No Headline - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Jun 15 2024 1:24 AM

No Headline

తుమ్మపాల: చక్కని రహదారులు.. ఎటు చూసినా పచ్చదనం.. అధునాతన భవనాల నిర్మాణం.. పర్యాటక కేంద్రంగా ఎదిగిన బొజ్జన్నకొండ ఇప్పుడు సందర్శకులకు కనువిందు చేస్తోంది. బౌద్ధ స్ధూపాలు, చైచ్యాలు, గుహలు, బౌద్ధ వేదశాల, చరిత్రను ప్రతిబింబించే పురాతన శిలలు ఇక్కడి ప్రత్యేకత. దీంతోపాటు లింగాలకొండ బొజ్జన్నకొండను ఆనుకుని ఉండటం మరో విశేషం. గౌతమబుద్ధుడు ఇక్కడ నడయాడినట్లు చరిత్ర చెబుతుంది. ఒకప్పుడు మచ్చుకై నా గుర్తింపులేని బొజ్జన్నకొండ.. మాజీ ఎంపీ బి.వి.సత్యవతి ఎంపీ ల్యాడ్స్‌ నిధులు వెచ్చించి, రూ.7.5 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యేలా కృషి చేయడంతో కొత్త రూపు సంతరించుకుంటోంది. బొజ్జన్నకొండకు అత్యంత నాణ్యమైన రహదారి నిర్మించారు. అధునాతన సోలార్‌ లైట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి అధునాతన భవనాలను నిర్మించేందుకు కృషి చేసింది. ఇప్పుడు శరవేగంగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పురాతన కట్టడాలు శిథిలమవ్వకుండా మరమ్మతులు చేపడుతున్నారు.

పెరిగిన పర్యాటకులు

గత ప్రభుత్వాలు ఈ బౌద్ధ క్షేత్రాన్ని నిర్లక్ష్యం చేశాయి. హైవే నుంచి ఇక్కడకు రావాలంటే పెద్ద గోతులతో ఉన్న రహదారిని దాటుకొని రావాలి. అందుకే పర్యాటకులు బెంబేలెత్తిపోయేవారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. నూతన జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న బొజ్జన్నకొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అత్యధిక నిధులు వెచ్చించారు. దీంతో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు సాయంత్రం అయ్యేసరికి వంద ల సంఖ్యలో కొండ వద్దకు తరలివస్తున్నారు. తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి విముక్తి పొందుతూ సేద తీరుతున్నారు. వేసవి సెలవుల్లో చిన్నారులు బొజ్జన్నకొండ వద్దనే ఆటపాటలతో సందడి చేశారు. దీంతో ఇక్కడ చిరు వ్యాపారాలు కూడా జోరందుకున్నాయి. జిల్లా టూరిజం శాఖ మంచినీరు, వాష్‌రూమ్‌ సౌకర్యం కల్పించింది. అనకాపల్లి–చోడవరం రహదారిలో తుమ్మపాల ఏలేరు కాలువ మీదుగా, అనకాపల్లి–సబ్బవరం రహదారి శంకరం ఏలేరు కాలువ మీదుగా కూడా సందర్శకులు రాకపోకలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో పరిసర ప్రాంత ప్రజలు వాకింగ్‌, జాగింగ్‌, వ్యాయామం కోసం ఇక్కడకు వస్తున్నారు.

ప్రవేశం ఉచితం

అనేక సౌకర్యాలు, చక్కని గ్రీనరీతో తీర్చిదిద్దిన బొజ్జన్నకొండ సందర్శనకు ప్రవేశం ఉచితం. కేవలం ఆధార్‌ కార్డు చూపించి బొజ్జన్నకొండపైకి ప్రవేశించవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశం కల్పిస్తున్నారు. వందల సంఖ్యలో పెద్దలు, చిన్నారులు వచ్చి ఆటపాటలతో సందడి చేస్తున్నారు.

బొజ్జన్నకొండకు సందర్శకుల తాకిడి

చిన్నారుల సందడితో కళకళ

టూరిస్టు స్పాట్‌గా తీర్చిదిద్దడంతో

పెరిగిన ఆదరణ

Advertisement
 
Advertisement
 
Advertisement