
సాక్షి, అమరావతి: యువతను మత్తులో ముంచెత్తుతూ.. వారి జీవితాలను నాశనం చేస్తూ.. దేశానికే పెను సవాల్‌గా నిలిచిన గంజాయి దందాను కూకటివేళ్లతో పెకలించవేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ సత్ఫలితాలిస్తోంది. దశాబ్దాలుగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో వేళ్లూనుకున్న గంజాయి దందాపై గత ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి అవలంభించడంతో స్మగ్లింగ్ ముఠాల నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించింది.
ఆయా ముఠాలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంతో సరిపెట్టకుండా గంజాయి సాగును సైతం పూర్తిగా నిర్మూలిస్తేనే ఫలితం ఉంటుందని ప్రభుత్వం భావించింది. అందుకే దేశంలోనే సంచలనాత్మక రీతిలో ‘ఆపరేషన్ పరివర్తన్’ను చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది.
కేంద్ర సంస్థలతోనూ జతకట్టి..
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులతో కలసి ఆంధ్రప్రదేశ్ ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) నేతృత్వంలో ఆపరేషన్ పరివర్తన్‌కు రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా రూపకల్పన చేసింది. నేషనల్ నార్కోటిక్స్ బ్యూరో (ఎన్‌సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) సహకారంతో సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో విశాఖపట్నంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించిన ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.
ఏవోబీ పరిధిలో మన రాష్ట్రంలో 11 మండలాలతోపాటు ఒడిశాలోని 23 జిల్లాల్లో గంజాయి సాగును నిర్మూలించే కార్యక్రమాన్ని ఉవ్వెత్తున చేపట్టింది. 2021 అక్టోబర్ 30న ప్రారంభించిన ఆపరేషన్ పరివర్తన్ 2022 జనవరి 11 వరకు ఒక యజ్ఞంలా సాగింది. గంజాయి సాగును ధ్వంసం చేయడమే కాకుండా గిరిజనులకు ప్రత్యమ్నాయ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు సాగింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏవోబీలో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను మ్యాపింగ్ చేసింది. ఆర్టిఫీషియల్ టెక్నాలజీ సహకారంతో ఉపగ్రహ ఛాయాచిత్రాలను తెప్పించి విశ్లేషించింది. డ్రోన్ కెమెరాలతో గంజాయి సాగును సర్వే చేసింది. ఏవోబీలోని మన రాష్ట్ర పరిధిలో 11 మండలాల్లో 313 గ్రామాల్లో గంజాయి సాగుపై సర్వే నిర్వహించింది.
గంజాయి పంటను ధ్వంసం చేయడానికి ఏకంగా 406 బృందాలను వినియోగించింది. డ్రోన్లు, శాటిలైట్ ఫోన్లు, ఆధునిక పరికరాలను సమకూర్చి గంజాయి సాగును ధ్వంసం చేసే ప్రక్రియ చేపట్టింది. 120 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. గంజాయి సాగు వల్ల తలెత్తే అనర్థాలపై గిరిజనులను చైతన్యపరిచేందుకు 1,963 అవగాహన సదస్సులు, 93 ర్యాలీలు నిర్వహించింది.
3.52 కోట్ల గంజాయి మొక్కలు ధ్వంసం
ఆపరేషన్ పరివర్తన్ కింద ఏవోబీలో 7,120 ఎకరాల విస్తీర్ణంలోని గంజాయి సాగును సెబ్ ధ్వంసం చేసింది. ఏకంగా 3,52,88,750 గంజాయి మొక్కలను పెకలించి నాశనం చేసింది. వాటి విలువ దాదాపు రూ.177.65 కోట్లు. సెబ్ నిర్వహించిన అవగాహన సదస్సుల ఫలితంగా గిరిజనులు స్వచ్ఛందంగా 395.30 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారు. 19,77,500 మొక్కలను స్వచ్ఛందంగా పెకలించివేశారు.
వాటి విలువ రూ.99.46 లక్షలు. గంజాయి రవాణాపై 577 కేసులు నమోదు చేసి 1,500 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు 572మంది ఉన్నారు. 314 వాహనాలను జప్తు చేశారు. ఆపరేషన్ పరివర్తన్‌తో విశ్రమించకుండా సెబ్ అధికారులు ఏవోబీలో నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నారు. అందుకోసం ఏడు ప్రత్యేక చెక్ పోస్టులను నెలకొల్పారు.
గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి
కేవలం జీవనోపాధి కోసం గంజాయి సాగుకు సహకరించే గిరిజనులను గుర్తించిన ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా కార్యాచరణను ఇప్పటికే చేపట్టాయి. వ్యవసాయ, ఉద్యాన శాఖలు గిరిజనులు పండించాల్సిన పంటలు, తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. గిరిజన యువతకు పోటీ పరీక్షల కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
డ్రగ్స్ దందాపైనా కఠిన చర్యలు
మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వ్యవహారాలపై పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు నిఘాను పటిష్టం చేసింది. ప్రధానంగా బెంగళూరు కేంద్రంగా ఉన్న ముఠాలు రాష్ట్రంలోకి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు గుర్తించింది. దీన్ని అడ్డుకునేందుకు ఇద్దరు డీఐజీలకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించి పర్యవేక్షిస్తోంది.
మూడు నెలల వ్యవధిలోనే ఐదు కేసులను నమోదు చేసి 20 మందిని అరెస్ట్ చేసింది. డీఎస్‌టీ కొరియర్ సంస్థ ద్వారా రాష్ట్రంలోని తప్పుడు చిరునామాతో చీరల మాటున విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేసిన ముఠా ఆట కట్టించారు. విశాఖలో కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముఠాకు చెందిన ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.
గంజాయి దందాను ఉపేక్షించేది లేదు
రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణా, డ్రగ్స్ వ్యవహారాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదు. యువత జీవితాలను నాశనం చేసే వీటిపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఇప్పటికే ఆపరేషన్ పరివర్తన్‌ను విజయవంతంగా నిర్వహించాం. ఇకముందు కూడా నిఘాను మరింత పటిష్టం చేసేలా మౌలిక వసతులు పెంపొందించడంతోపాటు పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించాం.
– కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment