వీకెండ్‌లో క్లాసులు పీకే ఆనవాయితీని నాగ్ మళ్లీ మొదలుపెట్టాడు. లేకపోతే కంటెస్టెంట్లు దారితప్పడం ఖాయం. అందుకే నాగ్ కొందరికి చీవాట్లు పెట్టాడు, వార్నింగ్‌లు ఇచ్చాడు. టీమ్ లీడర్‌గా విర్రవీగిన యష్మి ఫెయిల్ అని ప్రకటించాడు. అసలు ఉన్న మూడు టీముల్లో రెండింటినీ పీకేశాడు. ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
పృథ్వీకి వార్నింగ్
నాగార్జున వచ్చీరాగానే టీమ్ లీడర్స్‌తో గేమ్ ఆడించాడు. మీ టీమ్‌లో బాగా ఆడిన వారి ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో, సరిగా ఆడనివారి ఫోటోలను రెడ్ బాక్స్‌లో పెట్టాలన్నాడు. ముందుగా అఖండ టీమ్ చీఫ్ యష్మి.. అభయ్, పృథ్వీ బాగా ఆడారంది. ఈ సందర్భంగా నాగ్.. ఆటలో వాడకూడని పదాలు వాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు.
సంచాలక్‌గా ఫెయిల్
ప్రేరణ సంచాలకురాలుగా కన్‌ఫ్యూజ్ అయిందంటూ తన ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది యష్మి. ఈ సందర్భంగా నాగ్.. సంచాలకురాలిగా నువ్వు కూడా ఫెయిలే అంటూ ఓ వీడియో చూపించాడు. అందులో రేషన్ టాస్క్‌లో పావుకిలోకు దగ్గరగా మరమరాలు తీసుకొచ్చినవారిని విజేతగా ప్రకటిస్తానంది. తీరా సీతకు బదులుగా మణికంఠ పావుకిలోకు దగ్గరగా తెచ్చినప్పుడు కరెక్ట్‌గా 250 గ్రాములు తేలేదు కాబట్టి ఎవరినీ విన్నర్‌గా ప్రకటించనంది.
కావాలనే అలా చేశాను: యష్మి
ఈ వీడియో చూపించేసరికి యష్మి ఏడ్చేసింది. తను కావాలనే అలా చేసినట్లు నిజం ఒప్పుకుంది. అంతులేని వీరులు టీమ్ ఓడిపోతే ఐదుగురు ఆకలితో అలమటిస్తారని.. వారు గెలవాలన్న ఉద్దేశ్యంతోనే ఆ పని చేశానని అంగీకరించింది. తర్వాత సోనియా ఫోటోను సైతం రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్ మాట్లాడుతూ.. సోఫాలో కూర్చుంటే అయిపోదు, గేమ్స్ ఆడాలని ఆమెకు హితవు పలికాడు. అలాగే నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని మాట్లాడిన వీడియో ప్లే చేసి క్లాసు పీకాడు.
బెస్ట్ పర్ఫామర్ అతడే
అప్పటికీ సోనియా.. ఆ మాటలు అనుకోకుండా వచ్చాయే తప్ప కావాలని అనలేదని కవర్ చేసింది. దీంతో నాగ్ కోప్పడుతూ.. ఇంకేం మాట్లాడకు.. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడావు, ప్రతీది జనాలు చూస్తున్నారు, నీ మంచి కోసమే చెప్తున్నా.. జాగ్రత్తగా ఉండు, నోరు అదుపులో పెట్టుకో అని హింటిస్తూనే, సుతిమెత్తగా హెచ్చరించాడు. యష్మి చివరగా శేఖర్ బాషా ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్.. బాషా తండ్రయ్యాడంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అనంతరం యష్మి.. అవతలి టీమ్స్‌లో నబీల్‌కు బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.
అసలైన ఆడపులి
అనంతరం అంతులేని వీరులు టీమ్ చీఫ్ నైనిక వంతు రాగా.. నబీల్, విష్ణుప్రియ, సీతల ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో పెట్టి ఆదిత్యను రెడ్ బాక్స్‌లో పడేసింది. సీత అద్భుతంగా ఆడిందని, తనే నాకు అసలైన ఆడపులి అని, మేము తింటున్న ఫుడ్ తనవల్లే గెలుచుకున్నామని పొగిడింది. ఈ సందర్భంగా నాగ్ సీత కోసం ఇంటి నుంచి వచ్చిన బహుమతిని ఇచ్చాడు. తర్వాత.. ఇతర టీమ్స్‌లో నుంచి నాగమణికంఠ బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి నైనిక గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.
ఇద్దరికి బుల్లెట్లు దింపిన నాగ్
మూడో టీమ్‌లో ఉన్నది ఇద్దరే ఇద్దరు. వీరి గురించి వీళ్లు చెప్పుకోనవసరమే లేదు. ఇద్దరూ అద్భుతంగా ఆడి ప్రైజ్‌మనీని పెంచడం గొప్ప విషయమని స్వయంగా నాగార్జునే మెచ్చుకున్నాడు. అటు నిఖిల్ కూడా మణికంఠ బాగా ఆడుతున్నాడని తన ఫోటోను గ్రీన్ బోర్డులో పెట్టాడు. బెస్ట్ పర్ఫామర్ అంటూ సీతకు గ్రీన్ బ్యాడ్జ్ తొడిగాడు. తర్వాత నాగ్.. చీఫ్‌గా నైనిక, యష్మి ఫెయిలయ్యారంటూ వారి ఫోటోలకు బుల్లెట్లు దింపాడు. అంతేకాకుండా ఆ క్లాన్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.
చీఫ్‌ను మీరే ఎంచుకోండి
ఇప్పుడు చీఫ్‌ను ఎంచుకోవాల్సిన బాధ్యతను కంటెస్టెంట్లపైనే వేశాడు. ఎవరిని చీఫ్‌గా సెలక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని వద్దనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఈ క్రమంలో మణికంఠ.. విష్ణుప్రియను సెలక్ట్ చేసుకోగా అభయ్‌ను వద్దనుకున్నాడు. నబీల్.. మణికి సపోర్ట్ చేస్తూ ప్రేరణ చీఫ్‌గా వద్దనుకున్నాడు. విష్ణుప్రియ వంతురాగా.. మణికంఠకు సపోర్ట్ చేయగా ఆదిత్య చీఫ్‌గా వద్దని పేర్కొంది. ఆదిత్య వంతురాగా.. సీత చీఫ్ కావాలని, పృథ్వీ మాత్రం లీడర్‌గా వద్దన్నాడు.
కొత్త చీఫ్ ఎవరంటే?
సోనియా.. అభయ్ చీఫ్ అవాలని, శేఖర్ బాషా చీఫ్‌గా వద్దని పేర్కొంది. సీత వంతురాగా అభయ్ చీఫ్ అవాలని, ప్రేరణ లీడర్‌గా వద్దంది. ప్రేరణ, పృథ్వీ.. అభయ్‌కు సపోర్ట్ చేయగా ఆదిత్యకు లీడర్ అయ్యే అర్హత లేదన్నారు. అభయ్ వంతురాగా సోనియా లీడర్ కావాలని, మణికంఠకు చీఫ్ కావొద్దన్నాడు. బాషా.. అభయ్‌కు మద్దతివ్వగా సోనియాకు లీడర్ అయ్యే అర్హత లేదన్నాడు. మెజారిటీ జనాలు అభయ్‌కు సపోర్ట్ చేయడంతో అతడు లీడర్‌గా నిలిచాడు. దీంతో హౌస్‌లో ఇప్పుడు రెండు క్లాన్సే మాత్రమే ఉన్నాయి. ఏ క్లాన్‌లో ఎవరు ఉంటారేంటనేది నాగ్ తర్వాత నిర్ణయిస్తానన్నాడు. చివర్లో నైనిక, నిఖిల్ సేవ్ అయినట్లు ప్రకటించాడు.
చదవండి: విజయ్ చివరి సినిమా ఫిక్స్
Comments
Please login to add a commentAdd a comment