సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వేద పండితులు, అర్చకుల సుప్రభాత సేవతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం బాలా త్రిపుర సుందరీ దేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.40గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.
ఆదివారం, దసరా సెలవులు కావడంతో తొలి రోజు నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్‌లు, కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం కల్పించారు. స్నానఘాట్లల్లో ప్రత్యేకంగా షవర్‌లు, తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం కలుగకుండా వీవీఐపీల సమాచారం ముందుగా తెలియజేస్తే ప్రొటోకాల్‌కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు చెప్పారు.
సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులతో నగరోత్సవం నిర్వహించి, పంచహారతులను సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం నాడు శ్రీ కనకదుర్గమ్మవారు భక్తులకు శ్రీ గాయత్రీదేవీగా దర్శనమివ్వనున్నారు.
దుర్గమ్మ సేవలో గవర్నర్ దంపతులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఆదివారం బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన గవర్నర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. గవర్నర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, చైర్మన్ కర్నాటి రాంబాబు అందజేశారు. గవర్నర్ వెంట కలెక్టర్ ఢిల్లీరావు తదితరులున్నారు. అలాగే, మంత్రులు ఆర్కే రోజా, విశ్వరూప్ కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment