సాక్షి, అమరావతి: తన అవినీతి బండారం బట్ట బయలు కావడంతో మాజీ సీఎం చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. షెల్ కంపెనీల ద్వారా ప్రజాదనాన్ని కాజేసిన వైనం ఆధారాలతో సహా వెలుగు లోకి రావడంతో ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులు రాత్రికి రాత్రే విదేశాలకు పరారయ్యారు. బాబు తరఫున అన్నీ తామై వ్యవహరించిన తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెని ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తాలకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దీంతో చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని హఠాత్తుగా విదేశాలకు పరారయ్యారు. మరో బినామీ యోగేశ్ గుప్తా ఆచూకీ తెలియడం లేదు.
ఆ ముగ్గురే కీలకం..
తన అవినీతి పాపాలు పండటంతో చంద్రబాబు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. తాను అధికారంలో ఉండగా యథేచ్ఛగా సాగించిన అవినీతి వ్యవహారాలను కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కటిగా వెలికి తీయడంతో తప్పించుకునే దారి లేక సానుభూతి నాటకాలకు తెర తీశారు. రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టుల కేటాయింపులో షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ముడుపులు అందుకున్న వైనాన్ని ఆదాయపన్ను శాఖ ఆధారాలతో సహా వెలికి తీసిన విషయం తెలిసిందే.
ఇందులో కీలక పాత్ర పోషించిన బాబు బినామీలైన ముగ్గురు నిందితులే రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో కూడా షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేటతెల్లం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారని నిగ్గు తేల్చింది.
వారు ముగ్గురూ చంద్రబాబు బినామీలేనని తేలడంతో నోటీసులు జారీ చేసింది. మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాలను ఈ నెల 11న, పెండ్యాల శ్రీనివాస్‌ను ఈ నెల 14న విజయవాడలో విచారణకు హాజరుకావాలని ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆ ముగ్గురూ హఠాత్తుగా అదృశ్యం కావడం, ఇద్దరు నిందితులు ఏకంగా దేశం విడిచి పరారు కావడం ఈ కుంభకోణాలకు సూత్రధారి చంద్రబాబేనని స్పష్టం చేస్తోంది.
పాత్రలు ఫినిష్..!
అక్రమ నిధులు తరలించేందుకు తాను ఏర్పాటు చేసుకున్న అవినీతి నెట్‌వర్క్‌ను కేంద్ర ఆదాయపన్ను శాఖ, సీఐడీ సిట్ ఛేదించడంతో చంద్రబాబుకు దారులు మూసుకుపోయాయి. అప్పటికే మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల వాంగ్మూలాన్ని ఆదాయ పన్ను శాఖ నమోదు చేసింది. తాము చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ద్వారా ఆయనకు భారీగా ముడుపులు అందించినట్లు వాంగ్మూలంలో వారు అంగీకరించారు.
ఈ నేపథ్యంలో అక్రమ ఆదాయంపై ఆదాయ పన్ను శాఖ సమాచారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతలో స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తన బినామీలు ముగ్గురికీ సిట్ నోటీసులు జారీ చేస్తుందని చంద్రబాబు ఊహించలేదు. దీంతో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చని ఆయన ఊహించారు. అందుకే తనను రెండు రోజుల్లో అరెస్టు చేయవచ్చంటూ తాజాగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తనను అరెస్టు చేస్తే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని ఆయన టీడీపీ శ్రేణులకు పరోక్షంగా సందేశమిచ్చారు. ఒకవైపు ఈ కుట్రలకు వ్యూహ రచన చేస్తూనే మరోవైపు తన బినామీలు మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్ సిట్ విచారణకు హాజరైతే అక్రమాల చిట్టా బద్ధలవుతుందనే భయంతో వారిని విదేశాలకు పారిపోవాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.
అమెరికాకు శ్రీనివాస్... దుబాయ్‌కి మనోజ్
చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అప్పటికప్పుడే హఠాత్తుగా అమెరికాకు పరారయ్యారు. సిట్ నోటీసులు అందినట్లు ఆయన కుమార్తె తెలిపారు. నోటీసులపై ఆమె సంతకం కూడా చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో చంద్రబాబు పీఎస్ అందుబాటులో లేకుండా పోయారు. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయారు. అంటే నోటీసులు అందడంతోనే పెండ్యాల శ్రీనివాస్ పరారైనట్లు స్పష్టమవుతోంది. ఇక మనోజ్ పార్థసాని దుబాయ్ ఉడాయించారు.
ఆయన ముంబై నుంచి దుబాయ్ వెళ్లిపోయారు. తనకు సీఐడీ నోటీసులు జారీ చేసిందనే విషయం తెలియగానే ఆయన అందుబాటులో లేకుండా పోయారు. అనంతరం హడావుడిగా దుబాయ్‌కి పరారయ్యారు. అక్కడ నుంచి ఆయన ఎక్కడకు వెళ్తారన్నది సన్నిహితులకు కూడా చెప్పకుండా అత్యంత గోప్యంగా ఉంచారు. మరోవైపు షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఆచూకీ తెలియడం లేదు.
ఆయన ఎక్కడ ఉన్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సీఐడీ నోటీసులు జారీ చేసిన వెంటనే చంద్రబాబు బినామీలు ముగ్గురూ హఠాత్తుగా అదృశ్యం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారన్న దానికి ఇదే తిరుగులేని నిదర్శనమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా పరిణామాలతో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఐడీ అధికారులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment