సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడును విచారించేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. చంద్రబాబు అవినీతి బండారాన్ని జాతీయస్థాయిలో బట్టబయలు చేసిన ఈ కేసుపై దేశమంతటా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జీఎస్టీ తదితర విభాగాలు కూడా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ముసుగులో భారీగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారని నిర్ధారించాయి.
సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల నకిలీ ప్రాజెక్టును చూపిస్తూ రూ.371 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంలో మరిన్ని వాస్తవాలను రాబట్టేందుకు సీఐడీ శాస్త్రీయంగా సంసిద్ధమవుతోంది. ఈ కేసులో చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. దాంతో న్యాయస్థానం మార్గదర్శకాలను పాటిస్తూ శని, ఆదివారాల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే చంద్రబాబును సీఐడీ విచారించనుంది. అందుకోసం ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో నలుగురు సీఐలు, సహాయక సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం శుక్రవారం రాత్రే రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ బృందంలో మొత్తం 12 మంది ఉన్నారు.
సీఐడీ వాదనకు కొండంత బలం
స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోసం న్యాయస్థానం అనుమతి పొందడం ద్వారా సీఐడీ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ఈ కుంభకోణంలో నిధులను అక్రమంగా మళ్లించిన అవినీతి నెట్‌వర్క్‌ను సీఐడీ ఛేదించింది. ఈ ప్రాజెక్టుతో సంబంధం లేదని జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసుకు మరింత బలం చేకూరింది.
దాంతో ఏ–1 చంద్రబాబుతో పాటు 8 మందిని సీఐడీ ఇప్పటివరకు అరెస్టు చేసింది. చంద్రబాబు అరెస్టు సరైనదేనంటూ ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడం, తాజాగా రిమాండ్‌ను పొడిగించడం ద్వారా సరైన రీతిలోనే సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడిందన్న విషయం వెల్లడైంది. తనపై తప్పుడు కేసు పెట్టారని, ఆ కేసునే కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో విచారణ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. సీఐడీ వాదనకు మరింత బలం చేకూరింది. ఈ కేసుపై టీడీపీ చేస్తున్న రాజకీయ రాద్ధాంతంతో నిమిత్తం లేకుండా సీఐడీ నిబంధనల ప్రకారం దర్యాప్తును కొనసాగిస్తోంది.
కీలక దశలో దర్యాప్తు
ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ.. చంద్రబాబును రెండు రోజులపాటు కస్టడీలో విచారించడం ద్వారా మరిన్ని కీలక ఆధారాలను రాబట్టాలని భావిస్తోంది. ఈ నెల 9న చంద్రబాబును అరెస్ట్ చేసి సిట్ కార్యాలయంలో విచారించిన సమయంలో ఆయన తనకు ఏమీ తెలియదని, గుర్తు లేదని, మరచిపోయాను అంటూ ముక్తసరిగా సమాధానాలిచ్చి తప్పించుకునేందుకు యతి్నంచారు. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి చంద్రబాబును అడగాల్సిన ప్రశ్నలపై సీఐడీ అధికారులు తగిన కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.
ముగ్గురు డీఎస్పీలతో శాస్త్రీయమైన రీతిలో రూపొందించిన ప్రశ్నావళి నుంచి ఒక్కొక్కటిగా ప్రశ్నలు సంధించనుంది. ప్రధానంగా సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరిట జీవో ఎలా ఇచ్చారు? ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు? జీవోకు విరుద్ధంగా ఒప్పందం ఉండటం ఏమిటి? రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారు? ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావును ఏకంగా నాలుగు కీలకస్థానాల్లో ఎందుకు నియమించారు? ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయమని ఎందుకు ఆదేశించారు? ఏకంగా 13 చోట్ల నోట్‌ఫైళ్లపై సంతకాలు చేసి మరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేలా అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు?
డిజైన్‌టెక్ కంపెనీకి చేరిన నిధులు వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించడం గురించి మీకు తెలుసా? అక్రమ నిధుల తరలింపులో కీలక పాత్రధారి మనోజ్ పార్థసానితో ఉన్న సంబంధం ఏమిటి? ఆయన మీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు రూ.241 కోట్లు ఎందుకు అందించారు? ఆ నిధులను ఆయన మీకు చేర్చారా? సీఐడీ నోటీసులు అందగానే మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పరారయ్యారు వంటి పలు కోణాల్లో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ కేసులో ప్రధాన సాక్షుల వాంగ్మూలాలను ప్రస్తావిస్తూ చంద్రబాబును అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణ తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తదుపరి ప్రశ్నలను సంధించనున్నారు.
జైల్లోనే విచారణకు ఏర్పాట్లు
రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును విచారించేందుకు జైలు అధికారులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్‌లో సీసీ కెమెరాలు ఉన్నందున అక్కడే విచారించాలా లేక వేరే గదిలో విచారించాలా అన్న విషయమై సమాలోచనలు చేస్తున్నారు. భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే 300 మంది ఆక్టోపస్, ఇతర పోలీసు బలగాలతో జైలు బయట భద్రత కట్టుదిట్టం చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు రిమాండ్ 24 వరకు పొడిగింపు
Comments
Please login to add a commentAdd a comment