మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ఓటర్ల జాబితా అవకతవకలకు టీడీపీ చేపట్టిన పలు కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసికెళ్లింది. అప్పట్లో సేవామిత్ర, ఇప్పుడు మై టీడీపీ యాప్‌లతో దొంగ ఓట్లు చేర్చడం, ఓట్ల గల్లంతుకు ఆ పార్టీ పాల్పడుతోందని ఆరోపించింది. ఓటర్లను కులం పేరు చెప్పాలంటూ ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధంగా ఆ పార్టీ పనిచేస్తోందని ఫిర్యాదు చేసింది.
మై పార్టీ డ్యాష్ బోర్డు డాట్ కాం పేరుతో ఓటరు ప్రొఫైలింగ్‌కు, టీడీపీ మ్యానిఫెస్టో డాట్ కాం పేరుతో ఓటరు పేరు, ఊరు, చిరునామా, జెండర్, వయసుతో పాటు కులం, సదరు వ్యక్తి మద్దతిచ్చే పార్టీ పేరు తెలుసుకుంటోందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ రెండు వెబ్‌సైట్ల సర్వర్లు విదేశాల్లో ఉన్నాయని, వివరాలన్నీ అక్కడే భద్రపరుస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే, ‘బాబు షూరిటీ–భవిష్యత్‌పై గ్యారెంటీ’ అంటూ ఒక బాండు పేపర్ ఇస్తూ ప్రజల్ని నిస్సిగ్గుగా మోసం చేస్తున్నారని కూడా వారు తెలిపారు. టీడీపీ ఎలక్షన్ సెల్ స్టేట్ కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ ఇచ్చిన ఒక తప్పుడు ఫిర్యాదుతో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, గురుమూర్తి, సత్యవతి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీలోని ఎన్నికల సంఘానికి వివరించింది. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు అంశాలను మీడియాకు వివరించారు. ఆయన ఏమన్నారంటే..
‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’తో మాల్‌ప్రాక్టీస్..
ఎన్నికల కమిషన్ డ్యాష్‌బోర్టులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’లో ఓటరు పేరు, ఊరు, చిరునామా, జెండర్, వయసు, కులంతో పాటు అతను సపోర్టుచేసే పొలిటికల్ పార్టీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలున్నాయి. రాజకీయ పార్టీల వారీగా ఓటర్లను వేరు చేయడమనేది చట్టవిరుద్ధ చర్యగా మేం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం.
టీడీపీ సేకరించిన ఈ డేటా మొత్తాన్ని అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక సర్వర్ పాయింట్ వద్ద స్టోర్ చేశారు. ఇదే తరహా మాల్‌ప్రాక్టీస్ గతంలోనూ టీడీపీ ‘సేవామిత్ర’ యాప్ ద్వారా సేకరించింది. అప్పట్లో ఆ యాప్‌పై మేం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.
దీనిపై హైదరాబాద్ మాదాపూర్ పీఎస్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ (174/2019) కూడా నమోదు చేసినా ఎలాంటి పురోగతి లేదన్న సంగతిని ఎన్నికల కమిషన్‌కు తెలిపాం. తాజాగా.. ‘మై పార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్’ ద్వారా టీడీపీ చేపట్టిన చట్టవిరుద్ధమైన కార్యక్రమంపై 120 (బి), 379, 420, 188 (ఐపీసీ), 72, 66 (ఐటీఏ–2000 యాక్ట్) కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాం.
టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్‌తో మరో కుట్ర..
ఇక ఓటరు అంగీకారంతో సంబంధం లేకుండా ఓట్లను ఉంచాలా.. తొలగించాలా అనే సమాచారం కోసం టీడీపీ మరో వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసుకుంది. మై పార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్ ద్వారా సేకరించిన డేటా మొత్తం న్యూయార్క్ సర్వర్‌లో దాస్తుంటే.. టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్ వెబ్‌సైట్ డేటా మొత్తాన్ని లండన్‌లోని మరో సర్వర్‌లో స్టోర్ చేస్తున్నారు.
టీడీపీ మేనిఫెస్టో డాట్‌కామ్ పేరిట ఎన్నికల కమిషన్ డ్యాష్ బోర్టులో ఇమేజ్ ఫార్మాట్‌లో ఉన్న సమాచారాన్ని ఎక్సెల్ ఫార్మేట్‌లోకి మార్చి ప్రతీ 30 ఓట్లను టీడీపీకి చెందిన ఒక ఏజెంట్‌కు అప్పగిస్తున్నారు. అతను తనకు కేటాయించిన 30 మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కులం, పొలిటికల్ గుర్తింపు, వారు ఏ రకమైన లబ్ధి పొందుతున్నారు, వారు ఆరాధించే మతం వంటి ఓటర్ల వ్యక్తిగతమైన డేటాను సేకరిస్తున్న విషయాలను ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా వివరించాం.
‘బాబు ష్యూరిటీ... భవిష్యత్‌కు గ్యారెంటీ’పై ఫిర్యాదు..
అలాగే, క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి చట్టవిరుద్ధంగా సమాచారాన్ని సేకరించడం టీడీపీ మాల్‌ప్రాక్టీస్‌లో ఒక భాగమైతే.. 2024 నుంచి రాబోయే ఐదేళ్లలో టీడీపీ పథకాల ద్వారా ఓటరు ఎంత మేలు పొందుతాడనేది లెక్కలేసి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ’ అనే ప్రమాణపత్రంతో కూడిన కార్డుల్ని వారు పంపిణీ చేస్తున్నారు. ఇలా దాదాపు 2 లక్షల 40 వేల మందికి వాటిని అందజేశారు. దీనిపైనా ఆధారాలతో సీఈసీకి ఫిర్యాదు చేశాం.
4.36 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించాం..
మరోవైపు.. ఓటర్ల పేర్లలో ఒకటో రెండో అక్షరాలను మార్పుచేసి వారు స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు పేర్కొంటూ ఓట్లు చేర్పించే కార్యక్రమానికి టీడీపీ తెగబడింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓట్లను కూడా ఏపీ ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చే మాల్‌ప్రాక్టీస్ జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 4 లక్షల 36 వేల 268 ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలోనూ ఇటూ ఏపీలోనూ డూప్లికేటింగ్ ఓట్లుగా కనిపిస్తున్నాయి. ఈ వివరాల్ని ఆధారాలతో సహా సీఈసీకి అందజేసి, వీటన్నింటినీ జాబితా నుంచి తొలగించాలని కోరాం.
పవన్ సోదరుడు నాగబాబు కుటుంబం బరితెగింపు..
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబు, అతని భార్య, కుమారుడు ఇప్పుడు కొత్త ఓటు కోసం ఏపీలోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్‌బూత్–168లో కొణిదల నాగబాబు (సీరియల్ నెంబర్–323), కొణిదల పద్మజ (సీరియల్–324), సాయి వరుణ్‌తేజ్ (సీరియల్ నెంబర్–325) ఓటువేశారు. వీరు తాజాగా ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓట్ల కోసం ఫారం–6తో దరఖాస్తు చేసుకున్నారు. నాగేంద్రబాబు అక్కడి ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేయగా.. ఇక్కడ నాగేంద్రబాబుగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణలో ప్రత్యేక శిబిరాలు..
ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో అక్కడున్న ఏపీ సెటిలర్స్ త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో పాల్గొనేందుకు టీడీపీ వ్యూహం పన్నింది. ఇందుకోసం తెలంగాణలో ప్రత్యేకంగా ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటుచేసి ఆన్‌లైన్‌లో ఓటర్ల నమోదు చేస్తున్నారు. టీడీపీ అనుకూల సామాజికవర్గ ఓటర్లను తెలంగాణ జాబితాలో తొలగించకుండానే ఏపీలోనూ వారికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రయత్నిస్తున్న విషయాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసికెళ్లాం.
చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తుల్ని ప్రోత్సహించొద్దు..
టీడీపీ ఎలక్షన్ సెల్ స్టేట్ కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ ఇచ్చిన ఒక తప్పుడు ఫిర్యాదుతో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఎన్నికల సంఘం దృష్టికి తీసికెళ్లాం. అతను డూప్లికేటింగ్, డబుల్ ఎంట్రీస్, నాన్ లోకల్ కింద ఏపీలో మొత్తం 10 లక్షల ఓట్లు ఉన్నట్లు.. వాటిపై ఎంక్వైరీ చేయాలని గతంలో సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎంక్వైరీ చేయాలని పైనుంచి ఆదేశాలు రావడంతో.. అధికారులు వారి సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తే ఫిర్యాదులో నిజంలేదని తేలింది. దీనిబట్టి కోనేరు సురేష్ ఎన్నికల సంఘం సమయాన్ని ఎంతగా వృధా చేశాడో అర్ధం చేసుకోవాలని సీఈసీ తెలిపాం. దీనిని చట్టవ్యతిరేక చర్యగా పరిగణించాల్సిందిగా ఫిర్యాదు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment