పరిశీలన మాటున పిడుగు!
రాయదుర్గం: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారిపై చంద్రబాబు సర్కారు కత్తి కట్టింది. పింఛన్ల తొలగింపునకు వైద్యులు, సిబ్బందిని రంగంలోకి దించింది. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల పరిశీలన ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వచ్చే నెల ఫిబ్రవరి వరకూ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
కోత పెట్టేందుకే..
అనర్హుల ఏరివేత ముసుగులో భారీగా కోత పెట్టేందుకు కూటమి సర్కారు కుట్రలు పన్నుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా ఏ ఆటంకం లేకుండా పింఛన్ అందుకుంటున్న వారిలో ఆందోళన మొదలైంది. ఇళ్ల వద్దకు వెళ్తున్న సిబ్బంది అక్కడికక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైకల్య ధ్రువీకరణ పత్రాలు కొత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి దాకా జరిగిన సర్వేలో కొన్ని లోటుపాట్లు గుర్తించినట్టు తెలిసింది. దీంతో తమ పింఛన్లు ఉంటాయో? ఊడతాయో? అన్న భయంతో పేదలు వణికిపోతున్నారు. ఇన్నాళ్లు వైద్య ఖర్చులకు భయం లేకుండా పోయిందని, పింఛన్లు తొలగిస్తే రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ అంటూ..
దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వారందరికీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య ఖర్చులు, జీవనానికి సరిపడా మొత్తాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించారు. ఠంఛన్‌గా ఒకటో తేదీన ఇళ్లవద్దే సొమ్ము పంపిణీ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం పింఛన్లకు కోతపెట్టేలా కుట్రలు చేస్తుండటంతో లబ్ధిదారులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అర్హులకు ఏమాత్రం అన్యాయం జరిగినా రోడ్డెక్కాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
పింఛన్ల తొలగింపునకు
చంద్రబాబు సర్కారు కుట్రలు
జిల్లా వ్యాప్తంగా ‘అనారోగ్య పెన్షన్’ లబ్ధిదారులకు పరీక్షలు
కోత వేసేందుకే కుయుక్తులు
పన్నుతున్నారని సర్వత్రా విమర్శలు
ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న పేదలు
ఆందోళన అవసరం లేదు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారందరినీ వైద్యులు, సిబ్బంది పరిశీలిస్తారు. తాజా స్థితిగతులను అంచనా వేస్తారు. వైకల్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అర్హత కలిగిన వారి పింఛన్లు ఏ ఒక్కటి తొలగించే అవకాశం లేదు. పరీక్షల కోసం ఇళ్ల వద్దకు వచ్చే వైద్యులు, సిబ్బందికి పింఛనుదారులు సహకరించాలి.
– ఈశ్వరయ్య,
డీఆర్‌డీఏ పీడీ
Comments
Please login to add a commentAdd a comment