ఎస్జీటీ ఉద్యోగార్థులకు ఏపీ శుభవార్త | Adimulapu Suresh Comments SGT Posts Will Release DSC 2020 Soon | Sakshi
Sakshi News home page

త్వరలోనే డీఎస్సీ 2020: ఆదిమూలపు సురేశ్‌

Published Tue, Sep 22 2020 6:43 PM | Last Updated on Tue, Sep 22 2020 7:16 PM

Adimulapu Suresh Comments SGT Posts Will Release DSC 2020 Soon - Sakshi

సాక్షి, విజయవాడ: డీఎస్సీ- 2018లో ఉత్తీర్ణులైన ఎస్‌జీటీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువడిందన్న విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఎస్జీటీ కేటగిరీలో 3524 పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2203 అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తైందని, మిగిలిన 1321 మంది రికార్డుల వెరిఫికేషన్‌ నేటితో పూర్తవుతుందన్నారు. బుధవారంలోగా ఎస్‌ఎంఎస్‌లతో అభ్యర్థులకు సమాచారం అందిస్తామని తెలిపారు. ఈనెల 24న సర్టిఫికేట్ వెరిఫికేషన్, 25, 26 తేదీల్లో మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి, 26న అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా స్కూలు అసిస్టెంట్లు ఖాళీలకు భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే డీఎస్సీ-2020 విడుదల చేస్తామన్నారు.

ఈ మేరకు మంగళవారమిక్కడ ఆదిమూలపు సురేశ్‌తో మాట్లాడుతూ.. డీఎస్సీ 2020కి ఏ అడ్డంకులూ లేవని, పెండింగ్‌లో ఉన్న డీఎస్సీలకు కూడా త్వరలో ఉత్తర్వులు వెలువడతాయన్నారు. టెట్‌ సిలబస్ కూడా మారుతున్న విద్యార్ధుల అవసరాల మేరకు ఆధునికీకరించి తయారుచేస్తామని తెలిపారు. ఇక డీఎడ్‌ కేసు విషయం కోర్టులో వాయిదా పడిందని, ట్రిపుల్ ఐటీకి సంబంధించినంత కార్యాచరణపై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నామని పేర్కొన్నారు. రేపు సాయంత్రం ఎస్జీకేటీ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నిర్ణయం వెలువడుతుందన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రాధమిక విషయాలు వదలకుండా సిలబస్ కుదించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

ఇక డౌట్లు క్లియర్ చేసుకోవడానికే స్కూల్స్ ప్రారంభమయ్యాయని, 9,10, ఇంటర్ విద్యార్ధులు స్కూలుకు వస్తున్నారన్నారు. అయితే తల్లిదండ్రుల అనుమతితోనే స్కూలుకు రావాలని స్పష్టం చేశారు. అదే విధంగా యాభై శాతం మాత్రమే ఉపాధ్యాయులు స్కూళ్ళకు వస్తారన్నారు. జాతీయ విద్యా విధానంలో ఏపీ ఇప్పటికే ముందుందని, 5+3+3+4 విధానంలో విద్య అమలు చేయనున్న మొదటి రాష్ట్రం మనదేనని హర్షం వ్యక్తం చేశారు. ఇక జగనన్న విద్యా దీవెన కిట్లు ఇప్పటికే స్కూళ్లకు చేరిందన్నారు. అదే విధంగా ఇంటర్ కొత్త కాలేజీలకు అనుమతి ఇచ్చిన తరువాత ఆన్‌లైన్‌ అడ్మిషన్లు గురించి చెబుతామన్నారు. ఒక్కొక్క ఇంటర్మీడియట్ కాలేజీ బ్రాంచికి 40 సీట్లు మాత్రమే ఇస్తామని తెలిపారు. ఇక కరోనా నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్ళు ఎక్కడైనా ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చి ఉండకపోతే చర్యలు తీసుకుంటామని ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement