రాష్ట్రంలో అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన

Published Fri, Oct 11 2024 2:54 AM | Last Updated on Fri, Oct 11 2024 2:54 AM

రాష్ట్రంలో అరాచక పాలన

అనంతపురం కార్పొరేషన్‌: సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. మద్యం, ఇసుక పాలసీల్లో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రైం రేటు పెరిగిందన్నారు. మద్యం పాలసీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. మద్యం సిండికేట్‌తో ఎవరూ దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ‘ఎన్నికల్లో నెగ్గడానికి రూ.కోట్లు ఖర్చు చేశాం, ఆ డబ్బు రాబట్టుకోవడానికి ఇసుక, మద్యం పాలసీ ఉపయోగించుకుంటున్నాం’ అన్న ధోరణిలో ప్రజాప్రతినిధులు ముందుకెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్‌గా చేయాలని సీఎం చంద్రబాబు చూడడం దురదృష్టకరమన్నారు. సాక్షాత్తూ మంత్రి నారాయణ రూ.2 కోట్లతో వంద మద్యం షాపులకు టెండర్లు వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కొత్త బ్రాండ్లు తెచ్చారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. నేడు సీఎం చంద్రబాబు రూ.99 కే క్వార్టర్‌ మద్యం అంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మద్యం సిండికేట్‌ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల మధ్యే భేదాభిప్రాయాలు నెలకొన్నాయన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పిన చంద్రబాబు పరోక్షంగా బ్లాక్‌ మార్కెట్‌కు తలుపులు తెరిచారన్నారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ ఉంచితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే ఆ ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మేసి ప్రజాప్రతినిధులు జేబులు నింపుకున్నారన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిఽథ్యం వహిస్తున్న ఉరవకొండలోని కాలువపల్లి, కూడేరు, నరసాపురం, విడపనకల్లులో ఇసుక దోచేస్తున్నారన్నారు. గతంలో ‘సెబ్‌’ నిఘా ఉండేదని, ఈ ప్రభుత్వం అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. నిర్మాణరంగం కుదేలై పనులు లేవంటూ కూలీలు ధర్నాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అరాచక పాలనపై ఉద్యమించడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

మద్యం పాలసీలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం

ఉచిత ఇసుక అని బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు

దోపీడీనే పనిగా పెట్టుకున్న

కూటమి ప్రజాప్రతినిధులు

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ధ్వజం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement