సాక్షి, అమరావతి: యుద్ధభేరి పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు టీడీపీ శ్రేణులు ఇటీవల సాగించిన విధ్వంసంపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు మంగళవారం ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి తీర్పును రిజర్వ్ చేశారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అసలు ఈ బెయిల్ పిటిషన్‌కు విచారణార్హతే లేదన్నారు. మరో కేసులో అరెస్టయినందున ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించడానికి వీల్లేదన్నారు.
పలు కేసులు ఒకే పోలీస్టేషన్‌లో నమోదై, వాటిని ఒకే అధికారి దర్యాప్తు చేస్తుంటే అప్పుడు డీమ్డ్ (అన్నీ కేసుల్లో అరెస్ట్ అయినట్లు) అరెస్ట్ వస్తుందని, వేర్వేరు కేసులు, వేర్వేరు దర్యాప్తు అధికారులున్నప్పుడు అది డీమ్డ్ అరెస్ట్ కిందకు రాదని స్పష్టంచేశారు. డీమ్డ్ అరెస్ట్ అయితే పీటీ వారెంట్‌తో పనేముంటుందని ప్రశ్నించారు. చట్ట ప్రకారమే పీటీ వారెంట్ దాఖలు చేశామన్నారు. అసలు చంద్రబాబు ప్రోద్బలంతోనే అంగళ్లు ఘటన జరిగిందన్నారు. అంగళ్లు వద్ద మొదలైన టీడీపీ శ్రేణుల విధ్వంసం చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు కొనసాగిందని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబే దగ్గరుండి శ్రేణులను రెచ్చగొట్టారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోర్టును కోరారు. మారణహోమం సృష్టించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లేవనెత్తాలన్నదే చంద్రబాబు వ్యూహమన్నారు. అంతిమంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర పన్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని ఆయన కోరారు.
అంతకు ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ మరో కేసులో అరెస్టయి జైలులో ఉన్నందున, ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. అందుకే బెయిల్ పిటిషన్ వేశామని తెలిపారు. అధికార పార్టీ నేతలు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారని, ఆ దాడి నుంచి ఆయన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షించారని తెలిపారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment