![CID Strategy For Chandrababu Naidu Remand Probe Skill Scam - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/09/22/AP-CID-CBN-Custody-Jail.jpg.webp?itok=QkWtbIFG)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడిని విచారించేందుకు సీఐడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో.. చంద్రబాబు నాయుడికి ఎలాంటి ప్రశ్నలు సంధించాలి? ఎలా విచారించాలి? అనేదానిపై సీఐడీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. స్కామ్‌లో చంద్రబాబే ప్రధాన నిందితుడు.. అంతిమ లబ్ధిదారుడు కావడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి కస్టడీ నుంచి వీలైనంత కీలక సమాచారం రాబట్టాలని భావిస్తోంది ఏపీ సీఐడీ.
చంద్రబాబు కస్టడీ నేపథ్యంలో ఏం జరగబోతోంది?.. ఏ విధంగా సీఐడీ విచారణ చేయనుంది? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టు పర్మిషన్ లభించిన నేపథ్యంలో సీఐడీ ఏర్పాట్లు చేసుకుంటోంది. రేపు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు సీఐడీ అధికారుల బృందం వెళ్లనుంది. మెరికల్లాంటి అధికారుల్ని ఇప్పటికే ఏపీ సీఐడీ కస్టడీ విచారణ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కస్టడీలో చంద్రబాబును ప్రశ్నించే అధికారుల జాబితాను ఇప్పటికే సీఐడీ కోర్టుకు సమర్పించింది కూడా. శనివారం ఉదయం నుంచే ఆధికారులు విచారణ చేపట్టే విధంగా సిద్ధం అవుతున్నారు. కోర్టు నిర్దేశించిన టైం ప్రకారం ఉదయం 9.30గం. నుంచి సాయత్రం 5గంటల దాకా.. తిరిగి ఆదివారం సైతం ఇదే సమయంలోనే విచారణ చేపట్టనుంది. లంచ్, టీ బ్రేక్లకు మినహా మిగిలిన సమయం అంతా విచారణకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. కోరింది ఐదురోజులు అయినప్పటికీ.. రెండే రోజులు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాబట్టి.. తక్కువ సమయం ఉండటం వల్ల వీలైనంత ఎక్కువ సమయం విచారణకు వాడుకోవాలనేది సీఐడీ వ్యూహంగా కనిపిస్తోంది.
రాబట్టాల్సిన సమాధానాలు బోలెడు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నుంచి వీలైనంత ఎక్కువగా సమాచారం రాబట్టాలి.. ఇది ఇప్పుడు సీఐడీ ముందున్న టాస్క్. ఈ మేరకు ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షెల్ కంపెనీల నుంచి చంద్రబాబుకు ఏ విధంగా ముడుపులు చేరాయో తేల్చే పనిలో సీఐడీ అధికారులు నిమగ్నమయ్యారు. చంద్రబాబు బ్యాంకు ఖాతాల గురించి ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏ విధంగా షెల్ కంపెనీల డబ్బు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ వరకు వచ్చిందో తేల్చడమే కస్టడీలో కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోవడంలో చంద్రబాబు పాత్రపైన సీఐడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్, డిజైన్టెక్ కంపెనీ అధిపతి ఖన్వేల్కర్‌తో చంద్రబాబు మీటింగ్‌లపైనా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
వద్దన్నా.. ఎందుకు అలా చేశారు?
కేవలం షెల్ కంపెనీలు ముడుపుల వ్యవహారం మాత్రమే కాకుండా… కేసులో ఏవిధంగా అధికారులపై చంద్రబాబు ఒత్తిడి చేశారనే విషయంపైనా సీఐడీ దృష్టి సారించింది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటులో క్యాబినెట్ అప్రూవల్ లేకపోడం నుంచి మొదలు ఏవిధంగా అధికార దుర్వినియోగం జరిగిందనే విషయంపై సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నిధుల విడుదలపై ఫైనాన్స్ శాఖ అధికారులు వద్దన్నా చంద్రబాబు ఎందుకు బలవంతపెట్టి వందల కోట్లు విడుదల చేయించారనే విషయంపై సీఐడీ ప్రశ్నలు సిద్ధం చేశారనే వార్తలు వస్తున్నాయి. దాదాపు 100కు పైగా ప్రశ్నలతో సీఐడీ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో కలిపి విచారించేందుకు ఈ కేసులో ఉన్న నిందితులను పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్లాన్‌బీ కూడానా?
కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించపోతే ఏం చేయాలి?.. ఈ విషయంపైనా సీఐడీ అధికారులు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు ప్లాన్ బీ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు విచారణకు సహకరించకపోతే.. కస్టడీ పిటిషన్ పొడిగించాలనే విజ్ఞప్తితో పాటు విచారణ సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని కోర్టుకు తెలపాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. సీఐడీ విచారణలో చంద్రబాబును షాక్ గురిచేసే కొన్ని ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పక్కా ఆధారాలతో ఈ స్కామ్‌లో దొరికిన చంద్రబాబును కస్టడీకి తీసుకోవడం ద్వారా కీలకమైన విషయాలనే సీఐడీ బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment