
స్టాఫ్ నర్సు రిక్రూట్‌మెంటులో నకిలీ సర్టిఫికెట్లు వాస్
● ఆర్టీ రాధారాణి
మహారాణిపేట: స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియలో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు తేలింది. ఈ నెల 1వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘నర్సుల పోస్టులకు నకిలీ పత్రాలు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలలో నకిలీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు ఉన్నట్లు సాక్షి కథనంలో పేర్కొంది. దీనిపై ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి (ఆర్డీ) డాక్టర్ రాధారాణి విచారణ చేపట్టారు. కరోనా సమయంలో పనిచేసినట్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాల గురించి ఆర్డీ డాక్టర్ రాధారాణి సంబంధిత వ్యక్తులకు లేఖలు రాశారు. ముఖ్యంగా కేజీహెచ్ (కింగ్ జార్జ్ హాస్పిటల్) నుంచి అత్యధిక సంఖ్యలో ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు రావడంతో, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. శివానంద్‌కు ఆర్డీ డాక్టర్ రాధారాణి లేఖ రాశారు. ఈ సర్టిఫికెట్లు నకిలీవని కేజీహెచ్ నుంచి సమాధానం రావడంతో, ఆ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోలేదని ఆర్డీ డాక్టర్ రాధారాణి తెలిపారు. మొత్తం నకిలీ సర్టిఫికెట్లను పక్కన పెట్టామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్డీ వివరించారు.