
అనంతపురం శ్రీకంఠం సర్కిల్/ సెంట్రల్: ‘నన్ను అరెస్టు చేస్తారు మహాప్రభో.. ధర్నాలు చేసి మద్దతు తెలపండి’ అని రెండు రోజుల క్రితం స్వయంగా ఆయనే విజ్ఞప్తి చేశారు. రచ్చ చేయండి.. అగ్గి రాజేయండి అని పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చారు. ఆయన చెప్పినట్టు అరెస్టయితే జరిగింది కానీ, ఆ పార్టీ నాయకులు ఏమనుకున్నారో ఏమో తూతూ మంత్రపు నిరసనలతో సరిబెట్టారు. తప్పు చేసినట్లు చంద్రబాబుకే తెలిసిపోయింది.. దానికి మేమెందుకు రోడ్డెక్కాలి అనుకున్నట్లుగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా అసలు స్పందించనే లేదు.
వెరసి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న చంద్రబాబుకు జిల్లాలో సంఘీభావం కరువైంది. ఉనికి చాటుకునేందుకు మాత్రమే టీడీపీ నేతలు అక్కడక్కడా నిరసనలు తెలిపారు. కానీ ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. చివరకు టీడీపీ కార్యకర్తల నుంచి కూడా మద్దతు లభించలేదు. పలు ప్రాంతాల్లో నేతలపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ‘తప్పు చేసిన వారిని అరెస్టు చేయక.. ఇంకేం చేస్తారు.. అయినా అక్కడెక్కడో అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నా చేసి, సామాన్యులను ఇబ్బంది పెట్టడమే మీ రాజకీయమా’ అంటూ ఎదురుదాడికి దిగడంతో టీడీపీ నేతలు కంగు తిన్నారు.
పోలీసుల అప్రమత్తం..
చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రధాన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు చేపట్టారు. బస్టాండు, రైల్వే స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. టీడీపీ ముఖ్య నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరితో పాటు పరిటాల శ్రీరామ్, బుల్లే శివబాలను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ క్లబ్ ముందు రోడ్డుపై బైఠాయించిన కొంత మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
యథావిధిగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు
‘పల్లె’ అభాసుపాలు..
టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ అంటూ షెల్ కంపెనీలకు ప్రభుత్వ సొమ్మును షెల్ కంపెనీలకు తరలించి శనివారం చంద్రబాబు అరెస్టయితే, నిరసన అంటూ రచ్చ చేసి కార్యకర్తలను తనకు అనుకూలంగా మలచుకుందామనుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అభాసుపాలయ్యారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. అనంతపురం నుంచి తన సొంత నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నిరసనకు దిగుదామని తలచిన ఆయనకు అక్కడ మాత్రం భిన్నమైన స్పందన లభించింది. ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకు సహకరించలేదు. దీంతో కొంత మంది తన అనుయాయులతో హడావుడి చేశారు.
టీడీపీ నేతలు ఆందోళనలు చేపడతారనే ముందస్తు సమాచారంతో బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు ఉదయం కాసేపు డిపోలకు పరిమితం చేశారు. కానీ జిల్లాలో వారి పెద్దగా ప్రభావం లేదని తెలుసుకుని, ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా బస్సులను యథావిధిగా తిప్పారు. జిల్లా వ్యాప్తంగా రోజూ 405 సర్వీసులను ఆర్టీసీ సంస్థ నడుపుతోంది. అనంతపురం డిపో 82, గుత్తి 23, గుంతకల్లు 46, కళ్యాణదుర్గం 62, రాయదుర్గం 48, తాడిపత్రి 92, ఉరవకొండ డిపోలో 52 సర్వీసులున్నాయి. మధ్యాహ్నానికి 51 శాతం సర్వీసులు నడిచాయి.
సాయంత్రం వంద శాతం బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.వారాంతం కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సౌలభ్యం దృష్ట్యా ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకొని, కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సు సర్వీసులను నడిపినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సుమంత్ ఆర్ ఆదోని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment