
సాక్షి, అమరావతి: వ్యవసాయపనుల్లో సాంకేతిక పరికరాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. మనుషులపై దుష్ప్రభావం చూపే రసాయన ఎరువులు, పురుగు మందుల పిచికారీ వంటి పనులకు డ్రోన్లను ఉపయోగించడం మన దేశంలో కూడా మొదలైంది. ఇప్పుడు ఇలాంటి డ్రోన్లను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తోంది. ఆ వివరాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
డ్రోన్ల వినియోగంపై జాతీయ స్థాయి మార్గదర్శకాలను యూనివర్సిటీ పాటిస్తుందన్నారు. టెక్నాలజీ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో యూనివర్సిటీకి కూడా సభ్యత్వం ఉందన్నారు. తాము అభివృద్ధి చేసిన డ్రోన్లకు అనుమతుల ప్రక్రియ పూర్తయిందన్నారు. 2024 నాటికి దేశ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
మానవ శ్రమ తగ్గించడానికే..
పంటల ఉత్పత్తి పెంచడానికి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తప్పనిసరి. అయితే ఈ పని రైతులకు ఖర్చుతో, శ్రమతో కూడుకున్నది. అంతేగాక వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో రైతులకు సాయం చేయడానికి కృత్రిమ మేధస్సుతో కూడిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అలా తెరపైకి వచ్చిందే డ్రోన్ వినియోగం.
3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా..
ఈ ఏడాదిలో రాష్ట్రంలోని గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో డ్రోన్లను వినియోగించాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. యూనివర్సిటీకి చెందిన సుమారు 10 వేల ఎకరాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువులను చల్లిస్తారు. పంటల స్థితిగతులను గుర్తించి అవసరమైన చర్యలు సూచిస్తారు. ఇందుకోసం 6 డ్రోన్లను సేకరించనున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, చెరకు పంటల్లో ఆ డ్రోన్లను వినియోగిస్తారు.
డ్రోన్లతో ఉపయోగాల్లో కొన్ని..
- మనుషులతో కన్నా 60 శాతం వేగంగా పూర్తవుతుంది.
- అవసరమైన ప్రాంతాన్ని గుర్తించి పురుగు మందులను పిచికారీ చేయవచ్చు.
- నష్టం కలగకమునుపే చీడపీడలను గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు.
- ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన నష్టాన్ని డ్రోన్ చిత్రాలతో త్వరితగతిన అంచనా వేయవచ్చు.
- ఎన్నిసార్లయినా ఉపయోగించవచ్చు. పంటల స్థితిని ఛాయా చిత్రాలతో గుర్తించవచ్చు
- సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పంటల ప్రణాళిక, భూ నిర్వహణకు కూడా తోడ్పడుతుంది.
- తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చు.
రెండు రకాల డ్రోన్లు..
- ప్రస్తుతం అగ్రి వర్సిటీ ఆధ్వర్యంలో రెండు రకాల డ్రోన్లు అభివృద్ధి చేశారు.
- పురుగు మందుల పిచికారీకి పుష్పక్–1, ఎరువులు, విత్తనాలు చల్లడానికి పుష్పక్–2.
- క్వాడ్‌కాప్టర్ (డ్రోన్) మొత్తం 8 కిలోల బరువు మోయగలదు.
- ఆటోమేటిక్ స్ప్రేయింగ్ మెకానిజంతో అగ్రికల్చర్ డ్రోన్‌లను రూపొందించారు.
- క్వాడ్‌కాప్టర్ సిస్టమ్‌కు స్ప్రేయర్ మాడ్యూల్‌ను అనుసంధానం చేయాలి.
- పీఐసీ మైక్రో కంట్రోలర్ సాంకేతికతతో సులువుగా పురుగుమందులు, ఫలదీకరణ ప్రభావాలను గుర్తించవచ్చు.
- పంట విస్తీర్ణం, సరిహద్దులను రిమోట్ సెన్సింగ్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment