
కేక్ కట్‌చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు
నరసరావుపేట: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
తమ ఉద్యోగాల ప్రొబేషన్ డిక్లేర్, పే స్కేలు నిర్ధారిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని పురస్కరించుకుని స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భువనచంద్ర టౌన్‌హాలులో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ఆత్మీయ సభ నిర్వహించారు. సభకు అసోసియేషన్ కార్యదర్శి షేక్ మహమద్ ఆలీ అధ్యక్షత వహించారు.
వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి ఎటువంటి హాని చేయబోరని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పాలని, నిరుద్యోగులకు ఉపాధి చూపించాలనే ఆలోచనతోనే సచివాలయ వ్యవస్థ ఏర్పడిందన్నారు.
సచివాలయాల ఏర్పాటు ఓ చరిత్ర: గోపిరెడ్డి
నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక సచివాలయం ఉండే దశ నుంచి ప్రతి గ్రామానికి ఒక సచివాలయం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 10,700 సచివాలయాలను తీసుకురావటం ఒక చరిత్ర అన్నారు. ప్రజల ముగింటకే సచివాలయ ఉద్యోగుల ద్వారా పరిపాలన తీసుకురావటం సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఇక అతిథులు కేక్ కట్‌చేయగా, వారిని ఉద్యోగులు సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment