
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. కేంద్ర నిబంధనలకు లోబడే పేదల ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. ఏపీతో పోలిస్తే చాలా రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ఇళ్ల విస్తీర్ణం తక్కువగా ఉంది. ఆయా రాష్ట్రాలు 247 చదరపు అడుగుల నుంచి 322 చదరపు అడుగుల మధ్యనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో 255.1, ఉత్తరప్రదేశ్‌లో 291.7, నాగాలాండ్‌లో 292.45, ఉత్తరాఖండ్‌లో 293.74, ఒడిశాలో 302.14, తమిళనాడులో 304.08, జార్ఖండ్‌లో 305, జమ్మూకశ్మీర్‌లో 318.5 చ.అడుగుల్లోనే ప్రభుత్వాలు పేదల ఇళ్లు నిర్మిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 340 చ.అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఈ లెక్కన దేశంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్న 7 రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్ల విస్తీర్ణం 18 నుంచి 93 చ.అడుగులు ఎక్కువగా ఉంటోంది.
ఏపీ తరహాలోనే..
దేశంలో 12 రాష్ట్రాలు పేదల ఇళ్ల నిర్మాణానికి స్థలాలు పంపిణీ చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఏపీ తరహాలో లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. 10 రాష్ట్రాలు ఇళ్లు పంపిణీ చేయడం లేదు. స్థలాలు పంపిణీ చేస్తున్న జాబితాలో ఉన్న యూపీ, మహారాష్ట్రల్లో ఏపీ తరహాలోనే 1 సెంటు, 1.5 సెంట్లను ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నాయి. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కన్నా ఏపీనే ఎక్కువ ఇళ్లను నిర్మిస్తోంది.
పక్కాగా సెట్‌బ్యాక్స్..
ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల్లో నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్‌బీసీ)–2016, ఏపీ బిల్డింగ్ రూల్స్–2017, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలను పక్కాగా పాటిస్తోంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ విస్తీర్ణాన్ని కేటాయిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment