ఒక మద్యం షాపునకు 42 దరఖాస్తులు
కర్ణాటక సరిహద్దు మండలాల మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు
విడపనకల్లులో ఫుల్ డిమాండ్
ఒక మద్యం షాపునకు 42 దరఖాస్తులు
అనంతపురం నగరంలోని షాపులకు కూడా ఇన్ని దరఖాస్తులు కరువు
ఆర్థికమంత్రి నియోజకవర్గంలోని మండల కేంద్రంపైనే అందరి చూపు
కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న బొమ్మనహాళ్, రాయదుర్గం షాపులకూ గిరాకీ
అక్రమ మద్యం వ్యాపారం చేయవచ్చనే ఉద్దేశంతోనే మాఫియా ఎత్తుగడ!
రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొంది. అన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో మద్యం షాపుల కోసం పోట్లాడుకుంటుంటే జిల్లాలో మాత్రం మారుమూల కర్ణాటక సరిహద్దుల్లో ఉండే షాపులకు భారీ పోటీ నెలకొంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలోని విడపనకల్లు మండలంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు అందిన భారీ దరఖాస్తులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని మారుమూల మండల కేంద్రం విడపనకల్లు. కానీ మద్యం షాపుల దరఖాస్తుల్లో జిల్లాలోనే ఇక్కడ ఎక్కువ నమోదు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పట్టుమని 30 వేలు జనాభా కూడా లేని ఈ మండల కేంద్రానికి రెండు షాపులు కేటాయించగా.. ఎక్కడా లేని విధంగా ఒక షాపునకు 43, మరో షాపునకు 35 దరఖాస్తులు వచ్చాయి. తక్కువ జనాభా ఉన్న ఈ మండల కేంద్రంలో దుకాణాల ఏర్పాటుకు ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం అంతుచిక్కడం లేదు. వీటితో పాటు బళ్లారికి ఆనుకుని ఓబులాపురం దగ్గర ఉండే డీ హీరేహాళ్ మండలంలో ఒకే షాపునకు 33 దరఖాస్తులు రావడం చర్చనీయాంశమైంది. ఈ ప్రాంతాల్లో మద్యం షాపు దక్కించుకుంటే కర్ణాటక మద్యం ధర తక్కువైనప్పుడు ఇక్కడ అధికారికంగా విక్రయించవచ్చు లేదా ఏపీ మద్యం ధర తక్కువైతే కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు.
ఆ ఇద్దరి మధ్యే పోటీ..
విడపనకల్లు మండలంలో మద్యం పేరు చెబితే గిడ్డు మారయ్య, గడ్డం మారయ్యలే గుర్తుకొస్తారు. దశాబ్దాలుగా వీరిరువురూ మద్యం వ్యాపారంలో ఆరితేరారు. ఇద్దరూ టీడీపీ నాయకులే కావడం గమనార్హం. ఇప్పుడు ఎలాగూ ప్రభుత్వం వారిదే కాబట్టి ఇక్కడ మద్యం షాపులు దక్కించుకుంటే ఎవరూ అడ్డుచెప్పరనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రభావం కూడా పెద్దగా లేదు కాబట్టి కర్ణాటక చీప్‌లిక్కర్‌గా పేరుగాంచిన టెట్రా ప్యాకెట్లు విచ్చలవిడిగా అమ్ముకోవచ్చుననే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.
15 షాపులకు భారీగా దరఖాస్తులు..
జిల్లాకు ఒక్క తాడిపత్రి మినహా మిగతా అన్ని వైపులా కర్ణాటక సరిహద్దు ఉంది. జిల్లాలోని 136 షాపులకు గురువారానికి 1,927 దర ఖాస్తులు అందాయి. కణేకల్లు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్, రాయదుర్గం అర్బన్ ప్రాంతాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ మద్యం షాపులు దక్కించుకుంటే కర్ణాటక నుంచి అక్రమ మద్యం వ్యాపారం చేయవచ్చన్నది వ్యాపారుల ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎలాగూ పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఉన్నారు కాబట్టి ఎవరూ ఏమీ అనరనేది మద్యం మాఫియా ధీమా. కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఏర్పాటు కానున్న షాపులన్నింటికీ భారీగానే దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment