పల్లె పండుగ జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పల్లె పండుగ జయప్రదం చేయాలి

Published Fri, Oct 11 2024 2:54 AM | Last Updated on Fri, Oct 11 2024 2:54 AM

పల్లె పండుగ జయప్రదం చేయాలి

అనంతపురం అర్బన్‌: జిల్లాలో ‘పల్లె పండుగ– పంచాయతీ వారోత్సవాలను’ ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించి జయప్రదం చేయాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పల్లెపండుగ– పంచాయతీ వారోత్సవాలను గ్రామాల్లో చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలను పండుగ వాతావరణంలో ప్రారంభించాలని చెప్పారు. పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాసమాచార బోర్డులను తప్పక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీల్లో చేపట్టే పనులకు భూమిపూజ కార్యక్రమాల ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ఉపాధి పథకం ద్వారా ఏ పనులు చేపట్టాలో గుర్తించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం, రోడ్లు, కాలువల నిర్మాణం తదితర పనులు చేపట్టేలా చూడాలన్నారు. పంచాయతీల్లో చేపట్టబోయే పనులు గతంలో చేయలేదని ఏఈ, డీఈ, ఈఈ, ఇలా పైస్థాయి వరకు సర్టిఫై చేయాలన్నారు. పనుల జాబితా, గ్రౌండింగ్‌ చేసిన పనులను జియోట్యాగ్‌ చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు అందేలా నియోజకవర్గ, మండలస్థాయి ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారులందరూ నిబద్ధతతో పనిచేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమస్థాయిలో నిలపాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ సలీమ్‌బాషా, డీపీఓ నాగరాజు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓలు, పంచాయతీరాజ్‌, వ్యవసాయ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

వాటర్‌ హార్వెస్టింగ్‌లో

జిల్లా అగ్రస్థానం

రూఫ్‌ టాప్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పనుల్లో రాష్ట్రంలో జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోందని కేంద్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శంభునాథ్‌గుప్తకు కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలియజేశారు. జలశక్తి అభియాన్‌, జై సంచయ్‌ జన్‌ భాగీదారి అమలుపై ఆయన గురువారం ఢిల్లీ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. జిల్లాలో జలశక్తి అభియాన్‌తో పాటు జై సంచయ్‌ జన్‌ భాగీదారి అమలుకు సంసిద్ధంగా ఉన్నామని ముఖ్యకార్యదర్శికి కలెక్టర్‌ చెప్పారు. రూఫ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌కు సంబంధించి 175 పనులు చేపట్టి జిల్లాను అగ్రస్థానంలో నిలిపామన్నారు. స్వచ్ఛత మే జన్‌ భాగీదారీ అంశంలో జిల్లాకు రాష్ట్రస్థాయిలో అవార్డు దక్కిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఏడు లక్షల మొక్కలు నాటామన్నారు. అమృత్‌ సరోవర్‌ కింద 75 పనులు పూర్తి చేశామన్నారు. ఉపాధి పనుల్లో భాగంగా జిల్లాలోని దేవాలయాల వద్ద ఉన్న కోనేరుల్లో పూడికతీత, పునరుద్ధరణ పనులను, చెక్‌డ్యామ్‌, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌, జలాశయ, బోర్‌వెల్‌ రీచార్జ్‌ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతి వర్షపు చినుకును సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్‌, ఎస్‌ఈ శ్రీరామ్‌, డ్వామా పీడీ సలీమ్‌బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement