‘యంగ్‌ ఇండియా’ బేడీ ఇక లేరు | - | Sakshi
Sakshi News home page

‘యంగ్‌ ఇండియా’ బేడీ ఇక లేరు

Published Tue, Jan 21 2025 1:28 AM | Last Updated on Tue, Jan 21 2025 1:28 AM

‘యంగ్‌ ఇండియా’ బేడీ ఇక లేరు

‘యంగ్‌ ఇండియా’ బేడీ ఇక లేరు

వయోభారంతో కన్నుమూసిన గ్రామీణ ఉపాధి హామీ హక్కుల ఉద్యమకారుడు

పెనుకొండ రూరల్‌:యంగ్‌ఇండియా ప్రాజెక్టును స్థాపించి..ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ హక్కుల కోసం ఉద్యమించిన నరేంద్ర సింగ్‌ బేడీ (86) ఇకలేరు. వయో భారంతో సోమవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని యంగ్‌ ఇండియా ఫారంలోని తన నివాసంలో కన్నుమూశారు. బేడీ 1939 సంవత్సరంలో కోల్‌కతాలో జన్మించారు. అమెరికాలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివి.. కొంతకాలం అక్కడే ఉద్యోగం చేశారు. 1969లో స్వదేశానికి తిరిగొచ్చారు. 1975–76 మధ్య కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండకు వచ్చారు. పెనుకొండ మండలం గుట్టూరు వద్ద 44వ జాతీయ రహదారికి సమీపంలో యంగ్‌ ఇండియా ప్రాజెక్టు కార్యాలయాన్ని ప్రారంభించారు. తీవ్ర కరువు, పేదరికంతో జిల్లా కొట్టుమిట్టాడుతున్న ఆ రోజుల్లో రైతులు, గ్రామీణ శ్రామికులు, పేదల హక్కుల కోసం ఉద్యమించారు. భూ పోరాటాలతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. యంగ్‌ ఇండియా ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేశారు. రైతు సహకార, వ్యవసాయ కూలీల, మహిళా సంఘాలను ఏర్పాటు చేసి..ఆయా వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వృద్ధిలోకి వచ్చేలా చైతన్య పరిచారు. దివ్యాంగులకు చేయూతనిచ్చారు.

ఉపాధి హామీ కోసం ఉద్యమం

పేదల అభివృద్ధికి ప్రభుత్వాల చేయూత కావాలనే సంకల్పంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం నరేంద్ర సింగ్‌ బేడీ ఉద్యమించారు. గుట్టూరు నుంచి సంస్థ సభ్యులతో కలసి ఢిల్లీ వరకు సైకిల్‌ యాత్ర చేపట్టి అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీకి వినతి పత్రం ఇచ్చారు. అలాగే లక్ష సంతకాలు సేకరించి.. సైకిల్‌ ర్యాలీగా వెళ్లి అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి గుడిసెల రామస్వామికి వినతి పత్రం అందజేశారు. అలాగే చుండూరులో దళితులపై దాడులు, మారణహోమాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజనులను చైతన్య పరిచారు. 1983లో భూ పోరాటాల్లో పాలుపంచుకున్నారు. నరేంద్ర సింగ్‌ బేడీ.. మణిశంకర్‌ అయ్యర్‌, దిగ్విజయ్‌ సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌ లాంటి ప్రముఖులకు సమకాలికులు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ..బేడీకి మూడేళ్ల జూనియర్‌. ఈయనకు భార్య సోనియాబేడీ, కుమారులు రాజీవ్‌, సంజయ్‌, కుమార్తె తారా ఉన్నారు.

నేడు అంత్యక్రియలు

బేడీ అంత్యక్రియలు మంగళవారం గుట్టూరు సమీపంలోని యంగ్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement