సాక్షి, ఆదిలాబాద్: 'అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నియమావళి విడుదల చేసింది. ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే స్థానిక ఎన్నికల పరిశీలకులను కలిసి లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా సీ–విజిల్ యాప్ ద్వారా ఉల్లంఘనులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి నేరుగా ఎన్నికల సంఘానికి, ప్రత్యేక అధికారికి పంపించవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనల సంకలనాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం నుంచి విడుదల చేశారు.'
కోడ్ నియమావళి..
► భిన్న, కుల, మత, భాష వర్గాల ప్రజల మధ్య విభేదాలు పెంపొందించే, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు.
► ప్రత్యర్థి పార్టీలపై చేసే విమర్శలు కేవలం ఆ పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గత చరిత్ర చేసిన పనులకు పరిమితమై ఉండాలి.
► వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ధ్రువీకరణ జరుగని ఆరోపణలు, వక్రీకరణల ఆధారంగా విమర్శలు చేయరాదు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ పోస్ట్ చేయరాదు.
► ఎన్నికల చట్టాల్లో నేరపూరిత చర్యలుగా పేర్కొన్న కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ప్రధానంగా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేయకూడదు.
► ఆధారాల్లేకుండా రూ.50 వేలకు మించి నగదు ఒకచోటి నుంచి మరో చోటికి తరలించకూడదు.
► ఓటరు స్థానంలో ఇతరులతో ఓటు వేయించడం, పోలింగ్ కేంద్రాలకు వందమీటర్ల దూరంలో ప్రచారం నిర్వహించడం, పోలింగ్‌కు 48 గంటల ముందు సభలు సమావేశాలు జరపడం, ఓట ర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించడం వంటివి చేయరాదు.
► ప్రతీ పౌరుడు తన ఇంట్లో ప్రశాంతంగా బతికేందుకు తమహక్కును గౌరవించాలి. వ్యక్తుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వారి ఇళ్లముందు నిరసనలు, ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టరాదు.
► యజమానుల అనుమతి లేకుండా వారి స్థలాలు, భవనాలు, ప్రహరీ గోడలకు జెండాలు, బ్యానర్లు కట్టడం, పోస్టర్లు అంటించడం, వాల్‌రై టింగ్ లాంటివి చేయరాదు.
► ఇతర పార్టీల సమావేశాలు, ఊరేగింపులకు తమ మద్దతుదారులు భంగం కలిగించకుండా చూసుకోవాలి. ఏదైనా ఒక పార్టీ కార్యకర్తలు వేరే పార్టీల సమావేశం జరుగుతున్న ప్రాంతం మీదుగా ఊరేగింపులు నిర్వహించకూడదు. ఒకపార్టీ అతికించిన పోస్టర్లను మరోపార్టీకి చెందిన కార్యకర్తలు తొలగించకూడదు.
► ఊరేగింపుల రూట్‌మ్యాప్‌ను నిర్వాహకులు ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఇద్దరు లేదా అంతకు మించి అభ్యర్థులు లేదా పార్టీలు ఏకకాలంలో ఒకేరూట్‌లో ఊరేగింపు నిర్వహించే సమయంలో నిర్వాహకులు ముందుగా సంప్రదింపులు జరుపుకుని ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలి.
► ఊరేగింపులో తీసుకెళ్లే వస్తువుల విషయంలో పార్టీల అభ్యర్థులు నియంత్రణ పాటించాలి. అవి అసాంఘికశక్తుల చేతిలో దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర పార్టీల నేతల దిష్టిబొమ్మలను ఊరేగించడం, బహిరంగంగా దహనం చేయడం వంటివి చేయరాదు.
► ఓటర్లు మినహా ఇతరులు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పాస్ కలిగిన వారికి మినహాయింపు ఉంటుంది.
► శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతిపాదిత సభ సమయం, వేదికను ముందస్తుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. సభ ఉన్న ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటే వాటిని కచ్చితంగా పాటించాలి. అవసరమైతే ముందుగానే దరఖాస్తు చేసుకుని సడలింపులు పొందాలి. సభలో లౌడ్ స్పీకర్, ఇతర సదుపాయాలను వినియోగించడానికి ముందు సంబంధిత అఽధికారి నుంచి అనుమతి పొందాలి.
► అభ్యర్థుల స్పీచ్‌లు ఓటు వేసేలా ఉండకూడదు.
► స్వేచ్ఛగా ఓటు వేసేలా ఎన్నికల అధికారులు సహకరించాలి.
► ఓటర్లకు పంపిణీ చేసే చిట్టీలపై గుర్తులు, పార్టీల పేర్లు ఉండరాదు.
► పోలింగ్‌కు 48 గంటలకు ముందు నుంచి మద్యం పంపిణీ చేయరాదు.
► పోలింగ్ బూత్ వద్ద పార్టీలు, అభ్యర్థులు ఏర్పాటు చేసే క్యాంపుల వద్ద పోస్టర్లు, జెండాలు, గుర్తులు ఇతర ప్రచార సామగ్రి ప్రదర్శించరాదు. ఆహార పదార్థాలు పంపిణీ చేయరాదు.
► పోలింగ్ రోజు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి. పర్మిట్లు పొందిన వాహనాలకు స్టిక్కర్లు బాగా కానిపించే విధంగా అతికించాలి. ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసే హక్కు ప్రతీ భారతీయ పౌరునికి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment