పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు | Global experts examine Polavaram dam project: AP | Sakshi
Sakshi News home page

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు

Published Mon, Jul 1 2024 2:34 AM | Last Updated on Mon, Jul 1 2024 7:33 AM

Global experts examine Polavaram dam project: AP

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పరిశీలన  

జలవనరులశాఖ సలహాదారు, సీఈలతో సమీక్ష 

దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌ పరిశీలన నేడు

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణులు డేవిడ్‌ బి.పాల్, గియాస్‌ ఫ్రాంకో డి సిస్కో, రిచర్డ్‌ డొన్నెళ్లీ, సీస్‌ హించ్‌బెర్గర్, యాఫ్రి సంస్థ ప్రతినిధులు ఆదివారం పరిశీలించారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్‌ అశ్వనీకుమార్, జలవనరుల­శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, సీఈ నరసింహమూర్తి, సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరి­యల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌), వ్యాప్కోస్‌ అధికారులతో కలిసి అంతర్జాతీయ నిపుణులు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, లీకేజీ­లను నిశితంగా పరిశీలించారు.

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు కట్టడానికిముందు లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్‌ గ్రౌటింగ్‌ చేసిన విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరద ఉధృతి గరిష్ఠంగా ఉన్నప్పుడు, కనిష్ఠంగా ఉన్నప్పుడు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లలో లీకేజీల స్థాయి ఎంత ఉందని అడిగారు. కాఫర్‌ డ్యామ్‌ల లీకేజీలను తెలుసుకోవడానికి ఇప్పటి­దాకా నిర్వహించిన పరీక్షల ఫలితాలపై ఆరా తీశారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను చూసి, మ్యాప్‌ ద్వారా పనుల వివరాలను తెలుసుకున్నారు.

అనంతరం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పరిస్థితిపై జలవన­రులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, సీఈ నరసింహమూర్తి, అధికారులతో సమీక్షించారు. సోమవారం ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–1, గ్యాప్‌–2లను పరిశీలించి, కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను నింపి వైబ్రోకాంపాక్షన్‌ ద్వారా యథాస్థితికి తెచ్చిన పనులను తనిఖీ చేయను­న్నారు. ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో కోతకుగురై దెబ్బతిన్న డయాఫ్రమ్‌­వాల్‌ను పరిశీలించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement