సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్‌సీల్లో) రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల పట్ల కేంద్రం ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. పట్టణ ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల్లో నాణ్యతా ప్రమాణాల్ని స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం గుంటూరులోని ఇందిరానగర్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి(యూపీహెచ్‌సీ)ఎన్ క్యూఎఎస్ ప్రోగ్రాం కింద 96.2 శాతం స్కోర్ ఇస్తూ నాణ్యతా ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. అన్ని రకాలుగా ఆయా వైద్య విభాగాలు సంతృప్తికరమైన వైద్య సేవలందిస్తూ నాణ్యతా ప్రమాణాల్ని పాటించినందుకుగాను అభినందించింది.
గుంటూరు పట్టణంలోని ఇందిరానగర్ అర్బన్ పీహెచ్‌సీల్లో కల్పించిన నాణ్యమైన వైద్య సేవలకుగాను కేంద్రం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం అత్యుత్తమ స్కోర్‌ను సాధించి రాష్ట్రంలోనే మొట్టమొదటి యూపీహెచ్‌సీగా గుర్తింపు పొందింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్ ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబును అభినందిస్తూ లేఖ రాశారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో దాదాపు 100 పట్టణ ఆరోగ్య కేంద్రాలు కేంద్రం గుర్తింపును సాధించేందుకు కార్యాచరణను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన అధికారుల బృందాలు మే నెల 19,20 తేదీలలో గుంటూరు పట్టణంలోని ఇందిరానగర్ యూపీహెచ్‌సిని సందర్శించి అక్కడి అన్ని విభాగాల పనితీరును పరిశీలించాయి.
చదవండి: మీ మనసు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదు: సీఎం జగన్
ఇందిరా నగర్ యూపీహెచ్‌సీలో మొత్తం 12 వైద్య విభాగాల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు గాను 96.2 శాతం స్కోరును సాధించాయని విశాల్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. యూపిహెచ్ సీల్లో వైద్య సేవల్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకుని రాష్ట్ర నాణ్యతా ప్రమాణాల నియంత్రణా విభాగానికి అందజేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళిక అమలు తీరును పరిశీలించాక నివేదికలను ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ ధ్రువీకరణ విభాగానికి అందచేయాల్సి ఉంటుందని లేఖలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment