
జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ మేయర్ పీఠం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే..
విజయవాడ: జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ మేయర్ పీఠం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధీమా వ్యక్తం చేశారు. 20 నెలల పాలనలో విజయవాడలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. 58వ డివిజన్ అభ్యర్థి అవుతు శైలజతో కలిసి గడపకు గడప ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలు, మధ్య తరగతి వారి అంశాలను అజెండా పెట్టుకుని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. . పాదయాత్రలో జగన్ చూసిన ప్రజల సమస్యలను మ్యానిఫెస్టోలో పథకాలుగా రూపొందించారని గుర్తుచేశారు. విజయవాడలో లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని ప్రకటించారు.
విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో రాష్టంలో రూ.70 వేల కోట్లు ప్రజల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం తమదేనని గర్వంగా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల సమస్యలు, అవసరాలు ఒక అజెండాగా పెట్టుకున్నట్లు వివరించారు. 20 నెలల పాలనలో విజయవాడలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. విజయవాడ నగర ప్రజలు టీడీపీ అబద్ధపు మాటలు నమ్మే స్థితిలో లేరని గుర్తుచేశారు.
తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని విష్ణు డిమాండ్ చేశారు. రూ.600 కోట్ల అభివృద్ధి పనులు టీడీపీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రండి సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ పాలనలో నగరంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు సిద్ధాంతాలు వీగి పోయాయని.. కుప్పం ప్రజలు తిరస్కరించారని విష్ణు వివరించారు.