ప్రజల ఆప్యాయతను జీర్ణించుకోలేని ప్రతిపక్షం | CM YS Jagan Opposition that cannot digest the affection of people | Sakshi
Sakshi News home page

ప్రజల ఆప్యాయతను జీర్ణించుకోలేని ప్రతిపక్షం

Published Thu, Oct 21 2021 2:00 AM | Last Updated on Thu, Oct 21 2021 8:20 AM

CM YS Jagan Opposition that cannot digest the affection of people - Sakshi

అంతా నావాళ్లే.. అన్ని ప్రాంతాలు నావే.. ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే.. అన్న భావనతో రెండున్నరేళ్ల పరిపాలన సాగుతూ వచ్చింది. మీరిచ్చిన అధికారంతో ఇప్పటికే సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కలిగిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడా వివక్ష, అవినీతి లేకుండా, నేరుగా లబ్ధిదారుని ఖాతాలోకి నగదు వెళ్లేటట్టుగా (డీబీడీ ద్వారా) చర్యలు తీసుకున్నాం. 

కులం, మతం, ప్రాంతం, వర్గం.. చివరకు పార్టీ కూడా చూడకుండా, ఎవరికి ఓటేశారన్న మాట కూడా అడగకుండా అర్హులందరికీ మంచి జరిగేలా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని ప్రభుత్వం నడిపిస్తోంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు కూడా అన్ని రకాలుగా న్యాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇవన్నీ జీర్ణించుకోలేని ప్రతిపక్షం విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం దారుణం. 
సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: ప్రభుత్వం పట్ల ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత, ఆదరణను ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ఆదరించి ప్రతిపక్షానికి స్థానం లేకుండా చేశారన్నారు. దీంతో ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగతంగా బూతులు తిడుతూ విద్వేషాలు, వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన జగనన్న తోడు లబ్ధిదారులైన చిరు వ్యాపారులకు బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వడ్డీని జమ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనను బూతులు తిట్టడం, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు స్పందించడం, ఎల్లో మీడియా వక్రీకరణ రాతలపై ఆయన స్పందించారు. వాడరాని భాషతో బూతులు తిట్టడంతో వాటిని వినలేక, భరించలేక అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి ఖండిస్తే కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి.. అన్యాయమైన రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

రాజకీయ లబ్ధికి ఆరాటం
► దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో సాగిన పరిపాలన మీ అందరికీ నచ్చింది కాబట్టే పంచాయతీ ఎన్నికలు మొదలు.. మున్సిపల్‌ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు.. ఇలా ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతిపక్షానికి స్థానమే లేకుండా ప్రతి అక్కా, చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు కూడా నన్ను సొంత బిడ్డగా, అన్నగా భావించి అన్ని రకాలుగా తోడుగా నిలబడుతున్నారు.
► మీరు ఇంత ప్రేమ, ఆప్యాయతలు చూపుతుండటాన్ని జీర్ణించుకోలేని విధంగా ప్రతిపక్షం తయారైంది. దీనికి తోడు ఎల్లో మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఏ రకంగా తయారయ్యిందో మీరే చూస్తున్నారు. ఈ ప్రతిపక్ష నేతలు ఎవరూ కూడా మాట్లాడలేని విధంగా అన్యాయమైన మాటలు మాట్లాడతారు. దానికి ఈ ఎల్లో మీడియా వంత పాడుతుంది. నేను ప్రతిపక్షంలో ఉండగా.. ఏ రోజు కూడా ఇటువంటి మాటలు ఎవరూ మాట్లాడి ఉండరు.  
► అంతగా బూతులు తిట్టినప్పుడు.. ఆ టీవీల్లో ఆ దృశ్యాలు చూడలేక, ఆ తిట్లు వినలేక మనల్ని అభిమానించే వాళ్లు, మనల్ని ప్రేమించే వాళ్ల రియాక్షన్‌ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆ రకంగా కావాలని తిట్టించి, వైషమ్యాలను సృష్టించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆరాటం మన కర్మ కొద్దీ ఈ రాష్ట్రంలోనే కనిపిస్తోంది. 

అబద్ధాలు, అసత్యాలు.. 
► అబద్ధాలు ఆడతారు.. అసత్యాలు ప్రచారం చేస్తారు.. వంచనా కనిపిస్తుంది.. ప్రతి మాటలోనూ, ప్రతి రాతలోనూ అబద్ధాలతో మోసం చేసే వక్రబుద్ధే కనిపిస్తుంది. మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టడానికి ఏ మాత్రం వెనుకాడరు. కులాల మధ్య, మతాల మధ్య కూడా చిచ్చు పెడతారు. ఇష్టమొచ్చినట్లు కార్యక్రమాలు చేస్తారు. వ్యవస్థలను పూర్తిగా మేనేజ్‌ చేస్తున్న పరిస్థితులు మన కళ్లముందే కనిపిస్తున్నాయి.
► పేదవాడికి మంచి జరగకూడదు. అలా జరిగితే ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందేమోనని ఆ మంచి పనులు ఆపడం కోసం రకరకాలుగా కోర్టులో కేసులు వేయిస్తారు. 
► ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రెండున్నరేళ్ల పరిపాలనను మనస్ఫూర్తిగా, సంతృప్తినిచ్చే విధంగా చేయగలిగాను. ఇంకా మంచి చేయడానికి కూడా వెనుకడుగు వేయను.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement