇది జీర్ణించుకోలేక కాసేపు కస్సుబుస్సులాడింది.

ఈ వారం ఎవరిపై వేటు
ఎప్పుడూ గొడవకు సై అంటూ ముందుకు దూకే సోనియా సైలెంట్‌గా ఉండటంతో ఏమైందని నిఖిల్‌ ఆరా తీశాడు. ఒంటరిగా కూర్చున్న తనతో కబుర్లు పెట్టేందుకు ప్రయత్నించాడు. మరోవైపు కిచెన్‌లో అభయ్‌, బాషా, ప్రేరణ ఈ వారం నాగమణికంఠ ఎలిమినేట్‌ అవచ్చని ఊహించారు. కానీ పోలింగ్‌ చూస్తుంటే ఈ ఊహాగానాలు బోల్తా కొట్టడమే ఖాయమనిపిస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు రెండు గేముల్లో చెరొకటి గెలిచిన యష్మి, నైనిక టీమ్స్‌కు ఆఖరిగా ఓ ఛాలెంజ్‌ ఇచ్చాడు. స్వింగింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై ఐదు ఇటుకలను మొదటగా పేర్చాలని చెప్పాడు. 

పవర్‌ఫుల్‌ చీఫ్‌గా యష్మి
ఇక్కడ రెండు టీమ్స్‌ ఎలా గెలవాలన్నదానికి బదులు పక్కవారిని ఎలా ఓడించాలన్నదానిపైనే దృష్టి పెట్టారు. ఈ ఛాలెంజ్‌లో యష్మి టీమ్‌ గెలిచింది. రెండు టాస్కులు గెలిచి పవర్‌ఫుల్‌ చీఫ్‌గగా నిలిచిన యష్మి.. నిఖిల్‌ టీమ్‌లో నుంచి సోనియాను లాక్కుంది. అలాగే డ్రాగన్‌ రూమ్‌లోకి తన టీమ్‌తో పాటు వెళ్లే ఛాన్స్‌ కొట్టేసింది. అందులో చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్‌ అన్నీ ఉండటంతో టీమ్‌ సభ్యులు తెగ ఆనందపడిపోయారు.

మూడు టీమ్స్‌ పేర్లివే
అనంతరం మూడు టీమ్స్‌ను మూడు జెండాలు, పేర్లు రూపొందించుకోవాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. అందులో భాగంగా యష్మి టీమ్‌ అఖండగా, నైనిక టీమ్‌.. అంతులేని వీరులుగా, నిఖిల్‌ టీమ్‌.. కెరటంగా నిలుచున్నారు. ఈ మూడు టీమ్‌ లీడర్స్‌ను బిగ్‌బాస్‌ కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచాడు. పవర్‌ఫుల్‌ చీఫ్‌ అయిన యష్మి టీమ్‌లో ఎవరూ ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదంటూ వారికి గుడ్‌న్యూస్‌ చెప్పాడు. 

లబోదిబోమన్న అంతులేని వీరులు టీమ్‌
అంతేకాకుండా ఇంట్లో ఎవరు ఏ పని చేయాలనేది యష్మి నిర్ణయించాలన్నాడు. దీంతో ఆమె కెరటం టీమ్‌కు వంటపని కేటాయించింది. మిగతా పనులన్నీ అంతులేని వీరులు టీమ్‌ చేయాలని నిర్ణయించింది. ఇది విని అంతులేని వీరులు టీమ్‌ సభ్యులు గుండెలు బాదుకున్నారు. గొడ్డుచాకిరీ చేయాలా? అని ఆవేశపడ్డారు, ఎమోషనలయ్యారు. అటుపక్క దొరికిందే ఛాన్స్‌ అన్నట్లు అఖండ టీమ్‌ రెచ్చిపోయింది. డస్ట్‌బిన్‌లో గ్లాస్‌ పడేసిన ప్రేరణ.. ఇది తన పని కాదన్నట్లు ఆ గ్లాసును మళ్లీ బయట తీసిపెట్టింది. 

నోరేసుకుని పడిపోకు..
అటు అభయ్‌ నవీన్‌.. నచ్చింది వండుకుంటానంటూ కిచెన్‌లో అడుగుపెట్టాడు. అలాగైతే వండుకున్నాక మీ గిన్నెలు కూడా మీరే తోముకోండని సీత ఒంటికాలిపై లేచింది. అందుకు అభయ్‌.. మీరేమీ నా ఇంట్లో పని చేస్తలేరు.. ఇది గేమ్‌.. దిమాక్‌ ఉండాలి.. నోరేసుకుని పడిపోకు.. అని ఫైర్‌ అయ్యాడు. ఆ మాటతో సీత ఏడ్చేసింది. ఇక మొన్నటివరకు కన్నీళ్ల కుళాయి తెరిచిన మణికంఠ తనలో రెమోని బయటకు తీశాడు. భార్యను తలుచుకుని రొమాంటిక్‌ అయ్యాడు. ఈసారి భార్యను హగ్‌ చేసుకోవడానికి వెళ్లినప్పుడు సెంటు పూసుకుని వెళ్తానంటూ సిగ్గుపడిపోయాడు.

 

బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement