ఎన్‌ఎంఎంఎస్‌ గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంఎంఎస్‌ గడువు పొడిగింపు

Published Sat, Sep 7 2024 12:38 AM | Last Updated on Sat, Sep 7 2024 12:38 AM

-

ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

అనంతపురం ఎడ్యుకేషన్‌: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష దరఖాస్తుకు గడువు పొడిగించారు. వాస్తవానికి ఈ నెల ఐదో తేదీతోనే దరఖాస్తు గడువు ముగిసింది. తాజాగా ఈ నెల 17 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 8న ఈ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో ప్రతిభ చాటిన 8వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి నుంచి వరసగా నాలుగేళ్లు ఏడాదికి రూ.12 వేలు చొప్పున రూ.48 వేలు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనం అందించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అవకాశం. జిల్లా విద్యాశాఖ అధికారుల అలసత్వం కారణంగా జిల్లాలో 20,500 మంది విద్యార్థులకు గాను నాలుగు రోజుల కిందట వరకు 260 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. పత్రికా ప్రకటనలకు పరిమితమైన అధికారులు క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులపై ఒత్తిళ్లు చేయలేదు. ప్రతిభగల పేద విద్యార్థులకు వరంలా ఉండే ఈ పథకం పట్ల గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేక ఎక్కువమంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఇంత మంచి కార్యక్రమంపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి తెలియజేయాల్సిన విద్యాశాఖ అధికారులు తూతూమంత్రంగా ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ప్రత్యేక దృష్టి సారించి కనీసం ఈ పది రోజుల్లోనైనా వీలైనంత ఎక్కువమంది విద్యార్థులతో ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు దరఖాస్తు చేయించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వరలక్ష్మి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందనాయక్‌ తెలిపారు.

సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మునిసిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాధమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని మోడల్‌ స్కూళ్లలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కుటుంబ సంవత్సరాదాయం రూ.3.50 లక్షలలోపు ఉన్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థి ఆధార్‌ కార్డ్‌లో ఉన్న విధంగానే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ధ్రువపత్రాలూ అవసరం లేదని, పరీక్ష రాసే సమయానికి అన్నీ సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులుు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 2023 డిసెంబర్‌లో పరీక్ష రాసి ఎంపికై న విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా విద్యార్థుల ద్వారా ప్రధానోపాధ్యాయుల సమక్షంలో చేయాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement