సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము తెలిపారు. ఇటువంటి సంస్థల్లో శిక్షణ పొందే యువతకు ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని చెప్పారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)తో నాలుగు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో అనంతరాముతోపాటు నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మధుసూదనరెడ్డి, ఎండీ అర్జా శ్రీకాంత్ ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మధుసూదనరెడ్డి మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ, ఎంట్రప్రెన్యూర్‌షిప్ విభాగాల్లో రాష్ట్రాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారని, ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటివరకు 13 సంస్థలు ముందుకొచ్చినట్టు తెలిపారు. అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ తాజాగా ఐబీఎం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (ఎస్పీఐ), ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలు స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం అయ్యాయని వివరించారు. అర్జా శ్రీకాంత్, ఐబీఎం ఇండియా డైరెక్టర్ జగదీశభట్, ఎస్పీఐ డైరెక్టర్ జార్జినా ఫువా, ఐటీడీసీ ఎండీ జి.కమలవర్థన్ రావు, ఎల్వీ ప్రసాద్ అకాడమీ డైరెక్టర్ ఎ.సాయిప్రసాద్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. (చదవండి: న్యాయవాదితో రాజీనామా చేయిస్తే పచ్చరంగు మారుతుందా? )
మొత్తం 13 ఒప్పందాలు
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇప్పటికే 3 విడతలుగా 9 సంస్థలతో యువత భవిత మార్చే దిశగా ఎంవోయూలు కుదుర్చుకుంది. తాజాగా 4 ఎంవోయూలతో మొత్తం 13 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్టయింది.
ఐబీఎం ఇండియా
ఈ సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్, కోడింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చెయిన్, డేటా సైన్స్ – అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్, బిగ్ డేటా, ఫుల్ స్టాక్ తదితర కోర్సులు, ఇతర కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తుంది.
ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ
విశాఖపట్నంలో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. డిజిటల్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, వీఎఫ్‌ఎక్స్ అండ్ డిజిటల్ రిస్టోరేషన్, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ తదితర కోర్సులతో పాటు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లో శిక్షణ ఇస్తుంది.
సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్
అడ్వాన్స్ మాన్యుఫాక్చరింగ్, ఫుడ్ ఇన్నోవేషన్ – ఫుడ్ ప్రాసెసింగ్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి పరిశ్రమల నేతృత్వంలోని కోర్సులను నైపుణ్య కళాశాలల్లో అందించడానికి అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు, నిర్వహణకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా ల్యాబ్‌లు, కోర్సులను అభివృద్ధి చేయడం, ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం, ప్రతిపాదిత కోర్సుల్లో ఎస్‌ఎస్‌డీసీతో కలసి సర్టిఫికేషన్, అక్రిడిటేషన్ ఇవ్వడంతో పాటు టీచింగ్, లెర్నింగ్ మాడ్యూల్స్ ఫ్రేమ్‌వర్క్‌ను మరింత అభివృద్ధి చేయనుంది.
ఐటీడీసీ: ఆతిథ్య రంగంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయబోయే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు అవసరమైన సహాయ సహకారాలను భారత పర్యాటకాభివృద్ధి సంస్థ అందజేస్తుంది. కోర్సులు, పాఠ్యాంశాలు, అధ్యయన అంశాలను ఐటీడీసీ రూపొందిస్తుంది.
గతంలో కుదిరిన ఒప్పందాలు
సెప్టెంబర్ 16
► పాఠ్యాంశాల రూపకల్పనతో పాటు విశాఖలోని
లాజిస్టిక్స్ సెక్టార్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఏర్పాటు చేయనుంది.
► లైఫ్ సైన్సెస్ డొమైన్‌లో బయోకాన్ లిమిటెడ్ నైపుణ్య భాగస్వామి (నాలెడ్జ్ పార్ట్‌నర్)గా వ్యవహరించనుంది.
► విద్యుత్ రంగానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు, ఆటోమేషన్ అండ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సెక్టార్‌లో స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు స్నైడర్ ఎలక్ట్రిక్ అంగీకారం.
సెప్టెంబర్ 25
► ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో దాల్మియా భారత్ ఫౌండేషన్ నిర్మాణ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది.
► నైపుణ్యాభివృద్ధి కోర్సుల సిలబస్, శిక్షణ, సర్టిఫికేషన్ కోసం ఎన్‌ఎస్‌ఈ అకాడమీ లిమిటెడ్‌తో ఒప్పందం.
► నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో మరో ఒప్పందం.
అక్టోబర్ 22
► డెల్ టెక్నాలజీస్ విశాఖ ఐటీ సెక్టార్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు, స్కిల్ కాలేజీల్లో శిక్షణ ఇస్తుంది.
► ఆటోమోటివ్ విభాగంలో శిక్షణకు జేబీఎం గ్రూప్‌తో ఒప్పందం.
► లాజిస్టిక్స్ విభాగంలో సీఐఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ శిక్షణ ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment