మనబడి నాడు–నేడుపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మన పిల్లలను హాస్టల్‌లో ఉంచితే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో అలా అన్ని హాస్టళ్లలో ఉండాలి. ముఖ్యంగా బాత్‌రూమ్‌లు చక్కగా ఉండాలి. వాటిని బాగా నిర్వహించాలి. ఇంకా చెప్పాలంటే మరమ్మతులు రాకుండా ఉండే మెటీరియల్ వాడాలి. అన్ని బాత్‌రూమ్‌లలో హ్యాంగర్స్ కూడా ఉండాలి.
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పనుల ఫలితాలు దీర్ఘకాలం ఉండాలి. పెయింటింగ్ బావుండాలి. నిర్వహణలో ఎక్కడా అలక్ష్యం చూపొద్దు. పక్కాగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ, ఏ స్కూల్‌లో, ఏ సమస్య వచ్చినా ఎంత వేగంగా స్పందించి, దాన్ని బాగు చేశామన్న దానిపై మన ప్రతిభ, పనితీరు ఆధారపడి ఉంటుంది.
గిరిజన ప్రాంతాల హాస్టళ్లలో బాత్‌రూమ్‌లలో నీళ్లు లేక, విద్యార్థులు బయటకు వెళ్లడం నేను స్వయంగా చూశాను. అందువల్ల హాస్టళ్లలో బాత్‌రూమ్‌ల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయండి. ఇప్పటికే హాస్టళ్లలో మెనూకు సంబంధించి యాప్ ఉంది. బాత్‌రూమ్‌లపై కూడా యాప్ డెవలప్ చేయాలి.
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు తొలి దశ పనులు కచ్చితంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి కావాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ ఆధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రెండో దశ పనుల్లో హాస్టళ్లలో పూర్తి సౌకర్యాలు కల్పించాలన్నారు. మనబడి నాడు–నేడు తొలి దశ పనుల పురోగతి, జగనన్న గోరుముద్దపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మనబడి నాడు– నేడు పనుల పరిశీలన కోసం విద్యా శాఖలో ఉన్నత స్థాయి విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం పది రకాల పనులకు సంబంధించి నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. రెండో దశలో చేపడుతున్న పనుల్లో హాస్టళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. 2022 సంక్రాంతి నాటికి అన్ని హాస్టళ్లలో బంకు బెడ్లతో సహా, అన్ని సదుపాయాలు తప్పకుండా ఉండాలన్నారు. మంచాలు, పరుపులు, బెడ్‌షీట్లు, బ్లాంకెట్లు, అల్మారాలు ఏర్పాటు చేయాలన్నారు. హాస్టళ్లలో కూడా జగనన్న గోరుముద్ద తరహాలో పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక మెనూ రూపొందించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో అంగన్‌వాడీలలో కూడా నాడు–నేడు కింద పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
విద్యా కానుక కిట్‌లో నాణ్యత
► జగనన్న విద్యా కానుక కిట్‌లో ప్రతి ఒక్కటి నాణ్యత కలిగి ఉండాలి. స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ బావుండాలి.
► వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ 12న స్కూళ్లు ప్రారంభం అవుతాయనుకుంటే పిల్లలకు జూన్ 1న ఈ కిట్‌ను పంపిణీ చేయాలి. ఆ మేరకు స్కూళ్లలో కిట్లు మే 15 నాటికి సిద్ధంగా ఉండాలి.
► హాస్టల్ పిల్లలకు ప్రతి రోజు ఒక వెరైటీ ఫుడ్ ఉండేలా ప్లాన్ చేయండి. ఆ మేరకు మార్పు చేసిన మెనూ అందుతోందా.. లేదా అనేది క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి.
► రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని 159 మండలాల్లో వాటిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు భవనాల్లో 9,323 అంగన్‌వాడీలు ఉన్నాయి.
పనుల పురోగతి ఇలా..
► నాడు–నేడు తొలి దశ పనులు కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యమయ్యాయి. కానీ అత్యంత నాణ్యతగా కొనసాగుతున్నాయి. పేరెంట్ కమిటీలు, హెడ్మాస్టర్లు, సచివాలయాల ఇంజనీర్లు, టాటా ప్రాజెక్టŠస్ వంటి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ కంపెనీల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు, సోషల్ ఆడిటింగ్ జరుగుతోంది.
► తొలి దశలో 15,715 స్కూళ్లలో మొత్తం రూ.1690.14 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 5,735 ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో రూ.5 లక్షలతో, 1,668 హైస్కూళ్లలో రూ.15 లక్షలతో కిచెన్ షెడ్లు ఏర్పాటవుతున్నాయి. ఇందుకు రూ.537 కోట్లు ఖర్చవుతోంది.
► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment