బాహుబలి అంటే ఈయనే.. భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన భర్త | Husband Climbed Tirumala Carrying His Wife On Shoulders | Sakshi
Sakshi News home page

గోదారోళ్లా మజాకా.. భార్య మీద ఎంత ప్రేమో.. ఎత్తుకొని తిరుమల కొండెక్కిన భర్త

Published Sun, Oct 2 2022 8:48 PM | Last Updated on Sun, Oct 2 2022 8:49 PM

Husband Climbed Tirumala Carrying His Wife On Shoulders - Sakshi

గోదారోళ్ళు అంటే భక్తి, ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు. ఊరికే మాటలు చెప్పడం కాదు చేతలతో చూపిస్తుంటారు. తాజాగా తన భార్యపై ఉన్న ప్రేమను ఓ భర్త ఇలా చూపించుకున్నాడు. ఆయన చేసిన పని చూసి పలువురు ప్రశంసలతో ముంచెత్తుతూనే ఆశ్చర్యానికి లోనవుతున్నారు

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ(సత్తిబాబు) లావణ్య దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. ఈ క్రమంలో దర్శనం కోసం కాలినడకన మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ సరదగా నడుస్తున్నారు. ఇంతలో.. వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్తిబాబును చూసి భార్య లావణ్య మీరు ఎక్కడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని మెట్లు ఎక్కండి అంటూ సరదాగా సవాల్ చేసింది. దీంతో, భార్య సవాల్‌ను సీరియస్‌గా తీసుకున్న సత్తిబాబు.. ఆమెను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా ఆ జంట వెళ్తుంటే మిగిలిన భక్తులు ఫొటోలు, వీడియోలు తీయడానికి పోటీపడ్డారు.

అయితే, పెళ్లైన కొత్తలో ఇలాంటి ప్రేమలు సర్వసాధారణమే అని కొట్టి పడేయకండి. వీరికి  పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో చెబితే ఆశ్చర్యపోవాల్సిందే. వీరిద్దరికీ  1998లో వివాహం జరిగింది. అంటే ఇరవై నాలుగేళ్లు. ఇక్కడ మరో విశేషం ఎంటంటే.. వీరి ఇద్దరమ్మాయిలకూ పెళ్లిళ్లు కూడా చేశారు. తాత, అమ్మమ్మలు కూడా అయిపోయారు. 

కాగా.. వీరి పెద్ద  అల్లుడు గురుదత్త(చందు)కు మంచి సాప్ట్ వేర్  ఉద్యోగం వస్తే పుట్టింటి, అత్తంటి వారందరనీ తిరుమల తీసుకొస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ఉద్యోగం రావడంతో బస్సులో నలభై మందిని తిరుపతి తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే సత్తిబాబు ఈ సాహసం చేశాడు. ఇక, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందరో యువ జంటలకు సవాల్ విసురుతోంది. అలాఅని.. తొందరపడి ఈ సాహసానికి అందరూ ప్రయత్నించకండోయ్.. తేడా వస్తే అసలుకే ఎసరు వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement