సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.25 శాతంగా నమోదైంది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు సగటున రోజుకు 69 కేసులు నమోదైనట్టు వెల్లడైంది. ఓవైపు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకల్లో కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ వస్తోందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం కేసుల సంఖ్య స్థిరంగానే కొనసాగుతోంది. 2020 జూలై, ఆగస్ట్ మాసాల్లో ఒక దశలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడా సంఖ్య 70 లోపే నమోదవుతుండటం గమనార్హం. గతంతో పోలిస్తే నమూనాల నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా కాస్త తగ్గింది. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న సమయంలో ఒక దశలో రోజుకు 70 వేలకు పైగా టెస్టులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడా సంఖ్య సగటున రోజుకు 27 వేలుగా నమోదైంది. గతంతో పోల్చితే మృతుల సంఖ్య భారీగా నియంత్రణలోకి వచ్చినట్టు తేలింది.
గతంతో పోల్చితే...
► డిసెంబర్‌లో 112 మంది మృతి చెందగా, జనవరిలో 46 మంది మృతి చెందారు. అదే ఫిబ్రవరిలో కేవలం 15 మంది మాత్రమే చనిపోయారు. ఫిబ్రవరి మాసంలో 7 జిల్లాల్లో ఒక్క మృతి కూడా చోటు చేసుకోలేదు.
► జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు 8,14,606 టెస్టులు చేస్తే 2,074 కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 69 కేసులు నమోదైనట్టు లెక్క.
► ఇదే డిసెంబర్‌లో సగటున రోజుకు 462 కేసులు, జనవరిలో 176 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 0.65 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 0.04 శాతం నమోదైంది.
► మొత్తం మీద పాజిటివిటీ రేటు 6.37 శాతంగా ఉంది. రికవరీలో 99.11 శాతంతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
అప్రమత్తంగానే ఉన్నాం
ప్రభుత్వ పరంగా అప్రమత్తంగా ఉన్నాం. కేసులు పెరిగినా ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు ప్రత్యేక పడకలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు కూడా కేసులు తగ్గాయని మాస్కులు లేకుండా తిరగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. జాగ్రత్తగా ఉండటం మంచిది.
– అనిల్ కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment