సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల పునరుజ్జీవ, మహిళా సాధికారత ద్వారా పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుజరాత్ ఉన్నతాధికారుల బృందం ప్రశంసించింది. పొదుపు సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ కార్యక్రమాలను పరిశీలించి గుజరాత్‌లో అమలు చేసేందుకు వచ్చిన అధికారుల బృందం రెండు రోజులు ఏపీలో పర్యటించింది.
ఐఏఎస్ అధికారి పుష్పలత ఆధ్వర్యంలో గుజరాత్ జీవనోపాదుల ప్రమోషన్ కంపెనీ (జీఎల్‌పీసీ) ప్రతినిధుల బృందం విజయవాడలో సెర్ప్, ఎస్బీఐ, కెనరా బ్యాంకు అధికారులతో సమావేశమై పొదుపు సంఘాలకు రుణాలు మంజూరు, సభ్యులు వినియోగించుకుంటున్న తీరు, రుణాలు సకాలంలో చెల్లింపులు తదితర అంశాలపై వివరాలను తెలుసుకుంది.
పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని బ్యాంకర్ల సమావేశంలో ప్రస్తావించడం, ప్రాసెసింగ్ చార్జీల మినహాయింపు, జగనన్న మహిళా మార్టుల ఏర్పాటుతో వ్యాపారాల్లో మహిళలు రాణించేలా ప్రోత్సహించడం తదితర అంశాలను అధికారులు బృందానికి వివరించారు. గుజరాత్ అధికారుల బృందం బుధవారం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో పర్యటించి స్థానిక పొదుపు సంఘాల మహిళలను కలుసుకుంది. పొదుపు సంఘాల ద్వారా మహిళలు తమ కుటుంబ ఆదాయాన్ని పెంచుకున్న తీరును అడిగి తెలుసుకుంది.
శాశ్వత ఆదాయాలను పొందేలా
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలిచి శాశ్వత స్థిర ఆదాయాలను సమకూర్చుకునేలా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత లాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా పథకాల ద్వారా మహిళలకు అందజేసే మొత్తాలను జీవనోపాధులలో పెట్టుబడులుగా పెట్టుకొనేలా అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు హిందూస్తాన్ లీవర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, ఐటీసీ, రిలయెన్స్ అజియో తదితర సంస్థలతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది. మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలతో అదనంగా తోడ్పాటు అందించే ప్రక్రియ కూడా చేపట్టింది.
వ్యాపారాల్లో విజయ పతాకం..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా గత మూడేళ్లలో ఏకంగా 16 లక్షల మంది పేద మహిళలు వివిధ రకాల వ్యాపారాలు, ఇతర శాశ్వత జీవనోపాధులు ఏర్పాటు చేసుకొని ఇప్పటికే ప్రతి నెలా స్ధిరమైన ఆదాయం పొందుతున్నారు. మహిళా మార్టులు లాంటివి నెలకొల్పి విజయవంతంగా వ్యాపారాల్లో రాణిస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని కూడ ప్రభుత్వం చేపట్టింది.
గత ఆర్నెళ్లలో కొత్తగా 13 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలుగా సత్తా చాటారు. మన పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న అప్పుల్లో 99.67 శాతం సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్‌్ఫ) ద్వారా ఏపీ అమలు చేస్తున్న ఈ తరహా జీవనోపాదులు, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను గుజరాత్ అధికారుల బృందం ప్రత్యేకంగా పరిశీలించింది.
నాలుగున్నరేళ్లలో కీలక మార్పులు..
2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అనంతరం మహిళలను మోసగించడంతో పొదుపు సంఘాలు అప్పుల్లో కూరుకుపోయి ఎన్‌పీఏలుగా మారిపోయాయి. నాలుగో వంతుకు పైగా సంఘాలు బ్యాంకుల వద్ద నిరర్థక ఆస్తులుగా మిగిలాయి. దీంతో అంతకు ముందు ఏ గ్రేడ్‌లో ఉన్న పొదుపు సంఘాలు అత్యధికం సీ, డీ గ్రేడ్‌లోకి వెళ్లాయి. గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదన్న విషయాన్ని నాటి మంత్రి పరిటాల సునీత స్వయంగా అసెంబ్లీలో లిఖితపూర్వకంగా వెల్లడించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాట ప్రకారం 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా ఆయా మహిళలకు చెల్లించేలా వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేయడంతోపాటు చంద్రబాబు సర్కారు మంగళం పాడిన సున్నా వడ్డీని పునరుద్ధరించడంతో పొదుపు సంఘాలు కోలుకున్నాయి. గత నాలుగున్నరేళ్లుగా పొదుపు సంఘాలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించడం, సకాలంలో సున్నా వడ్డీ చెల్లింపులతో రాష్ట్రంలో పొదుపు సంఘాల వ్యవస్థ బలం పుంజుకుంది.
మహిళా మార్టు సందర్శన
మద్దిపాడు/సింగరాయకొండ: ఏపీలో పొదుపు సంఘాల పనితీరు బాగుందని గుజరాత్ అధికారుల బృందం అభినందించింది. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు, ఇనమనమెళ్లూరు, సింగరాయకొండలో బృందం బుధవారం పర్యటించింది. మద్దిపాడులోని జగనన్న చేయూత మహిళా మార్ట్, ఇనమనమెళ్లూరులో పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన తేనె పరిశ్రమ, సింగరాయకొండ మండలం కనుమళ్ల పంచాయతీలో బాతు హేచరీలను పరిశీలించిన బృందం సభ్యులు పొదుపు సంఘాల మహిళలను ప్రశంసించారు.
ఇనమనమెళ్లూరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులకు అందుతున్న సేవలను పరిశీలించారు. గ్రామ సచివాలయంలో జాబ్‌చార్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొదుపు సంఘాల పనితీరు అద్భుతంగా ఉందని, ఇలాంటి విధానాలు గుజరాత్‌లో అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు పుష్పలత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment