AP Government Relaxes Curfew Restrictions In 11 Districts - Check Details - Sakshi
Sakshi News home page

కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

Published Tue, Jul 6 2021 4:12 AM | Last Updated on Tue, Jul 6 2021 9:53 AM

CM Jagan made decision to Changes in curfew relaxation in Andhra Pradesh - Sakshi

క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ నియంత్రణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఆధారంగా కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పాజిటివిటీ రేటు ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి మినహా మిగతా 11 జిల్లాల్లో రాత్రి పది గంటల వరకూ కర్ఫ్యూ సడలించాలని అధికారులను ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు కల్పిస్తూ సాయంత్రం 6 గంటలకే దుకాణాలను మూసివేయాల్సిందిగా స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు ఐదు శాతంలోపు వచ్చే వరకు ఈ రెండు జిల్లాల్లో ఆంక్షలు కొనసాగించనున్నట్లు తెలిపారు. మిగతా 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు అమలు చేస్తూ రాత్రి 9 గంటలకే దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. ఈ సడలింపులు ఈ నెల 8వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ అమలుపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.  

వ్యాక్సినేషన్‌పై మరింత శ్రద్ధ..
వ్యాక్సినేషన్‌పై మరింత ధ్యాస పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 45 సంవత్సరాలు దాటిన వారికి చేపడుతున్న వ్యాక్సినేషన్‌ 90 శాతం పూర్తైన తర్వాత ఉపాధ్యాయులు, మిగిలిన వారికి టీకాలు ఇవ్వాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ చేపట్టినందున ఐదేళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రాధాన్యతల ప్రకారం విభాగాల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలని, గర్భిణిలకూ టీకాలు ఇవ్వాలని ఆదేశించారు. 

రెండు నెలల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల పనులు పూర్తి 
రెండు నెలల్లోగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల పనులు ఉత్పత్తి సామర్ధ్యంతో పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు వివరాలను అధికారులు తెలియచేశారు. 97  చోట్ల జరుగుతున్న 134 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల పనుల ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు.  15 వేల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టీ.కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు తదితరులు హాజరయ్యారు.

ఆదివారం నాటికి కోవిడ్‌ ఇలా
– రాష్ట్రంలో రికవరీ రేటు 97.47 శాతం 
– పాజిటివిటీ రేటు 3.66 శాతం
– ఐదు జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు
– యాక్టివ్‌ కేసులు 35,325
– ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 6,542
– కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 5,364
– హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు 23,419
– నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పడకల్లో చికిత్స 93.40 శాతం  
– ప్రైవేటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పడకల్లో చికిత్స 76.26 శాతం
– 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన కాల్స్‌ 703

బ్లాక్‌ ఫంగస్‌.. 
– ఇప్పటివరకు నమోదైన కేసులు 3,670
– గత 24 గంటలలో 33 కేసులు నమోదు
– మరణించిన వారు 295
– ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినవారు 2075

వ్యాక్సినేషన్‌.. 
– ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు  1,28,84,201
– సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 96,25,316
– రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 32,58,885 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement