సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదవారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ టీచింగ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు.
మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రూ.8వేల కోట్లు..
‘‘మెడికల్ కాలేజీల నిర్మాణాలకు దాదాపు రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదవారికి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుకొండ, నంద్యాల, ఆదోని, పాడేరు, పులివెందులలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని’’ సీఎం తెలిపారు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో గణనీయమైన మార్పులు..
‘‘మెడికల్ కాలేజీలతోపాటు 500 పడకల ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణం చేపడుతున్నాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఎన్‌ఏబీహెచ్ అక్రిడేషన్ పొందేలా అడుగులు ముందుకేస్తున్నాం. మూడేళ్లలో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రైవేట్ ఆస్పత్రులకు జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో 5 ఎకరాల భూమి ఉచితంగా కేటాయిస్తాం. ప్రతి గ్రామంలోనూ వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలను తీసుకొస్తున్నాం. రూ.246 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో గణనీయమైన మార్పులు చేశాం. 2,436 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేశామని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కోవిడ్ వైద్యం..
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెన్షన్ అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కోవిడ్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చామని.. రెండేళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రూ.5,215 కోట్లు చెల్లించామని సీఎం జగన్ తెలిపారు. 1180 వాహనాలు 108, 104లను అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు.కోవిడ్ సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా ఉండి మరణించిన వారికి కేంద్రం స్కీం వర్తించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు అందజేస్తామని సీఎం వెల్లడించారు.
చదవండి: 2 Years Of YS Jagan Rule In AP: బీసీలకు వెన్ను దన్ను
బాధిత చిన్నారులకు తక్షణమే భరోసా
Comments
Please login to add a commentAdd a comment