సాక్షి, అమరావతి: మామిడి సహా వివిధ రకాల ఉద్యాన, వ్యవసాయ పంట ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కరోనా విపత్తులో సైతం రైతన్నలు విక్రయించుకునేలా, పొరుగు రాష్ట్రాలకు తరలించేలా రవాణా సౌకర్యాలను కల్పించింది. అనంతపురం నుంచి ఉద్యాన ఉత్పత్తులతో ఢిల్లీకి ఏకంగా ప్రత్యేక కిసాన్ రైలును అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా మామిడి తోటలు విస్తరించేలా నాలుగేళ్లుగా ప్రోత్సహిస్తోంది. ఫ్రూట్ కవర్లకు రాయితీలతోపాటు తోట బడులతో ఆర్బీకేల ద్వారా రైతన్నలకు శిక్షణ ఇస్తోంది.
వైపరీత్యాల్లో పంట నష్టపోయిన మామిడి రైతులకు పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) అందిస్తోంది. బంగినపల్లి, ఇమామ్ పసంద్ లాంటి ఫైన్ వెరైటీ మామిడి పండ్లకు టీడీపీ హయాంలో గరిష్టంగా టన్ను రూ.40 వేలు – రూ.50 వేలు మాత్రమే ధర పలుకగా ప్రస్తుతం రూ.90 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు పలకడం గమనార్హం. తోతాపురి మామిడి పండ్లకు టీడీపీ హయాంలో గరిష్టంగా టన్ను రూ.12 వేలు పలుకగా ప్రస్తుతం రూ.23 వేలకు పైగా దక్కుతోంది. వాస్తవాలు ఇలా ఉండగా తన పాఠకులను తప్పుదోవ పట్టిస్తూ మామిడి రైతుకు సర్కార్ దెబ్బ అంటూ ఈనాడు విషం కక్కింది.
ఆరోపణ: తోటల పునరుద్ధరణ, విస్తరణ జాడేది?
వాస్తవం: రాష్ట్రంలో 9.95 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మామిడి సాగవుతోంది. నాలుగేళ్లలో రూ.14.53 కోట్లతో 20,682.50 ఎకరాలలో కొత్తగా మామిడి తోటలు విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అధిక సాంద్రత విధానంలో తోటలు పెంచటాన్ని ప్రోత్సహిస్తోంది. సూక్ష్మ నీటి సాగు çపథకం కింద పెద్ద ఎత్తున డ్రిప్ పరికరాలను సమకూర్చడంతో పాటు పాత తోటలను పునరుద్ధరిస్తున్నారు. గత నాలుగేళ్లలో 20,585 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటల పునరుద్ధరణ పథకం కింద రూ.14.41 కోట్ల రాయితీని అందించారు.
ఆరోపణ: చీడపీడల నివారణ చర్యలేవి?
వాస్తవం: గత నాలుగేళ్లలో 883 తోట బడుల ద్వారా సమీకృత తెగులు, ఎరువు యాజమాన్య పద్ధతులపై మామిడి రైతులకు ఆర్బీకే స్థాయిలో శిక్షణ ఇచ్చారు. శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందాలను మామిడి సాగయ్యే జిల్లాలకు పంపి చీడపీడలు, తెగుళ్ల నివారణ చర్యలపై రైతులను అప్రమత్తం చేస్తున్నారు. నల్ల తామరతో సహా వివిధ రకాల చీడపీడలు, తెగుళ్ల నివారణకు రైతు క్షేత్రాల్లో సామూహిక నివారణ చర్యలు చేపట్టారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించారు. తద్వారా నాణ్యత ప్రమాణాలను పెంచి దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా మన మామిడికి గిరాకీ కల్పించారు.
ఆరోపణ: కానరాని మౌలిక సౌకర్యాలు
వాస్తవం: రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కోత అనంతర యాజమాన్య పద్ధతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించారు రూ.35.04 కోట్ల రాయితీతో 1,752 ప్యాక్ హౌస్‌లను రైతుల పొలాల్లో నిరి్మంచారు. రూ.39.02 కోట్ల రాయితీతో 347 కలెక్షన్ సెంటర్లు మామిడి రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా నిర్మించారు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో కూడా కలెక్షన్ సెంటర్లలో గ్రేడింగ్, ప్యాకింగ్‌తో దూర ప్రాంత మార్కెట్లకు తరలించి మంచి ధరలు పొందే వెసులుబాటు కలిగింది.
2023–24లో మామిడి రైతుల అభివృధ్ధి కోసం రూ.22.50 కోట్ల రాయితీతో మామిడి ఎఫ్‌పీఓల ద్వారా 200 కలెక్షన్ సెంటర్లు, రూ.10.50 కోట్ల రాయితీతో రైతు క్షేత్రాల్లో 525 ప్యాక్ హౌస్‌లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రూ.కోటి రాయితీతో 2,802.50 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా మామిడి సాగు, రూ.3.50 కోట్ల రాయితీతో 6,250 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల నాణ్యత ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు ఆమోదించారు.
ఆరోపణ: పెద్దల చేతుల్లో చిత్తూరు రైతు చిత్తు
వాస్తవం: చిత్తూరు జిల్లాలో ఎక్కువగా సాగయ్యే తోతాపురి రకం ధర టీడీపీ హయాంలో 2017–18లో టన్ను రూ.5 వేల కంటే తక్కువకు పడిపోయింది. గుజ్జు పరిశ్రమలు కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా ఉండకూడదన్న సంకల్పంతో మామిడి ధరల స్థిరీకరణ కోసం కలెక్టర్ నేతృత్వంలో గుజ్జు పరిశ్రమల యాజమాన్యం, రైతులు, ఉద్యాన, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. వారం వారం ఈ కమిటీ సమావేశమై ధరల క్రమబద్ధీకరణకు చర్యలు చేపడుతుంది. మామిడి తోటలను సమీప గుజ్జు పరిశ్రమలకు అనుసంధానం చేశారు.
తోతాపురి మామిడి ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ధరలు పతనం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆధునిక కోత పరికరాలతో పాటు పండు ఈగ నివారణకు ఆకర్షణ బుట్టల పంపిణీని రాష్ట్రంలో తొలిసారిగా చిత్తూరు జిల్లాలో చేపట్టారు. కోయడం, నాణ్యతపై రైతులకు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గుజ్జు తయారీ పరిశ్రమలకు చేరవేయడంపై ఆర్బీకే సిబ్బందికి శిక్షణ అందించారు. బలవంతపు అమ్మకాలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టారు. మొత్తం పండ్లను ఒకేసారి కోసి నష్టపోకుండా దశల వారీగా పండ్ల కోతలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టడంతో ఏ దశలోనూ టన్ను రూ.10 వేలకు తగ్గకుండా ఉంది. ఈ సీజన్‌లో గరిష్టంగా రూ.23 వేలకు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.11 వేలు పలుకుతోంది. రానున్న నెల రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో మామిడి రైతులకు ఈ స్థాయిలో అండగా నిలిచిన దాఖలాలే లేవు.
ఆరోపణ: ఎగుమతులకు ఏదీ ప్రోత్సాహం?
వాస్తవం: ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఏటా అపెడా ఆధ్వర్యంలో అమ్మకం,
విక్రయదారుల సదస్సులు నిర్వహిస్తున్నారు. దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరిగాయి. నాలుగేళ్లలో 1,103.78 టన్నుల పండ్లతో పాటు 8 లక్షల టన్నుల మామిడి గుజ్జును విదేశాలకు ఎగుమతి చేయడం గమనార్హం.
ఆరోపణ: కవర్ల రాయితీలో కోత
వాస్తవం: నాణ్యతకు పెద్ద పీట వేస్తూ రైతులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా డిమాండ్ మేరకు కవర్లను రాయితీపై అందిస్తున్నారు. గత నాలుగేళ్లలో రూ.1.80 కోట్ల రాయితీతో ఫ్రూట్ కవర్లను రైతులకు పంపిణీ చేసి మామిడి పండ్ల నాణ్యత పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినది. 2023–24లో కూడా డిమాండ్ మేరకు రాయితీపై కవర్ల పంపిణీకి చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment