సాక్షి, అమరావతి: చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఊతమిస్తోంది. ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తోంది. చేనేతలకు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, ఉత్పత్తుల తయారీతోపాటు విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు, మేలైన మార్కెటింగ్ వ్యవస్థతో అండగా నిలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర సంస్థలు, బ్యాంకర్ల సహకారాన్ని సైతం నేతన్నకు అందేలా చూస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంలో ఒక్కొక్కరికీ రూ.24 వేల చొప్పున ఐదు పర్యాయాలుగా మొత్తం రూ.969.77 కోట్లు అందించిన విషయం తెల్సిందే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద చేనేత కారి్మకులు ఒక్కొక్కరికి రూ.2,750 చొప్పున 2019 జూన్ నుంచి 2023 జూలై వరకు మొత్తం రూ.1,254.42 కోట్లు అందించారు.
రుణాల రూపంలోనూ చేయూత
చేనేతలకు ముద్ర రుణాలివ్వడంతోపాటు మగ్గాల ఆధునికీకరణ, మెరుగైన నైపుణ్యం కోసం క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మరోవైపు చేనేత రంగంలో కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ద్వారా రాష్ట్రంలో 416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు రూ.250.01 కోట్లు అందించారు. ఇదికాకుండా చేనేత కార్మికులకు వ్యక్తిగతంగాను, స్వయం సహాయక సంఘాల ద్వారా నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలును అందించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment