Andhra Pradesh: CM Jagan Speech At Inorbit Mall Foundation Stone Program In Visakhapatnam - Sakshi
Sakshi News home page

ఇది ఆణిముత్యంలాంటి ప్రాజెక్టు: సీఎం జగన్‌

Published Tue, Aug 1 2023 3:29 PM | Last Updated on Tue, Aug 1 2023 4:11 PM

CM Jagan Speech at Inorbit Mall Foundation Stone Program in Visakha - Sakshi

సాక్షి, విశాఖ:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు(మంగళవారం)విశాఖ పర్యటన సందర్భంగా అక్కడ రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహేజా గ్రూప్స్‌ ఇనార్బిట్‌ మాల్‌కు భూమి పూజ చేశారు. విశాఖపట్నం కైలాసపురంలో నిర్మిస్తున్న ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు సీఎం జగన్‌. 

ఈ సందర్బంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

ఆణిముత్యంలాంటి ప్రాజెక్టు...
దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇక్కడ ప్రారంభమవుతుంది. విశాఖ అభివృద్ధికి మరింత దోహదం చేస్తూ... విశాఖపట్టణంలో ఆణిముత్యంగా నిల్చిపోయే మంచి ప్రాజెక్టుకు శంకుస్ధాపనతో శ్రీకారం చుట్టాం. 17 ఎకరాల స్ధలానికిగాను... 12–13 ఎకరాల పెద్ద విస్తీర్ణంలో మాల్‌ రావడం అన్నది కొన్ని చోట్లే ఉంటుంది. ఇదే రహేజా గ్రూపు హైదరాబాద్‌లో  ఇనార్బిట్‌ మాల్‌ను 7–8 ఎకరాల్లోనే కడితే మనం 12–13 ఎకరాల విస్తీర్ణంతో పెద్ద మాల్‌కు ఇక్కడ శంకుస్ధాపన చేసుకున్నాం.

ఈ కార్యక్రమాన్ని సాధ్యమయ్యేలా చేసిన  నీల్‌ రహేజాకు, సీఈఓ రజనీష్‌ మహాజన్‌కు, సీఓఓ శ్రావణ్‌ కుమార్‌తో పాటు మిగిలిన అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున, నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు.

మారనున్న విశాఖ రూపురేఖలు....
ఈ రోజు ఇక్కడ కడుతున్న మాల్‌ నిర్మాణం ద్వారా విశాఖపట్నం రూపురేఖలు మారడమే కాకుండా... దక్షిణ భారతదేశంలోనే పెద్ద మాల్‌ కానుంది. రూ.600 కోట్ల పెట్టుబడితో ఇంత పెద్ద విస్తీర్ణంలో మాల్‌ నిర్మాణం వల్ల... 8వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.

ఫేజ్‌ –2లో ఐటీ స్పేస్, ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌.
12 నుంచి 13 ఎకరాల్లో మాల్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత.... మిగిలిన భూమిలో రాబోయే రోజుల్లో రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ రెండున్నర లక్షల ఎస్‌ఎప్‌టీతో ఐటీ స్పేస్‌ కూడా రాబోతుంది. అంతర్జాతీయ స్ధాయిలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ను కూడా నిర్మించనున్నారు. వీటన్నింటి ద్వారా ఇంకా ఉద్యోగఅవకాశాలు మెరుగవుతాయి. 2.50 లక్షల ఎస్‌ఎఫ్‌టితో ఐటీ స్పేస్‌ రావడం వల్ల మరో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నాయి. ఇవన్నీ రాబోయో రోజుల్లో విశాఖపట్టణాన్ని  అంతర్జాతీయ స్ధాయిలో నిలబెట్టే కార్యక్రమాలు. 

ఇంతకముందు వచ్చినప్పుడు ఆదానీ గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డేటాపార్కు, ఐటీ స్పేస్‌కు శంకుస్ధాపన చేసుకున్నాం. అదే రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు కూడా శంకుస్ధాపన చేశాం. అంతకన్నా ముందు శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే విధంగా మూలపేటలో పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేసుకున్నాం. ఇవన్నీ ఉత్తరాంధ్రా అభివృద్ధి రూపురేఖలను మార్చే గొప్ప అడుగులు. ఇనార్బిట్‌ మాల్‌ కూడా అలాంటిదే. 

ఇవన్నీ విశాఖలో గొప్ప ప్రాజెక్టులుగా నిలుస్తాయి
ఇవి కాకుండా రహేజా గ్రూపు దేశంలో పలుచోట్ల ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు కట్టారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో రాజ్‌విలాస్‌ తరహాలో సూపర్‌ లగ్జరీ  ఫైవ్‌స్టార్‌ ప్లస్, సెవెన్‌ స్టార్‌ హోటల్‌ కట్టబోతున్నారు. ఇప్పటికే ఒబెరాయ్, మేపెయిర్‌ హోటల్స్‌ గ్రూపు వాళ్లు కూడా కడుతున్నారు. ఆ తరహాలో రహేజా గ్రూపు కూడా సెవెన్‌ స్టార్‌ లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణంలో మూడో గ్రూపు కానుంది. ఇవన్నీ విశాఖలో గొప్ప ప్రాజెక్టులుగా నిలుస్తాయి.

అదే విధంగా హిందూపూర్‌లో కూడా 350 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, టెక్ట్స్‌టైల్స్‌కు సంబంధించిన పార్కు రాబోతుంది. దానివల్ల మరో 15వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు కూడా అడుగులు ముందుకు వేశాము... యుద్ధ ప్రాతిపదికన అది కూడా టేకప్‌ చేస్తామన్నారు. దానికి కూడా ప్రభుత్వం సపోర్టు చేస్తుంది. 

మేము మీకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటాం
ఈ రోజు మీ అందరి ద్వారా రహేజా గ్రూపు అధ్యక్షుడు నీల్‌కు చెప్తున్నాను. మేము మీకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటాం. కేవలం ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలోనే మీకు అందుబాటులో ఉంటాం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని... పెట్టుబడులు పెట్టండి. మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా... ఏపీలో పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా సహాయ, సహకారాలు అందిస్తామో మీరు కచ్చితంగా చూస్తారు. దేవుని దయవలన వీళ్లు మరింత బాగుపడి.. మన ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నాను. 

దీని తర్వాత ఆంధ్రాయూనివర్సిటీలో రూ.130 కోట్లతో హై ఎండ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో విశాఖ అభివృద్ధికి దోహదపడతాయి అని సీఎం ప్రసంగం ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement