చనిపోదామనుకున్న ఆదిత్య.. గిఫ్టులు అందుకున్నదెవరంటే? | Bigg Boss Telugu 8, Sep 13th Full Episode Review: Special Gifts for Housemates | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: 'తప్పు చేశా.. క్షమించు కన్నా'.., సీత త్యాగం.. ఏడ్చేసిన కంటెస్టెంట్లు

Published Fri, Sep 13 2024 11:31 PM | Last Updated on Fri, Sep 13 2024 11:31 PM

Bigg Boss Telugu 8, Sep 13th Full Episode Review: Special Gifts for Housemates

ప్రైజ్‌మనీని పెంచుకునేందుకు బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులు బాగానే కష్టపడ్డారు. అయితే అందరికంటే చిన్న టీమ్‌ ఎక్కువ ప్రైజ్‌మనీ గెలవడం విశేషం. టాస్కుల్లో రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌ను మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు సరదా గేమ్‌ ఆడించారు. ఆ వెంటనే వాళ్ల ఇంటి నుంచి కొన్ని వస్తువులు తెప్పించి కొందరికి ఇచ్చి మరికొందరికి కళ్లముందు ఆశపెట్టివెనక్కు తీసేసుకున్నారు. ఇంతకీ ఎవరెవరు బహుమతులు అందుకున్నారో తెలియాలంటే నేటి (సెప్టెంబర్‌ 13) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

ఆడపులిలా సోనియా
ప్రైజ్‌మనీ కోసం ఇచ్చిన పోటీ ముగిసిందని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అంతులేని వీరులు టీమ్‌.. రూ.75 వేలు, అఖండ టీమ్‌ రూ.1,25,000, కెరటం రూ.2,45,000 సాధించినట్లు వెల్లడించాడు. ఈ మూడింటిలో కెరటం టీమ్‌ సాధించిన డబ్బును ప్రైజ్‌మనీలో యాడ్‌ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.5,45,000కు చేరింది. అనంతరం బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులతో ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌ ఆడించాడు. ఈ క్రమంలో యష్మి చికెన్‌ దొంగిలించినట్లు ఒప్పుకుంది. సోనియా ఆడపులిలా రెడీ అయింది. విష్ణుప్రియ పోల్‌ డ్యాన్స్‌ చేసింది. నిఖిల్‌ చీర కట్టుకుని స్టెప్పులేశాడు.

ఇంటి నుంచి బహుమతులు
తర్వాత కంటెస్టెంట్లకు ఇంటి నుంచి బహుమతులు వచ్చాయని గుడ్‌న్యూస్‌ చెప్పాడు. కానీ ఐదుగురికి మాత్రమే గిఫ్ట్స్‌ పొందే అవకాశం ఉందని మెలిక పెట్టాడు. ఆ ఐదుగురు ఎవరనేది హౌస్‌మేట్స్‌ నిర్ణయించాలన్నాడు. ఎవరు గిఫ్ట్‌ పొందాలి? ఎవరి బహుమతి వెనక్కు పంపించాలన్నది ఇంటిసభ్యుల చేతిలోనే ఉంటుందన్నాడు. మొదటగా అభయ్‌, నిఖిల్‌ గిఫ్టులు వచ్చాయి.

నాన్నకు తెలియకుండా దొంగతనం
అభయ‌ మాట్లాడుతూ.. మా నాన్న లెక్కల మాస్టారు. తాను చాలా స్ట్రిక్ట్‌. కానీ, నేను సినిమాల్లోకి వస్తానంటే సపోర్ట్‌ చేశాడు. అలా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను సంపాదించిన డబ్బుతో కొన్న వాచ్‌ అది.. ఆయన ఉన్నన్ని రోజులు అదే ధరించాడు అని చెప్పాడు. నిఖిల్‌ మాట్లాడుతూ.. అబ్బాయిలకు నాన్నను హగ్‌ చేసుకునే అదృష్టం ఉండదు. అందుకని నాన్నకు తెలియకుండా ఆయన షర్ట్‌ దొంగతనం చేశాను అంటూ ఏడ్చేశాడు. 

నైనిక కోసం సీత త్యాగం
మెజారిటీ ఇంటిసభ్యులు అభయ్‌కు లాలీపాప్‌ ఇచ్చి సపోర్ట్‌ చేశారు. దీంతో అతడు వాచీ అందుకున్నాడు. నైనిక, సీతకు బొమ్మలు గిఫ్ట్స్‌గా వచ్చాయి. సీత మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు రిలేషన్‌లో ఉన్నాక అతడు నన్ను వదిలేసి పోయాడు. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్‌ దొరికాడు. అతడే ఈ బొమ్మ కొనిచ్చాడు. ఆ బొమ్మ లేకుండా నేనసలు నిద్రపోలేనంటూ ఏడ్చేసింది. కానీ ఈ బిగ్‌బాస్‌ హౌస్‌లో నైనిక, విష్ణుప్రియ దొరికారని.. వాళ్లతో కబుర్లు చెప్తూ నిద్రపోతున్నానంది. కాబట్టి ఆ బొమ్మ లేకుండా ఉండగలనని నైనికకు గిఫ్ట్‌ ఇచ్చేయండని కోరింది.

చాలాసార్లు విడిపోదామనుకున్నాము
నైనిక మాట్లాడుతూ.. ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తే ఎన్నో గొడవలు జరుగుతాయి. అలా ఎన్నోసార్లు గొడవలయ్యాయి, చాలాసార్లు విడిపోదామనుకున్నాము. ఒక హింసాత్మక రిలేషన్‌ నుంచి బయటకొచ్చాక ఈ వ్యక్తి వల్లే ఆ బాధను మర్చిపోయాను. నేనూ కొన్ని తప్పులు చేశాను, సారీ కన్నా, నన్ను ఇంతలా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ అని ఏడ్చేసింది. సీత త్యాగం, హౌస్‌మేట్స్‌ సపోర్ట్‌తో నైనిక తన బొమ్మను గెల్చుకుంది.

అదే చివరి ఫోటో..
నబీల్‌, పృథ్వీలకు తండ్రి ఫోటోలు వచ్చాయి. నబీల్‌ మాట్లాడుతూ.. నాన్నకు సింగర్‌ అవ్వాలన్నది కోరిక. తనకెలాగూ అనుకున్న కల నెరవేరలేదని నాకు ఎక్కువ సపోర్ట్‌ చేసేవాడు. కాలేజీకి కూడా సరిగా వెళ్లకుండా యూట్యూబ్‌ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని. 2021 జూన్‌లో నాన్నతో చివరిసారి ఫోటో దిగాను. ఆ మరుసటి నెలలోనే తను చనిపోయాడు. కానీ, నేను స్ట్రాంగ్‌.. పృథ్వీకి వచ్చిన బహుమతిని అతడికి ఇచ్చేయమని కోరాడు.

నాన్నతో దిగిన ఏకైక ఫోటో
పృథ్వీ మాట్లాడుతూ.. మా నాన్నతో నేను దిగిన ఏకైక ఫోటో ఇదొక్కటే. మా నాన్నతో ఆగస్టు 15న చాలాసేపు మాట్లాడాను. ఆరోజే ఆయన కాలం చేశాడు. నేను నటుడినవ్వాలన్నది ఆయన కల. అది నెరవేర్చాను అని చెప్పుకొచ్చాడు. మెజారిటీ ఇంటిసభ్యులు నబీల్‌కు లాలీపాప్స్‌ ఇవ్వడంతో అతడు ఫోటోఫ్రేమ్‌ అందుకున్నాడు. అనంతరం మణికంఠకు శాలువా, ఆదిత్యకు తండ్రి ఫోటో ఫ్రేమ్‌ గిఫ్టుగా వచ్చాయి. 

చనిపోదామనుకున్నా..
మణికంఠ మాట్లాడుతూ.. అమ్మ చనిపోతుందనడానికి ముందు తన శాలువా ఇచ్చింది. సింపతీ కోసమైతే దీన్ని నాకు ఇవ్వకండి అన్నాడు. ఆదిత్య మాట్లాడుతూ.. నాలో ఉన్న మంచి లక్షణాలకు నాన్నే కారణం. కరోనా టైంలో నా భార్య, కుమారుడు, తల్లి.. అందరికీ కోవిడ్‌ వచ్చింది. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. అప్పుడు నాన్న ఫోటో కిందపడి నన్ను హెచ్చరించింది అని ఎమోషనల్‌ అయ్యాడు. 

దొంగతనం
ఈ క్రమంలో నాన్న గొప్పదనం గురించి చెప్తూ బాషా భావోద్వేగానికి లోనయ్యాడు. హౌస్‌మేట్స్‌ సపోర్ట్‌తో ఆదిత్య తన తండ్రి ఫోటో అందుకున్నాడు. ఇకపోతే మణికంఠ అర్ధరాత్రి అఖండ టీమ్‌ బెడ్‌రూమ్‌లో దూరి సరుకులు దొంగతనం చేశాడు. అందర్నీ ఓ ఆటాడుకుందామనే ఈ ప్లాన్‌ వేసినట్లున్నాడు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement