
(ఫైల్)
సాక్షి, అమరావతి: ఒకప్పుడు పెద్ద జబ్బు వచ్చిందంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న వారి కష్టాన్ని చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లేవారు. ఇలాంటి వేల కుటుంబాలకు అపర సంజీవనిగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పునర్జన్మ ప్రసాదిస్తోంది. చికిత్స ఖర్చులు చెల్లించడమే కాకుండా శస్త్ర చికిత్స తర్వాత రోగి కోలుకునే సమయంలో చేతికి డబ్బులూ ఇస్తున్నారు. కుటుంబ పెద్ద అనారోగ్యం పాలైతే ఆ ఇంట్లో వారు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే సహృదయంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆరోగ్య సేవలు పొందాలంటే పొరుగూర్లకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఇప్పుడు గ్రామాల్లో లేదు. గర్భిణులు, చిన్నారుల సంరక్షణ, నవజాత ఆరోగ్య సంరక్షణ, అంటు వ్యాధుల నివారణ తదితర 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులు గ్రామంలోనే అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేల గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు సేవలు ప్రారంభించాయి. గత మూడేళ్లలో కరోనా మహమ్మారి మూడు దఫాలుగా విరుచుకు పడ్డా అన్ని వేవ్‌ల్లోనూ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసింది. రూ.16 వేల కోట్లకుపైగా వెచ్చిస్తూ వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంతో మూడేళ్లలోనే ఎన్నో మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి.
ఆరోగ్యశ్రీతో రక్షణ ఛత్రం
ఆరోగ్యశ్రీతో గత మూడేళ్లలో 18,72,183 మందికి ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించింది. ఏకంగా రూ.6,321.92 కోట్లు వైద్యానికి ఖర్చు చేసింది. శస్త్ర చికిత్సల అనంతరం 9,85,315 మందికి విశ్రాంతి సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.624.01 కోట్లు ఆర్థిక సాయం చేసింది. రోజుకు రూ. 225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందుతోంది.
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో 95% కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఉచితంగా వైద్య చికిత్సలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే విశిష్ట గుర్తింపు సాధించింది. దేశంలో మధ్య తరగతి వర్గాలకు ఆరోగ్యబీమా దక్కడం లేదని ‘హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ క్లాస్’ను ఉటంకిస్తూ గత ఏడాది నీతి ఆయోగ్ పేర్కొంది. ఏపీలో మాత్రం మధ్య తరగతి వర్గాలను కూడా ఆరోగ్య బీమా రక్షణ ఛత్రం కాపాడుతోందని ఆ నివేదికలో వెల్లడించడం గమనార్హం. రూ.ఐదు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న అందరికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు.
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్
రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నాడు–నేడులో భాగంగా రూ.1,692 కోట్లతో 1,498 భవనాలకు మరమ్మతులు, 8,534 కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 1,201 భవనాల నిర్మాణం పూర్తయింది. క్లినిక్‌లలో సేవలు అందించేందుకు 8,413 మంది ఎంఎల్‌హెచ్‌పీలను ప్రభుత్వం నియమించింది. సగటున రోజుకు ఒక్కో క్లినిక్‌లలో 23 ఓపీలు, ఎనిమిది పరీక్షలు జరుగుతున్నాయి. నిత్యం సగటున 4,500 మందికి టెలీమెడిసిన్ వైద్య సేవలు అందుతున్నాయి.
పీహెచ్‌సీలు బలోపేతం
రాష్ట్రవ్యాప్తంగా 1,149 పీహెచ్‌సీలు ఉండగా ప్రతి చోటా ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు సహా 12 మంది సిబ్బంది ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.661 కోట్లతో నాడు–నేడు కింద 997 పీహెచ్‌సీలకు మరమ్మతులు, 148 కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలనే లక్ష్యంతో కొత్తగా 176 పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి పీహెచ్‌సీలో 63 రకాల వైద్య పరీక్షలు, 215 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. పట్టణ, నగర ప్రాంతాల్లో 30 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పారు. రూ.367 కోట్లతో వీటికి భవనాలు, ఇతర వనరులు సమకూరుస్తున్నారు. నాడు–నేడులో భాగంగా 121 సీహెచ్‌సీలు, 24 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1,223 కోట్లు ఖర్చు చేస్తోంది.
నవశకానికి నాంది
ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులను వెచ్చిస్తున్నారు. రూ.12,268 కోట్లతో 11 వైద్య కళాశాలలను, బోధనాస్పత్రులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా 16 వైద్య కళాశాలలు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. నూతనంగా నిర్మించే ప్రతి వైద్య కళాశాలకు అనుసంధానంగా నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మరో 1,850 వరకూ ఎంబీబీఎస్, 960 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం
బోధనాస్పత్రుల్లో వసతులు గణనీయంగా మెరుగయ్యాయి. విజయవాడ జీజీహెచ్‌లో 240 పడకలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను అందుబాటులోకి తెచ్చారు. కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ సహా పలు విభాగాలను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వసతులు సమకూర్చడంతో పెద్దాస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఓపీలు దాదాపు రెట్టింపు కావడం ఇందుకు నిదర్శనం. గుంటూరు జీజీహెచ్‌లో అధునాతన సౌకర్యాలతో క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ప్రభుత్వం 2020లో ప్రారంభించింది.
రూ.28 లక్షల వైద్యం ఉచితం
కూలి పనులకు వెళ్లే కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన చేబ్రోలు వరప్రసాద్‌కు ఇద్దరు కుమారులు. బీటెక్ చదివిన పెద్ద కుమారుడు గ్రామంలోనే చిన్న హోటల్ నడుపుతున్నాడు. చిన్న కుమారుడు ఉదయ్‌భాస్కర్ మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ ఎం.ఎల్.టి. కోర్సు చదువుతున్నాడు. గతేడాది ఆగస్టులో ఉదయ్‌కు కడుపులో నొప్పి రావడంతో విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.
ప్లేట్ లెట్స్ ఎక్కించినా నయం కాలేదు. సమగ్ర రక్త పరీక్షల అనంతరం బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. వరప్రసాద్ కుటుంబాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆపద్భాంధవిలా ఆదుకుంది. ఇప్పటికే పలు మార్లు కీమోథెరఫీ చేశారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేపడుతున్నారు. ఏకంగా రూ.28 లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆరోగ్యశ్రీ తన కుమారుడికి ప్రాణం పోసిందని వరప్రసాద్ చెబుతున్నాడు.
శివ శంకర్ గుండె పదిలం
వైఎస్సార్ జిల్లా దేవుని కడపకు చెందిన శివ శంకర్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. అతడి సంపాదనపై తల్లి, భార్య పిల్లలు ఆధారపడి జీవిస్తున్నారు. రెండేళ్ల క్రితం శివకు గుండె జబ్బు ఉన్నట్లు బయటపడింది. గుండె మార్పిడి చేస్తే కానీ బతికే అవకాశం లేని పరిస్థితి. అందుకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. అతడిని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆదుకుంది. బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో నెల క్రితం ఆరోగ్యశ్రీతో ఉచితంగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స జరిగింది. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం రూ.10.50 లక్షలు చెల్లించింది.
పల్లెకు ప్రాణనాడి
ప్రస్తుతం రాష్ట్రంలో 44,452 మందికి ఒకటి చొప్పున 104 వాహనాలున్నాయి. ప్రతి వాహనంలో 74 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. కొత్తగా 539 వాహనాలను కొనుగోలు చేస్తోంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే 108 అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 412 కొత్త వాహనాలను సమకూర్చింది. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కింద 66,17,613 విద్యార్థులు, 19,12,259 మంది వృద్ధులు చికిత్స పొందారు. 2,457 మంది వైద్యుల నియామకంతో పాటు పారా మెడికల్ నియామకాల్లో భాగంగా ఇప్పటి వరకు 36,898కి పైగా పోస్టులు భర్తీ చేశారు.
కరోనాకు కళ్లెం ఇలా..
► కరోనా ప్రారంభమైనప్పుడు ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి.. రోజుకు 80 వేల పరీక్షలు చేయగలిగే సామర్థ్యంతో పాటు రాష్ట్రంలో 44 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లను ప్రభుత్వం నెలకొల్పింది. మూడు వేవ్‌ల్లో కలిపి ఇప్పటి వరకూ 3.35 కోట్ల పరీక్షలను వైద్య శాఖ చేపట్టింది.
► దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మిలియన్ జనాభాకు 6,07,747 వైద్య పరీక్షలు చేయగా మన రాష్ట్రంలో మాత్రం జాతీయ స్థాయిని మించి 6,28,908 పరీక్షలు చేశారు. రికవరీ శాతం జాతీయ స్థాయిలో 98.74 ఉంటే, రాష్ట్రంలో 99.36 శాతం నమోదైంది.
► ప్రస్తుతం 34,763 పడకలకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. ఆక్సీజన్ సరఫరాకు 90 ఎల్‌ఎంవో ట్యాంకర్‌లు, 25 క్రయోజనిక్ ట్యాంకర్‌లు కొనుగోలు చేశారు. 23,971 ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లు, 55,007 డీ–టైప్ ఆక్సీజన్ సిలెండర్‌లను సమకూర్చారు.
► ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ విధానం అమలు. ఇప్పటి వరకు 45 దఫాలు ఫీవర్ సర్వేలు. ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లు.. పడకల లభ్యత, రోగుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ
► సీసీ కెమెరాల ద్వారా క్వారంటైన్ సెంటర్లు, ఆసుపత్రుల పర్యవేక్షణ. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు ఉచిత చికిత్స ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏపీ. 104 కాల్ సెంటర్‌తో 13 లక్షల మందికి పైగా సేవలు
► కోవిడ్ టీకాల పంపిణీలో దేశంలో రికార్డు. 15 ఏళ్లు పైబడిన వారందరికీ రాష్ట్రంలో రెండు డోసుల టీకా పంపిణీ 100 శాతం పూర్తి. 12–14 వయసు వారికి తొలి డోసు వంద శాతం, రెండో డోసు 92 శాతానికి పైగా పంపిణీ. హెల్త్‌కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వేగంగా ప్రికాషన్ డోసు పంపిణీ.
Comments
Please login to add a commentAdd a comment