
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకున్న విద్యుత్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ.6,283.68 కోట్ల బకాయిలను ఇప్పించాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ సమస్యలపై శనివారం నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర డిస్కంలు పొందుతున్న ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం రుణం కింద ఏపీ జెన్‌కో బకాయిలు జమ చేయాలని రాష్ట్రం కోరనుంది. ఈ పథకం ద్వారా కేంద్రం రాష్ట్రాలకు రుణాలిస్తుంటుంది. ఏపీకి సంబంధించిన రుణ బకాయిలను తెలంగాణ నుంచి తీసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేయనుంది.
నాడు ఆదుకున్న ఏపీ: ఏపీ విభజన సమయంలో డిమాండ్‌కు సరిపడా తెలంగాణలో విద్యుదుత్పత్తి లేకపోవడంతో ఏపీజెన్‌కో తెలంగాణ డిస్కంలకు 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు సరఫరా చేసింది. ఆ కాలంలో సరఫరా చేసిన విద్యుత్ ఖర్చు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, రూ.3,441.78 కోట్లు, ఆలస్యమైనందుకు సర్‌చార్జి రూ.2,841.90 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ చెల్లించలేదు. ప్రస్తుతం ఏపీ జెన్‌కో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తెలంగాణ బకాయిలు రాకపోవడంతో.. ఏపీ జెన్‌కో జూన్ 2021లో విద్యుత్ ఆర్థిక సంస్థ, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలకు రూ.1700 కోట్ల రుణ వాయిదాలను గడువులోగా తీర్చలేకపోయింది. జూలై, ఆగస్టులో చెల్లించాల్సిన మరో రూ.1,020 కోట్లు చెల్లించలేదు.
అంగీకరించారు గానీ..: వాస్తవానికి 2019 ఆగస్టు 19న ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల మధ్య జరిగిన సమావేశంలోనూ, 2020 జనవరి 30న ఏపీ, తెలంగాణ సీఎస్‌ల సమావేశంలోనూ తెలంగాణ, ఏపీలు కలిసి ఈ బకాయిల చెల్లింపుపై వివిధ సందర్భాల్లో చర్చించాయి. తెలంగాణ డిస్కంలు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించాయి. కానీ డబ్బులు ఇవ్వలేదు. కేంద్రం ఆదేశాలివ్వడం వల్లనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందున ఆ బకాయిలను ఆత్మనిర్భర్ పథకం ద్వారా రాష్ట్రానికి ఇప్పించి, వాటిని ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల రుణాలకు జమచేసుకోవాలనే ప్రతిపాదనను అమిత్ షా ముందుంచాలని రాష్ట్రం భావిస్తోంది.