పోలవరానికి వారంలో రూ.2,300 కోట్లు! | Authorities estimate that Rs 2300 crore could be handed over to AP Govt within a week | Sakshi
Sakshi News home page

పోలవరానికి వారంలో రూ.2,300 కోట్లు!

Published Tue, Sep 22 2020 4:08 AM | Last Updated on Tue, Sep 22 2020 4:08 AM

Authorities estimate that Rs 2300 crore could be handed over to AP Govt within a week - Sakshi

కేంద్రమంత్రి షెకావత్‌కు వినతి పత్రం ఇస్తున్న మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఎంపీ మిథున్‌రెడ్డి

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,300 కోట్లను రీయింబర్స్‌మెంట్‌ చేసేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సోమవారం ఆయన సంబంధిత ఫైలుపై సంతకం చేసి ఆర్థిక శాఖకు పంపారు. బహిరంగ మార్కెట్లో బాండ్లద్వారా రుణాలను సేకరించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించనుంది. వారంలోగా రూ.2,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

► పోలవరం కోసం 2014 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,177.62 కోట్లకు సంబంధించి లెక్కలు పక్కాగా ఉన్నట్లు నిర్ధారిస్తూ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఇచ్చిన ఆడిటెడ్‌ నివేదికను కేంద్ర జల్‌ శక్తి, ఆర్థిక శాఖలకు ఇప్పటికే అందచేశారు. కోరిన వివరాలన్నీ అందచేసిన నేపథ్యంలో పోలవరాన్ని 2021 నాటికి పూర్తి చేసేలా నిధులు విడుదల చేసి సహకరించాలని కోరుతూ గత నెల 25న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. 
► సీఎం జగన్‌ ఆదేశాల మేరకు సోమవారం ఢిల్లీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌లతో కలిసి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌తో భేటీ అయ్యారు. పీపీఏ ప్రతిపాదించిన మేరకు రూ.2,300 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని, మిగతా రూ.1,758.02 కోట్లను మలిదఫాలో ఇస్తామని షెకావత్‌ హామీ ఇచ్చారు. 

వేగంగా రీయింబర్స్‌: మంత్రి అనిల్‌కుమార్‌
కేంద్ర మంత్రితో సమావేశానంతరం అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.4 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్‌ నిధులను త్వరితగతిన విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆర్థిక శాఖతో మాట్లాడి నిధులు త్వరగా విడుదలయ్యేలా చూస్తామని, రాష్ట్రానికి అన్నివిధాలా సహకారమందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని షెకావత్‌ను కోరామన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని త్వరలోనే నిర్వహిస్తామని షెకావత్‌ చెప్పారన్నారు. పునరావాసానికి సంబంధించి త్వరితగతిన నిధులిస్తే డిసెంబర్‌ 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement