ఆసుపత్రిలో చేరటంపైనా రోగిష్టి రాతలేనా ?  | Eenadu falls Writings on mp Avinash Reddy | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో చేరటంపైనా రోగిష్టి రాతలేనా ? 

Published Mon, May 22 2023 4:57 AM | Last Updated on Mon, May 22 2023 9:34 AM

Eenadu falls Writings on mp Avinash Reddy - Sakshi

వ్యక్తిత్వాన్ని చంపేయాలంటే రామోజీరావు తరవా తేఎవరైనా!!. తన ప్రయోజనాలకు అడ్డంగా ఉంటే ఎవరి పరిస్థితైనా అంతే!. అది ఎన్‌టీ రామారా­వయినా... లక్ష్మీ పార్వతయినా... సొంత పార్టీవా­రైనా..  ఇంకెవ్వరైనా అంతే!. తన ప్రయోజనాలు కాపాడినన్నాళ్లూ మహోన్నతుడిగా కీర్తించిన ఎన్‌టీ­ఆర్‌ను... చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేయలేదన్న ఒకే ఒక కారణంతో చివరి రోజుల్లో ‘ఈనాడు’ ఎలా బ్రాండ్‌ చేసిందో ఈ రాష్ట్రంలో తెలియనిదెవరూ లేరు. అలాగే లక్ష్మీ పార్వతిని కూడా!. ఇక టీడీపీ నేతలు కాని వారి పరిస్థితి చెప్పక్కర్లేదు.

చంద్రబాబుతో పొత్తులో లేనప్పుడు నరేంద్ర మోదీ వ్యక్తిత్వాన్ని సైతం వక్రీకరించి రాసిన కలం అది. ఇప్పుడు కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి విషయంలోనూ రామోజీరావు అదే చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన ప్రతి అంశాన్నీ వక్రీకరిస్తూ... మెల్లగా జనం మెదళ్లలో విషం నింపుతున్నారు. ఆఖరికి ఆయన తన తల్లిని ఆసుపత్రిలో చేర్చడాన్ని సైతం రాజకీయం చేస్తున్నారు. ఆమెను చూడటానికి కడప నుంచి వ్యక్తులొస్తే అది కూడా రాజకీయమే.

ఆసు­పత్రిలో పరిచయం ఉన్న వైద్యుడున్నారంటూ... దానికీ విషం పులిమారు. మరీ ఇంత సిగ్గుమాలిన రాతలా రామోజీరావు గారూ? ఇంతటి మీ విష­పూరిత మనస్తత్వాన్ని తట్టుకోలేకే... మీ తనయుడు సుమన్‌ సైతం మిమ్మల్ని ఇంట్లో ఉన్న క్యాన్సర్‌గా అభివర్ణించారని మరిచిపోయారా?అయినా చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే ఇంతలా దిగజారిపోవాలా? ‘ఈనాడు’ కరపత్రానికన్నా ఘోరమైన స్థాయికి దిగజార్చేయాలా? బాబుఅధికారంలో లేక... మీ అవినీతి సామ్రాజ్యం చిన్నబోతోందనా? అక్రమా­లతో, చట్టవిరుద్ధంగా నిర్మించుకుని విస్తరించిన మీ ఆర్థిక సామ్రాజ్యానికి బీటలు పడుతున్నాయనా? కనీస మానవతా విలువలు లేకపోవటం దుర్మార్గం కాదా రామోజీరావు గారూ?

ఏ ఆసుపత్రిలో చేర్చాలో మీరే చెబుతారా?
ఎంపీ అవినాశ్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను పులి­వెందుల నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరా­బాద్‌ తీసుకు వెళదామనుకున్నారు. కానీ మార్గం మధ్యలోనే పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో... కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. అందులో తప్పుబట్టాల్సిందేముంటుంది? అత్యవసర పరిస్థి­తు­ల్లో ఎవరైనా దగ్గర్లోని మెరుగైన ఆసుపత్రికి తీసుకెళతారు. అది సహజమేగా! కానీ.. ‘ఈనాడు’ చూసే కోణం వేరు కదా.

ప్రతి అక్షరాన్నీ చంద్రబాబు సంక్షేమం కోసం తాకట్టు పెట్టడం ఆ పత్రిక బాధ్యత మరి!. అందుకనే ఈ విషయాన్ని కూడా వక్రీకరించారు. తన పత్రికలో పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చు వేస్తూ... దానికి తన సొంత పైత్యాన్ని కూడా కొంత జోడించారు. పులివెందులలో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా బెంగళూరుకో, హైదరాబాద్‌కో తీసుకెళ్లాలని... మరెక్క­డికీ తీసుకెళ్లకూడదని పెద రాయుడి తీర్పుని­చ్చేశారు. ఆ రెండు ప్రాంతాలకూ కాకుండా మరెక్క­డికి తీసుకెళ్లినా ఏదో మతలబు ఉన్నట్టేనంటూ పైత్యాన్ని తారస్థాయిలో చూపించారు. ఊహాజని­తమైన కారణాలను జోడించేశారు. 

కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ఓ వైద్యు­డికి ముఖ్యమంత్రి కార్యాలయంతో సంబంధాలు ఉన్నాయంటూ... వైద్యం చేసిన కార్డియా­లజిస్టు అవినాశ్‌  రెడ్డికి స్నేహితుడంటూ నీచపు రాత­లకు దిగారు. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి కార్డియాలజీకి పేరున్న ఆసుపత్రి అని... డాక్టర్‌ హితేష్‌ కార్డియాలజీలో విశేషమైన ప్రఖ్యాతులున్న వైద్యుడనే వాస్తవాలను మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

అయినా సీఎంఓ నిజంగా జోక్యం చేసుకుని ఉంటే... సూచనలు చేసి ఉంటే.. కర్నూలులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చేర్పిస్తారు కదా? ప్రయివేటు ఆసుపత్రిలో ఎందుకు చేర్పిస్తారు? ప్రయివేటు ఆసుపత్రులను కూడా ప్రభుత్వం నియంత్రించగలదా? ఇదెక్కడి తలకాయ లేని ఆరోపణ రామోజీ రావుగారూ? మంచి వైద్యం కావాలనుకున్నపుడు మంచి ఆసుపత్రిలో చేరుస్తారు. ఆ విభాగంలో నిపుణుడైన వైద్యుడికి చూపిస్తారు. ఇక్కడ జరిగింది అదే. దీనిక్కూడా విషపూరిత వక్రభాష్యాలేల? వైద్యుడి ఊరుపైనా విష ప్రచారమేనా?

డాక్టర్‌ హితేష్‌ది పులివెందుల కనక... ఆయన అవినాశ్‌కు మిత్రుడు కనక చేర్పించారనటం వెనక కనీస ఇంగితమైనా ఉందా? పులివెందుల వాసులెవరూ బాగా చదువుకుని నిపుణులైన డాక్టర్లుగా, ఉన్నతాధికారులుగా ఉండకూడదా? ఇవెక్కడి రాతలు? ‘ఈనాడు’, దాని మిత్ర ఎల్లో మీడియా... ఇదే తరహాలో పులివెందులపై, రాయలసీమపై మూడు దశాబ్దాలుగా దుష్ప్రచారం చేయటం తెలియని విషయం కాదు. దీనికి కారణమల్లా ఒక్కటే. తెలుగుదేశం పార్టీ లేనప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారిని రామోజీరావు తన రాతలతో భయపెట్టి తన దారికి తెచ్చుకోగలిగారు. ఒక్క వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తప్ప. వైఎస్సార్‌ది పులివెందుల కనక. అంతే!.

సీఐడీ అంటే మంచమెక్కింది మీరేగా?
దర్యాప్తును తప్పించుకునేందుకు అనారోగ్యం అంటూ హఠాత్తుగా మంచం ఎక్కేయడం మీ మాదిరి ఎవరికి తెలుస్తుంది రామోజీరావు గారూ? అక్రమంగా చిట్స్‌ నడుపుతూ... చట్టాలన్నీ ఉల్లంఘిస్తున్న ‘మార్గదర్శి’పై మిమ్మల్ని ప్రశ్నించడానికి సీఐడీ అధికారులు మీ చిత్రపురి కోటకు వచ్చినపుడు జరిగిందేమిటో రాష్ట్రమంతా చూసింది కదా?. అప్పటికప్పుడు యశోద ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌ రామోజీ నివాసానికి వచ్చింది.

ఓ డాక్టర్, ఇతర సిబ్బంది కూడా వచ్చారు. అప్పటికప్పుడు ఆయన నడుముకు ఓ బెల్ట్‌ కట్టారు. ముక్కుకు మాస్కు పెట్టారు. చేతికి సెలైన్‌ తగిలించారు. మంచం పక్కనే ఆక్సిజన్‌ సిలిండర్‌ పెట్టారు. సినిమా సెట్టింగ్‌ను తలపిస్తూ ‘అనారోగ్యం’ కథను రక్తికట్టించేందుకు నానా తంటాలూ పడ్డారు. మార్గదర్శి చిట్స్‌ అక్రమాలపై సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ అనారోగ్యం నటిస్తూ మాట్లాడలేనన్న రీతిలోనే సమాధానాలు చెప్పారు రామోజీరావు.

కానీ ప్రశ్నల వీడియో షూటింగ్‌ ఆగినపుడల్లా మామూలు రామోజీలా తన అహాన్ని ప్రదర్శిస్తూనే వచ్చారు. అంటే.. ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకోవటానికే ఇంతటి డ్రామా నడిపారని తెలియటం లేదా? తాను అలా చేశాను కనక అంతా తనలానే ఉంటారనుకుంటే ఎలా?

బాలకృష్ణ ఇంట్లో కాల్పులపై పెన్ను మూసిన రామోజీబాలయ్యకు మతిస్థిమితం లేదని ఎందుకు రాయలేదు?
తిరుగులేని ప్రజాభిమానాన్ని పొందిన వైఎస్సార్‌ కుటుంబమంటే... రామోజీరావుకు ఏమాత్రం పడదు. అందుకే హద్దుల్లేని విష ప్రచారానికి దిగుతారు. ఇదే రామోజీరావు... తనవాడు కాబట్టి అడ్డదారిలో వచ్చిన చంద్రబాబుకు భజన చేస్తూనే ఉంటారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిపితే ... నిర్మాత బెల్లంకొండ సురేశ్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరవాత ఆ ఇంట్లో ఒక వాచ్‌మేన్‌ అనుమానాస్పదంగా మరణించాడు. దీనిపై రామోజీ అక్షరం ముక్క కూడా రాయలేదు.

అరెస్టును తప్పించుకునేందుకు అప్పటికప్పుడు బాలకృష్ణ ఆసుపత్రిలో చేరినా... ఎన్టీఆర్‌ కుటుంబానికి సన్నిహితుడైన కాకర్ల సుబ్బారావు డైరెక్టర్‌గా ఉన్న నిమ్స్‌లోనే చేర్చినా... కేసు నుంచి బయటపడడానికి తనకు మతిస్థిమితం లేదని బాలకృష్ణ సర్టిఫికెట్‌ తెచ్చుకున్నా... ‘ఈనాడు’ పెన్ను కదిపితే ఒట్టు. ఎందుకంటే బాలకృష్ణ తమవాడు. కాబట్టి కాల్పులు జరపొచ్చు. అరెస్టు కాకుండా ఆసుపత్రిలో చేరొచ్చు. కేసు నుంచి బయటపడటానికి మతి స్థిమితంలేదని సర్టిఫికెట్‌ తెచ్చుకోవచ్చు. అదే ప్రత్యర్థులైతే... వారి చర్యల్లో ఎలాంటి తప్పూ లేకున్నా ‘ఈనాడు’ సందేహాలు వ్యక్తంచేస్తూనే ఉంటుంది. లేని దురుద్దేశాలు ఆపాదిస్తుంది. ఎందుకంటే ఆ పత్రికది జగమెరిగిన దౌర్భాగ్యపు పాత్రికేయం మరి!.

పరామర్శించేవారి కులాలూ రాస్తారా?
వైఎస్‌ కుటుంబంపై అక్కసు కొద్దీ రామోజీరావు నానాటికీ మరింత దిగజారిపోతున్నారు. వైఎస్సార్‌ జిల్లా ఎంపీ కనక ఆసుపత్రిలో ఉన్న అవినాశ్‌ రెడ్డి తల్లిని పరామర్శించేందుకు పులివెందులతో పాటు వైఎస్సార్‌ జిల్లాకు చెందిన చాలామంది కర్నూలు ఆసుపత్రికి వచ్చారు. అది సహజం. దాన్ని కూడా ‘ఈనాడు’ తనదైన కోణంలో వక్రీకరించింది. పైగా పరామర్శించిన వారి కులాలను ప్రస్తావిస్తూ సరికొత్త స్థాయికి దిగజారింది.

పులివెందులకు చెందిన దంతలూరి కృష్ణ కర్నూలు ఆసుపత్రికి రాగా... ఆయన పేరును దంతులూరి కృష్ణ అని కాకుండా... ఆయన కులాన్ని ప్రస్తావిస్తూ ‘మంగలి కృష్ణ’అని రాయటమెందుకు? మరి రామోజీరావును పరామర్శించేందుకు చంద్రబాబు వచ్చినప్పుడు ‘కమ్మ చంద్రబాబు’అని రాయలేదే...! తనను పరామర్శించేందుకు వచ్చిన మురళీమోహన్, రాఘవేంద్రరావు తదితరుల పేర్ల ముందు ‘కమ్మ’ అని చేర్చలేదే? ఎందుకీ విపరీతపు రాతలు?

సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేందుకే కుట్ర
వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తాము నిర్దేశించినట్టే జరగాలన్నది చంద్రబాబు కుట్ర. దానికి అనుగుణంగా రామోజీరావు చేస్తున్న దుష్ప్రచారమే ఇది. నిజానికి కోర్టులో ఏదైనా పిటిషన్‌ దాఖలు చేస్తే ప్రతివాదులకు కోర్టే నోటీసులు పంపుతుంది. దానిపై కౌంటర్‌ వేయమని చెబుతుంది. అంతేగానీ పిటిషన్‌ వేసినవారే ఆ నోటీసులను తీసుకువెళ్లి ప్రతివాదులకు అందించరు కదా?.

న్యాయ ప్రక్రియలోనే ఎక్కడా లేని ఈ వింత ఆచారానికి వివేకానందరెడ్డి కేసులో ఆయన కుమార్తె సునీత ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దానికి ‘ఈనాడు’ ఎందుకు వత్తాసు పలుకుతోంది? ఇదంతా కుట్ర కాదా? ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతోందనటానికి ఇంకా ఏం కావాలి? వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్‌ నెలాఖరుకు పూర్తి చేసి జులై 1న ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.

దీన్ని సవాల్‌ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై సుప్రీంకోర్టు ఎర్ర గంగిరెడ్డికి నోటీసులిచ్చింది. అవి కోర్టు  ద్వారా ఆయనకు అందుతాయి. కానీ సునీత ఆ నోటీసులను తన లాయర్‌ ద్వారా ఎర్ర గంగిరెడ్డికి అందించేందుకు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ  జైలుకు వెళ్లారని ‘ఈనాడు’ రాసింది.  ఇంత కవరేజీ అవసరమా రామోజీ? 

ఇదీ... అసలు వాస్తవం
వాస్తవమేంటంటే... ఎర్ర గంగిరెడ్డిని కలవాలని సునీత ప్రయత్నించారు. తాను చెప్పినట్లుగా నడుచుకుంటే కేసు నుంచి తప్పించటంతో పాటు అదనపు లాభాలుంటాయని ప్రలోభపెట్టడానికి ఆమె ఎర్ర గంగిరెడ్డిని కలవాలనుకున్నారు. దస్తగిరి మాదిరే గంగిరెడ్డినీ ప్రలోభపెట్టి కుట్రలో కొత్త అంకానికి తెర లేపాలనుకున్నారు. జైలు అధికారులు అంగీకరించలేదు. కలవాలని ప్రయత్నించిన విషయం మాత్రం బయటకు పొక్కింది. ప్లాను బెడిసికొట్టడంతో దీంతో చంద్రబాబు డైరెక్షన్లో ‘ఈనాడు’ కవరేజీ మొదలుపెట్టింది. కోర్టు నోటీసులను అందించడానికే సునీత వెళ్లబోయారని చెత్త రాతలు రాసేసింది.

సునీతకు అసలు అంత అవసరం ఏమొచ్చిందో చెప్పాలి కదా? కోర్టులు చేయాల్సిన పనిని ఆమే ‘వ్యయప్రయాసల కోర్చి’ చేస్తున్నారంటే దాని పరమార్థమేంటి? వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరికి ఇప్పటికే సునీత పూర్తి స్థాయిలో అండదండలిస్తున్నారు. అదే రీతిలో ఎర్ర గంగిరెడ్డినీ ప్రలోభపెట్టి ఈ కేసు నుంచి తన భర్త రాజశేఖరరెడ్డిని, బావ శివప్రకాశ్‌ రెడ్డిని పూర్తిగా తప్పించాలన్నది ఆమె ఉద్దేశం. అది బయటపడకుండా ‘ఈనాడు’ నోటీసుల రాగం అందుకోవటమే కుట్రకు నిదర్శనం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement