పేదింట విషాదం | Sakshi
Sakshi News home page

పేదింట విషాదం

Published Mon, May 6 2024 9:35 AM

పేదింట విషాదం

● లగేజి ఆటో నుంచి జారిపడి విద్యార్థి దుర్మరణం

యలమంచిలి రూరల్‌ : వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా కాలేజీ చదువుల కోసం కూలి పనికి వెళ్లిన ఓ పదో తరగతి ఉత్తీర్ణుడైన విద్యార్థి ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల 10వ తరగతి ఉత్తీర్ణుడైన తమ కుమారుడు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకుంటాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. విగతజీవిగా మారిన కొడుకుని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. వివరాలివి. కశింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన గూడుపు అర్జున్‌ చిన్న కుమారుడు సతీష్‌ (17) వేసవి సెలవులను ఆటపాటలతో వృధా చేయకుండా ఏదో పనిచేసి కొంత మొత్తాన్ని సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లిలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. షేకిళ్లపాలెం వద్ద రాము అనే టెంట్‌ హౌస్‌ యజమాని వద్ద రోజువారీ కూలి పనిలో చేరాడు. శనివారం ఓ లగేజీ ఆటోలో టెంట్‌హౌస్‌ సామగ్రిని తీసుకెళ్తుండగా సామగ్రికి కట్టిన తాడు ఊడిపోవడంతో తొట్టెలో ప్రయాణిస్తున్న సతీష్‌ రోడ్డుపై పడిపోయాడు. అతడిపై టెంట్‌హౌస్‌ సామగ్రి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. యలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి షేకిళ్లపాలెం కూడలికి సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనపై మృతుని సోదరుడు మోహన్‌సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పైల సింహాచలం ఆదివారం రాత్రి మీడియాకు తెలిపారు. మృతదేహానికి యలమంచిలి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్‌ఐ చెప్పారు.

Advertisement
Advertisement