రమేష్‌ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు | Sakshi
Sakshi News home page

రమేష్‌ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు

Published Mon, May 6 2024 9:35 AM

రమేష్‌ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు

● బీజేపీ ఎంపీ అభ్యర్థిపై ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించాలి

అనకాపల్లి: చెరకు పంటకు నిలయమైన ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రశాంత వాతావరణంలో స్వీట్‌గా జరిగేవని, నేడు కడప నుంచి దిగుమతి అయిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ పచ్చని పల్లెల్లో కడప ఫ్యాక్షనిజాన్ని పరిచయం చేస్తూ అల్లర్లు, గలాటాలకు కారణమవుతున్నారని సీపీఐ మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఇంటిపై 200 మందికి పైగా ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకొని వెళ్లి దౌర్జన్యం చేశారని, మొండిగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ దేవరాపల్లి తారువలో స్థానిక ప్రజలపై దాడి చేస్తూ అక్రమంగా బైఠాయించారని అన్నారు. అక్కడ ప్రజలను రెచ్చగొట్టి దౌర్జన్యం చేయడమే కాకుండా సీఎం రమేష్‌ తనపైనే దాడి జరిగిందని ముసలి కన్నీరు కార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇళ్లపై డ్రోన్లు ఎగరేస్తూ ఇంట్లో ఉండే మహిళలు, చిన్నపిల్లల రక్షణకు ప్రమాదంగా మారిన ఈ సంస్కృతిని నివారించాలని ఆయన కోరారు. అధికార యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రధాని మోదీ ఉత్తరాంధ్ర సమస్యలు పరిష్కరించాలి

జిల్లాలోని కశింకోటలో సోమవారం సాయంత్రం పర్యటిస్తున్న మోదీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోను, మెట్రో రైలు ప్రాజెక్ట్‌, సుజల స్రవంతి, షుగర్‌ ఫ్యాక్టరీల ఆధునికీకరణ, ఆంధ్రకు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ప్లాంట్‌, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లా ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని గంటా శ్రీరామ్‌ అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు అల్లు రాజు, దాకారపు శ్రీనివాసరావు, నాగిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement