నక్కపల్లి క్లస్టర్‌లో స్టీల్‌ప్లాంట్!
నక్కపల్లి: విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్‌లో క్లస్టర్‌గా ఉన్న నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్.. జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ జాయింట్ వెంచర్ కంపెనీ మండలంలో రాజయ్యపేట సమీపంలో పోర్టు ఆధారిత ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. కంపెనీ ఏర్పాటుకు అవసరమైన భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ప్రాజెక్టు కోసం 2,200 ఎకరాలు, టౌన్‌షిప్ అభివృద్ధి కోసం మరో 440 ఎకరాలు కేటాయించాలని మిట్టల్ గ్రూపు ప్రభుత్వాన్ని కోరింది. పోర్టు ఆధారిత ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్న రాజయ్యపేట ప్రాంతాన్ని కంపెనీ ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఉక్కుపరిశ్రమకు అవసరమైన భూములు గుర్తించాలని, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఏపీఐఐసీ ద్వారా అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఏడాదికి 7.30 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. మొదటి విడతలో 2,200 ఎకరాలు కేటాయించాలని మిట్టల్ గ్రూపు ధరఖాస్తు చేసింది. సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
కంపెనీ మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు
స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం కంపెనీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్ కోసం జాతీయ రహదారి నుంచి వేంపాడు, కాగిత, న్యాయంపూడి మీదుగా ప్రాజెక్టు సైటు వరకు 4 లైన్ల కనెక్టివిటీ రోడ్డును నిర్మించాలి. సమీపంలో ఉన్న గుల్లిపాడు రైల్వే స్టేషన్ నుంచి ప్రతిపాదిత ప్రాజెక్టు వరకు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ముడిసరకు రవాణా కోసం 42 కిలోమీటర్ల పైపులైను (కిరండూల్–విశాఖ) ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రెండోదశలో ఏర్పాటు చేయబోయే స్టీల్‌ప్లాంట్ కోసం మరో 3,800 ఎకరాల భూములను కేటాయించాలని కంపెనీ ప్రభుత్వాన్ని కోరింది. విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీఐఐసీ ద్వారా మండలంలో రాజయ్యపేట, వేంపాడు, చందనాడ, అమలాపురం, డీఎల్‌పురం గ్రామాల పరిధిలో 4,314 ఎకరాలను సేకరించింది. నష్టపరిహారం, ప్యాకేజీ చెల్లింపుల ప్రక్రియ దాదాపు పూర్తయింది. 3,874 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మిగిలిన విస్తీర్ణానికి సంబంధించి కోర్టు కేసులు, గ్రామకంఠాలు, పరిహారం, ప్యాకేజీ చెల్లింపుల ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.
భూ సేకరణకు కసరత్తు
ఆర్సెలార్ మిట్టల్ కంపెనీ కోరిన 2,200 ఎకరాలను సేకరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రాజయ్యపేట, బోయపాడు, పెదతీనార్ల, చినతీనార్ల, తదితర గ్రామాల పరిధిలో అందుబాటులో ఉన్న భూములను అధికారులు గుర్తిస్తున్నారు. విలేజ్ మ్యాప్‌ల ద్వారా భూములను పరిశీలిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ కోరిన భూములు సేకరించడానికి ఏపీఐఐసీ వారు ఫేజ్ 2 కింద భూసేకరణ కోసం 4 (1) నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో జిరాయితీ భూమి ఎంత, డీఫారం, ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి అనే వివరాలు అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటయితే ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 20 వేలమందికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఆర్సెలార్ మిట్టల్–నిప్పన్ స్టీల్ జాయింట్ వెంచర్ సుముఖత
2,640 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు
Comments
Please login to add a commentAdd a comment