అసామాన్యులకు సత్కారం | CM Jagan Abdul Nazeer presents YSR Lifetime Achievement Awards 2023 | Sakshi
Sakshi News home page

అసామాన్యులకు సత్కారం

Published Thu, Nov 2 2023 4:58 AM | Last Updated on Thu, Nov 2 2023 6:19 PM

CM Jagan Abdul Nazeer presents YSR Lifetime Achievement Awards 2023 - Sakshi

వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగిస్తున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌. చిత్రంలో సీఎం జగన్, ఆయన మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ

వైఎస్సార్‌ తన సంక్షేమ పథకాల ద్వారా తెలుగు ప్రజల హృదయాలను గెలుచు­కున్నారు. అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు 78 లక్షల ఇళ్లు, 108 అంబులెన్స్, కోటి ఎకరాలకు సాగు నీరు, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుం­చి కాపాడటం, ప్రధానంగా జల­యజ్ఞం ద్వారా వైఎస్సార్‌ అందరి హృదయాల్లో నిలిచి పోయారు. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ కూడా అదే బాటలో కొనసాగుతున్నారు.
– అబ్దుల్‌ నజీర్, రాష్ట్ర గవర్నర్‌ 

ఈ అవార్డులు అందుకుంటున్నవారంతా తమ తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించారు. మన వారసత్వాన్ని తమ భుజాల మీద మోస్తు­న్నారు. వీరంతా మన జాతి సంపద. ఈ రోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్నత అవార్డుల్లో చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఈ మూడేళ్లలో సా­మాజిక న్యాయం సంపూర్ణంగా వర్ధిల్లింది. ఈ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్సార్‌ దేశ చరిత్ర­లో చెరగని ముద్ర వేశారని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కొనియాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఆయన వేసిన బాటను ఎన్నో రా­ష్ట్రాలు అనుసరించాయన్నారు. ఇంత గొప్ప దార్శని కుడి పేరిట అవార్డులు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు­లో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆ­యన తొలుత రాష్ట్ర ప్రజలకు అంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు­లు–వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అ­వా­­ర్డులు–2023 ప్రదానో­త్స­వా­న్ని రాష్ట్ర ప్రభుత్వం బుధ­వారం విజయవాడలో వేడు­కగా నిర్వహించింది.

ముఖ్య అతిథిగా గవర్నర్, విశిష్ట అతిథిగా వైఎస్‌ విజయమ్మ, సీఎం  జగన్‌ పాల్గొన్నారు. వ్యవ­సా­యం, కళలు–సంస్కృతి, సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సామా­జిక సేవ రంగాల­లో విశిష్ట సేవలు అందించిన 27 మంది ప్రము­ఖులకు అవా­ర్డుల­ను ప్రదా­నం చేశారు. వీరిలో 23 మందిని లైఫ్‌ టైం అచీవ్‌­మెంట్, నలుగురిని అ­చీవ్‌­­మెంట్‌ పురస్కా­రా­లతో సత్కరించారు.  గవర్నర్‌ మాట్లా­డు­తూ.. వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డ్స్‌– వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్స్‌ను తన చేతుల మీదుగా అందించడం ఆనందాన్నిస్తోందన్నారు.

దివంగత వైఎస్సా­ర్‌ తన సంక్షేమ పథకాల ద్వారా తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఉమ్మడి ఏపీలో పేదలకు 78 లక్షల ఇళ్లను కట్టించారని, ఆయన ప్రారంభించిన 108 అంబులెన్సు సేవ­లను దేశంలో 15 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయడం గొప్ప విషయమన్నారు. రైతాంగాన్ని వ్యవసా­య సంక్షోభం నుంచి కాపాడేందుకు 30 భారీ నీటి పారు­దల ప్రాజె­క్టులు, 18 మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మా­ణం కోసం జల­యజ్ఞం ప్రారంభించిన ఘనత ఆయన­దేనన్నా­రు. అదే బాటలో సీఎం జగన్‌ సాగుతున్నారన్నా­రని చెప్పారు.
గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ పురస్కారం అందుకుంటున్న కరణం మల్లీశ్వరి   

ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి
ఏపీ మూడు ప్రధాన రంగాలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాల్లో అద్భుతమైన పని తీరుతో 2022–23 సంవత్సరానికి 16.22% వృద్ధి రేటుతో ఏపీ గొప్ప పురోగతి సాధించిందన్నారు. 2021–22లో తలసరి ఆదాయం 14.02%తో ఆకట్టుకునే వృద్ధి రేటు నమోదు చేసిందని, సంవత్సరానికి జీఎస్‌డీపీ వృద్ధి రేటు 11.43%గా ఉందన్నారు. ఇది అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికం అని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రా­లు సమర్థవంతంగా పనిచేస్తూ, పరిపాలనను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో విజయం సాధించాయని కితాబిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆర్థిక, సామా­జిక శ్రేయస్సు, ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల కింద వివిధ ప్రధాన సంక్షేమ కార్యక్రమాలకు రూ.2.38 లక్షల కోట్లు వెచ్చించడం గమనార్హం అన్నారు. నవరత్నాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని, 56% రాజకీయ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించడం గొప్ప విషయమన్నారు. నామి­నే­టెట్‌ పోస్టుల్లోనూ సగానికి పైగా ఈ సామాజిక వర్గాల వారికి కేటాయించడం ఏపీలోనే చూస్తున్నామన్నా­రు. 2022లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం 7వ స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో మంచి ప్రగతి సాధించిందని చెప్పారు.

మార్చిలో విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడి­దారుల సద­స్సులో ఏపీ రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబ­డి ప్రతి­పాదనలను సాధించిందని, తద్వారా ఈ ఏడాది 16 కీలక అభివృద్ధి రంగాలలో 6 లక్షల ఉద్యోగ, ఉపా­ధి అవకాశాలను సృష్టించే అవకాశం ఉందన్నారు. దేశంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో ఏపీ స్థిరంగా ఒకటో స్థానంలో కొనసాగుతోందని చెప్పారు. 26 జిల్లా­లు, 76 రెవెన్యూ డివిజన్లు, 108 పోలీసు డివిజన్లు ఏర్పా­టు చేయడం ద్వారా జిల్లా పరిపాలనను వికేంద్రీకరించారన్నారు. 

పురస్కార గ్రహీతలు మన సంపద: సీఎం జగన్‌
సీఎం జగన్‌ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీ అవతరించి నేటికి 67 సంవత్సరాలైందని, వరుసగా మూడో ఏడాది ఈ అవార్డుల ప్రదానో­త్సవం నిర్వహించుకోవడం అనందంగా ఉందన్నారు. పలు రంగాల్లో రాణిస్తున్న మహనీ­యు­లను గౌరవిస్తూ వైఎస్సార్‌ అవార్డులతో మూడేళ్లుగా సత్కరించుకునే సంప్రదా­యం పాటిస్తున్నామని తెలిపారు. మన సమా­జాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులని తెలిపారు.

ఈ ఏడాది 27 మందిని వైఎస్సార్‌ అవార్డులతో సత్కరిస్తు­న్నామ­ని, 23 మందికి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్, నలుగురికి అచీవ్‌­మెంట్‌ అవార్డులు ప్రదానం చేస్తున్నామ­న్నారు. ‘తెలుగుదనానికి, తెలుగు మాట­కు, తెలుగు­వాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం డాక్టర్‌ వైఎస్సార్‌. ఆ మహనీయుని పేరిట ఏటా ప్రభుత్వం అత్యు­న్నత అవార్డులు ప్రదానం చేస్తోంది. వైఎ­స్సార్‌ హయాంలో వ్యవ­సాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం.. ఇలా ఏ రంగం తీసుకున్నా అంతకు ముందున్న చరిత్రగతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన విషయం చూశాం.

మన వ్యవసాయం, చేనేత, తప్పెట­గుళ్లు, జానపదం, రంగస్థలంలో రాణిస్తున్న వారికి, అభ్యు­దయ.. హేతు­వా­దం, సాటి మనుషులకు విశిష్ట సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఈ ఏ­డాది అవార్డుల్లో చోటు దక్కింది’ అని చెప్పారు. వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు కింద రూ.10 లక్షలు, మెమెంటో, ప్రశంసా ప­త్రం.. వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కింద రూ.5 లక్షలు, మెమెంటో, ప్రశంసా పత్రమి­చ్చారు. పుల్లెల గోపీచంద్‌ తరఫున ఆయన సతీమణి లక్ష్మి..రావు బాల­సర­స్వతి తరఫున ఆమె కుమారుడు అవార్డులు అందుకు­న్నారు. మంత్రు­లు, సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, అవార్డు కమిటీ సభ్యు­లు సజ్జల, జీవీడీ కృష్ణమోహన్, దేవులపల్లి అమర్, ముత్యా­లరాజు, అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్ర­మణ్యం­­రెడ్డి పాల్గొ­న్నా­రు.  

వైఎస్సార్‌ అవార్డు గ్రహీతల నేపథ్యం
1. పాంగి వినీత, మహిళా రైతు, అల్లూరి సీతారామరాజు జిల్లా (వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌)
సేంద్రీయ విధానాలను పాటిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. రైతు సాధికార సంస్థ సహాయంతో కషాయాల తయారీ.. రైతులకు పంపిణీ చేయడంతో పాటు పంట మార్పిడి విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ ఏడాది పొడవునా వ్యవసాయ ఉత్పత్తులు సాగు చేస్తున్నారు. రైతులకు సేంద్రీయ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు.
 
2. డాక్టర్‌ వై.వి.మల్లారెడ్డి, అనంతపురం (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌) 
ప్రముఖ సామాజిక కార్యకర్త ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ స్థాపించిన రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌డీటీ)లో 42 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. 15 ఏళ్లుగా అసియన్‌ ఫ్రాటెర్నా ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 235 గ్రామాల పరిధిలో 60 వేల మందికి పైగా రైతులు, భూమి లేని వారు, ఇతర వర్గాలతో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. జీవావరణం, పర్యా­వరణం వంటి రంగాల్లో సేవలు అందిస్తున్నారు.

3. యడ్ల గోపాలరావు, రంగస్థల కళాకారుడు, శ్రీకాకుళం (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
చిన్ననాటి నుంచే కళలపై మక్కువ ఉన్న ఈయన నక్షత్రక, శ్రీకృష్ణ, శ్రీరాముడి పాత్రలకు జీవం పోశా­రు. 14 ఏళ్ల వయసులో సాంఘిక నాటకాల ద్వారా అరంగేట్రం చేసి 5 దశాబ్దాలుగా సాంఘిక, పౌరాణిక పాత్రల ద్వారా వేలాది ప్రదర్శనలిచ్చారు.

4. తలిశెట్టి మోహన్, కలంకారీ కళాకారుడు, తిరుపతి (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
1974 నుంచి కలంకారీ కళకు విశేష సేవలు అందిస్తున్నారు. సహజ రంగులతో అద్దకం, ఫ్యాబ్రిక్‌ తయారీలో నేటి కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. 1990లో కేంద్ర టెక్స్‌ టైల్స్‌ మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్‌ మెరిట్‌ అవార్డు అందుకున్నారు. 

5. కోట సచ్చిదానంద శాస్త్రి, హరికథ, బాపట్ల (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
ప్రసిద్ధ హరికథా విద్వాంసుడు. ఆదిభట్ల నారా­యణ దాసు ప్రియశిష్యుడు. ఈయన హరికథ వింటుంటే.. సినిమా చూస్తున్నట్లు కళ్లకు కట్టినట్లు ఉంటుందని పేరుగడించారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో 1500కు పైగా హరికథా ప్రదర్శనలి­చ్చారు. భారత ప్రభుత్వం 2023 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

6. కోన సన్యాసి, తప్పెటగుళ్లు, శ్రీకాకుళం (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
ఉత్తరాంధ్రలో తప్పెటగుళ్లు సన్యాసిగా పేరుపొందారు. తెలుగు జానపదాలకు తప్పెటగుళ్లు పాట, ఆటతో దేశవ్యాప్తంగా కీర్తి తెచ్చారు. ఈ కళకు జీవం పోస్తున్నారు. తన ఇద్దరు కుమారులకు తప్పెట­గుళ్లు కళను నేర్పించారు. 

7. ఉప్పాడ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సొ­సైటీ, కాకినాడ (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
1938లో తన కార్యకలాపాలను ప్రారంభించిన ఉప్పాడ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ­లో 515 మంది సభ్యులున్నారు. 1986లో ఈ సొసైటీ రాష్ట్రపతి అవార్డు అందుకుంది.  ఉప్పాడ జమ్దానీ పట్టు చీర 1999లో భౌగోళిక గుర్తింపు పొందింది. 

8. ఎస్వీ రామారావు, అంతర్జాతీయ చిత్రకారుడు, కృష్ణా (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
ప్రముఖ కళాకారుడు, కవి, విద్యావేత్త, రచయిత. సమకాలీన ప్రపంచ కళాత్మక సంప్రదాయానికి మరింత వన్నె తెచ్చారు. తూర్పు– పశ్చిమ కళలకు వారధిగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. 

9. రావు బాలసరస్వతి, తొలితరం నేపథ్య గాయని, నెల్లూరు (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
ఈమె తొలితరం తెలుగు సినీ నటి, నేపథ్యగాయని. ఆరో ఏటనే గాత్ర కచేరి ప్రారంభించిన బాల సరస్వతి లలిత సంగీత సా­మ్రా­­జ్ఞిగా ప్రసిదిగాంచారు. ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఈమె కంఠం తెలుగు వారికి సుపరిచితం. 

10. తల్లావఝుల శివాజీ, చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రకాశం (వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌)
తండ్రి శివశంకర శాస్త్రి నుంచి కళాసాహిత్యం అలవడింది. బొమ్మలు గీయడం చిన్నప్పటి నుంచే స్వయం కృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగ విరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ప్రకృతి, ఆ జీవన విధా­నపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరత,  ఇతిహాసా­లు ఈయన చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి.

11. డాక్టర్‌ చిగిచెర్ల కృష్ణారెడ్డి, జానపద కళలు, అనంతపురం (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో రికార్డు స్థాయిలో 35 పీహెచ్‌డీ డిగ్రీలు, 66 ఎంఫిల్‌ డిగ్రీలను ప్రదానం చేశారు. జానపద కళలను పర్యవేక్షించి మార్గదర్శకత్వం వహించిన ఏకైక ప్రొఫెసర్‌గా దేశంలోనే ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో జానపద ప్రదర్శన కళలలో తొలిసారిగా పీహెచ్‌డీ అందించడంలో ప్రత్యేకతను సాధించారు. జానపద కళలు, జానపద సంస్కృతిపై పుస్తకాలను రచించారు.

12. కలీషాబీ మహబూబ్‌– షేక్‌ మహబూబ్‌ సుభానీ దంపతులు, నాదస్వరం, ప్రకాశం (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
ప్రకాశం జిల్లా పెద కొత్తపల్లికి చెందిన షేక్‌ మహబూబ్‌ సుభానీ సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందినవారు. కలీసాహెబీ మహబూబ్‌ పూర్వీ­కులూ నాదస్వరం విద్వాంసులు కావడం విశేషం. ఈ దంపతులు భారత్‌తో పాటు అబుదాబి, జపాన్, మలేషియా, తదితర దేశాల్లో నాదస్వర కచేరీలు ఇచ్చారు. 

13. ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం, పశ్చిమ గోదావరి (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
సంస్కృతాంధ్ర పండితుడు, పద్య కవి, అవధాని, కథకుడు, అనువాదకుడు, అధ్యాపకులు. కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ‘దేవీ భాగవతం’ వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. 

14. ఎండీ ఖదీర్‌బాబు, రచయిత, నెల్లూరు (వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌) 
మహమ్మద్‌ ఖదీర్‌బాబు ప్రసిద్ధ తెలుగు కథా రచయిత, నూతన తరం తెలుగు కథకులలో ప్రత్యే­కౖ­మెన స్థానం. ప్రపంచంలోని పలు భాషల సాహి­త్యాన్ని ఇంగ్లిష్‌లో అనువదించేందుకు ఏటా బ్రిటీష్‌ కౌన్సిల్‌ అందించే ‘చార్లెస్‌ వాల్లెస్‌ ఫెలోషిప్‌’కు మహమ్మద్‌ కథలు ఎంపికయ్యాయి. తెలుగు కథలకు ఈ ఫెలోషిప్‌ లభించడం ఇదే తొలిసారి. 

15. మహజబీన్, నెల్లూరు (వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌)
మహజబీన్‌ న్యాయవాద విద్యను అభ్యసించారు. తన కవితా సంకలనం ‘ఆకు రాలు కాలం’ 1997లో ప్రచురితమైంది. ఈమె తన కవిత్వంలో లింగ న్యాయం, శాంతి, పర్యావరణం, మహి­ళలు, పిల్లల హక్కులపై దృష్టి పెట్టడం విశేషం.

16. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, చిత్తూరు (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
నామిని సుబ్రమణ్యం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సుప్రసిద్ధ రచయిత. 1980, 1990ల్లో ఈయన కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమ­య్యా­యి. సాధారణ రాయలసీమ వాడుక భాషలో పిల్లలు తేలికగా అర్థం చేసుకునేలా పుస్తకాలు రచించారు. ఆయన జీవితానుభవాలనే కథలుగా రచించి పాఠకుల మన్ననలు పొందారు.

17. అట్టాడ అప్పలనాయుడు, శ్రీకాకుళం (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
అట్టాడ అప్పలనాయుడు ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ కథ, నవలా రచయిత.  శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితులై జననాట్య మండలిలో పని చేశారు. పార్వతీపురంలో ఇంటర్‌ చది­వి జంఝావతి రిజర్వాయర్‌ నిర్మాణంలో కూలీగా పని చేశారు. తన మిత్రులతో కలిసి శ్రీకాకుళ సాహితి అనే సంస్థను స్థాపించారు.

18. పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్, గుంటూరు (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
గోపీచంద్‌ ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్‌ జట్టుకు చీఫ్‌ నేషనల్‌ కోచ్‌గా ఉన్నారు. ఈయన 2001లో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకు­న్నారు.

19. కరణం మల్లీశ్వరి, వెయిట్‌ లిఫ్టింగ్, శ్రీకాకుళం (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లేశ్వరి 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌­లో కాంస్య పతకం సాధించారు. 2022లో ఈమెకు బీబీసీ లై‹ఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రదానం చేశారు.

20. డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
వైఎస్సార్‌ జిల్లాలోని ప్రొద్దుటూరుకి చెందిన ఈయన 40 ఏళ్లుగా విజయవాడలో కన్సల్టెంట్‌ సైకియా­ట్రిస్ట్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 50 పడకల మానసిక వ్యాధుల ఆసుపత్రి ‘ఇండ్లాస్‌’ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. 

21. డాక్టర్‌ ఈసీ వినయ్‌ కుమార్, స్వచ్ఛంద సేవా సంస్థ, డాక్టర్, వైఎస్సార్‌ జిల్లా (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ, బీఏహెచ్‌ఏ సర్వే, గురక­కు శస్త్రచికిత్స, మైక్రో ఇయర్‌ సర్జరీలలో ప్రసిద్ధుడైన ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌. హైదరాబాద్‌ అపో­లో హెల్త్‌ సిటీతో అనుబంధం ఉన్న వినయ్‌ కుమార్‌ ట్రస్ట్‌తో పాటు వినికిడి లోపం ఉన్న వారికి సహాయం చేసేందుకు ‘సహీ’ సొసైటీని ప్రారంభించారు.

22. గోవిందరాజు చక్రధర్, సీనియర్‌ జర్నలిస్ట్, కృష్ణా జిల్లా (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా గోవిందరాజు చక్రధర్‌ది సుదీర్ఘ ప్రస్థానం. మీడియా వ్యాఖ్యాత, అనువాదకుడు, సోషల్‌ మీడియా ప్లాట్‌­ఫాంలో కంటెంట్‌ సృష్టికర్త. 

23. హెచ్‌ఆర్కే), ఆధునిక, సంస్కరణవాద కవిత్వం (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
ఆధునిక, సంస్కరణవాద కవిత్వంలో హనుమంతరెడ్డి దిట్ట. హెచ్‌ఆర్కే అనేది ఈయన పేరుకు సంక్షిప్త రూపం. కర్నూలు జిల్లాలోని ‘గని’లో 1951లో పేద రైతు కుటుంబంలో జన్మించారు.

24. బెజవాడ విల్సన్, ఎన్టీఆర్‌ జిల్లా (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
సామాజిక నాయకుడు. భారతీయ మానవ హక్కు­ల సంస్థ సఫాయి కర్మచారి ఆందోళన్‌ వ్యవ­స్థాపకులలో ఒకరు. 2016లో ఈయన రామన్‌ మెగసెసే అవార్డు అందుకున్నారు. 

25. కుసుమ శ్యాంమోహన్‌ రావు, డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌)
దక్షిణాది రాష్ట్రాల్లో గిరిజన, దళిత గ్రామాల్లోని సమస్యలను, వారి విజయాలను తెలియజేసేలా యూట్యూబ్‌ ఛానెల్‌ స్థాపించారు. తన ఛానెల్‌ ద్వారా అవగాహన కార్యక్రమాలు, ప్రసంగాలు ప్రసారం చేస్తున్నారు.

26. నిర్మల హృదయ భవన్, ఎన్టీఆర్‌ జిల్లా (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌)
మదర్‌ థెరిసా సోదరీమణులు నిర్వహిస్తున్న మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల హృదయ్‌ భవన్‌ను 1973లో మదర్‌ థెరిసా ప్రారంభించారు. కులం, మతంతో సంబంధం లేకుండా పేదలను ఆదుకునే లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. వీధుల్లో ఒంటరిగా ఉన్న, అనారోగ్యంతో ఉన్న, ఎవరూ పట్టించుకోని వారిని, పిల్లల ఆదరణకు నోచుకోని వారిని ఆదుకుని రక్షణ కల్పిస్తోంది. 

27. డాక్టర్‌ జి.సమరం, ఎన్టీఆర్‌ జిల్లా (వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌) 
ప్రముఖ వైద్యుడు, సంఘ సేవకుడు, రచయిత. 1970లో విజయవాడలో వైద్యునిగా వృత్తి జీవి­తాన్ని ప్రారంభించారు. 1996–97లో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా పని చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement