AP High Court : పిన్నెల్లి కేసులో రికార్డులు మార్చిందెవరు? | AP High Court Reserved Verdict On Pinnelli Ramakrishna Reddy Bail Petition | Sakshi
Sakshi News home page

AP High Court : పిన్నెల్లి కేసులో రికార్డులు మార్చిందెవరు?

Published Mon, May 27 2024 6:48 PM | Last Updated on Mon, May 27 2024 8:10 PM

AP High Court Reserved Verdict On Pinnelli Ramakrishna Reddy Bail Petition

హైకోర్టు విచారణలో అడ్డంగా దొరికిన పోలీసులు

కేసు నమోదు విషయంలో రికార్డులు తారుమారు 

ప్రశ్నార్థకంగా డీజీపీ, పల్నాడు పోలీసుల తీరు 

అమరావతి:  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో కొందరు పోలీసులు తీరు ప్రశ్నార్థకంగా మారింది. ఇవ్వాళ హైకోర్టు ముందు జరిగిన విచారణలో ఏపీ డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, పల్నాడు పోలీసుల తీరు పలు ప్రశ్నలకు దారి తీసేలా మారింది.

ఏం జరిగింది? 

ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎంకు సంబంధించి ఒక కేసు నమోదయింది. దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట ఇచ్చింది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఉన్నందున కేసులోకి వెళ్లట్లేదని, పిన్నెల్లిని జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది. 

పోలీసులు ఏం చేశారు?

హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వడంతో కొందరు పోలీసు అధికారులు ప్లాన్‌ మార్చారు. డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, పల్నాడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లిపై వరుస కేసులు పెట్టారు. కౌంటింగ్‌ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్ట్‌ చేయాలని, అసలు ఆ సమయంలో పిన్నెల్లి లేకుండా చూడాలని నిర్ణయించారు. ఈవీఎం కేసు ఉండగానే పిన్నెల్లిపై మరో మూడు కేసులు పెట్టారు. ఇదే సమయంలో పిన్నెల్లిని అరెస్ట్‌ చేస్తారంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. 

హైకోర్టులో ఏం తేలింది? 

ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతుండడంతో .. పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసులకు సంబంధించి ఓ కీలకమైన కుట్ర బయటపడింది. ఈ కేసులను ఎప్పుడు పెట్టారంటూ హైకోర్టు ప్రశ్నించగా.. మే 22న నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పిన్నెల్లి తరపున లాయర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ విషయంలో మొత్తం రికార్డులు తెప్పించమని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందు రికార్డులు సమర్పించగా.. వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. ఆ రికార్డుల్లో ఏం తేలిందంటే.. 

  • పిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న పోలీసులు నమోదు చేశారు

  • అది కూడా ఈవీఎంల కేసులో హైకోర్టు ఆదేశాల తర్వాత కేసులు నమోదు చేశారు

  • ఆ తర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్‌కు తెలియపరిచారు

  • అయినా హైకోర్టుకు కేసు నమోదు విషయంలో పోలీసులు తప్పుడు సమాచారం అందించారు

హైకోర్టు విచారణ సందర్భంగా ఇంకేం తేలింది?

  • ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో లేకుండా లాయర్‌ అశ్వనీకుమార్‌ను రంగంలోకి దించారు

  • పోలీసుల తరపున ఒక లాయర్‌ వాదించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి

  • నిబంధనలన్నింటిని తుంగలో తొక్కి అశ్వనీకుమార్‌ను వాదనల కోసం తెచ్చారు

  • అశ్వనీ కుమార్‌ ద్వారా ముందే కేసు నమోదు చేశామంటూ తప్పుడు సమాచారాన్ని హైకోర్టుకు ఇచ్చారు

  • తమ వాదనలు వినిపిస్తున్న పోలీసు పిపికి కూడా సమాచారం ఇవ్వని డిజిపి, పోలీసులు

  • ఇవ్వాళ కోర్టుకు రాని అశ్వనీకుమార్‌

  • ఇదే కేసులో టిడిపి లీగల్‌ సెల్‌ లాయర్‌ పోసానితో ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయించారు

  • ఇవ్వాళ కోర్టు ముందు వాదనలు వినిపించిన టిడిపి లీగల్‌ సెల్‌ లాయర్‌ పోసాని వెంకటేశ్వర్లు

రికార్డులను పరిశీలించిన తర్వాత హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థం కావడం లేదంటూ పిన్నెల్లి తరఫు న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు వాయిదా వేసింది. పిన్నెల్లి విషయంలో వ్యక్తిగత కక్ష కనిపిస్తోందని తాజా ఘటనల ద్వారా అర్థమవుతోంది. ఈ కేసులో డీజీపీ, పల్నాడు పోలీసుల తీరు రోజురోజుకూ దిగజారుతోంది. కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి కొందరు పోలీసు అధికారులు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని పిన్నెల్లి లాయర్‌ హైకోర్టుకు తెలిపారు. "పీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్‌ను కూడా పెట్టారని పిన్నెల్లి తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement