
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని డిసెంబర్ 23 నుంచి జనవరి 1 (10 రోజులు) వరకు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల్లో డిసెంబర్ 22 నుంచి 4,23,500 టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లి, జీవకోనలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలు, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకె¯న్లు ఇవ్వనున్నట్లు వివరించారు. టోకెన్లు ఉన్నవారిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
ఈ నెల 22 నుంచి 24 వరకు, డిసెంబర్ 31, జనవరి 1న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేసినట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9–11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిని స్వర్ణ రథంపై మాడ వీధుల్లో ఊరేగిస్తామని తెలిపారు. వైకుంఠ ద్వాదశి నాడు శ్రీవారికి ఉదయం 4.30 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు.
ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనాన్ని నిర్వహిస్తామని చెప్పారు. తిరుమలలో గదులు పొందిన భక్తులు కాష¯Œన్ డిపాజిట్ స్థితిని తెలుసుకునేందుకు టీటీడీ వెబ్‌సైట్‌లో కాషన్‌న్‌డిపాజిట్ రీఫండ్ ట్రాకర్‌ను పొందుపరిచినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment