సాక్షి, అమరావతి : అక్రమ పునాదులపై ఈనాడు రామోజీరావు నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యానికి చట్ట విరుద్ధంగా నిధులు అందించే కామథేనువు ‘మార్గదర్శి’ ఒట్టిపోయింది. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఆయన తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో ‘మార్గదర్శి’ పాపాల పుట్ట బద్దలైంది. కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టంచేయడంతో ఆ సంస్థలోని ఆర్థిక కార్యకలాపాలు దాదాపు 16 నెలలుగా స్తంభించిపోయాయి. దీంతో లక్షలాది మంది చందాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్ణీత కాలంలో చందాదారులకు చిట్టీపాటల ప్రైజ్‌మనీ చెల్లించలేక మార్గదర్శి ముఖం చాటేస్తోంది. ష్యూరిటీలపై కొర్రీలు వేస్తూ కాలహరణం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మార్గదర్శి’ ఇక ప్యాకప్ చెప్పడమే తరువాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి.
రూ.4,880 కోట్లకు పైగా బకాయిలు
కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును రామోజీరావు తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లతోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించారు. రాష్ట్ర స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. నిబంధనల ప్రకారం కొత్త చిట్టీలు ప్రారంభించాలంటే జిల్లా చిట్ రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి. అలాగే, కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని అమలుచేస్తున్నట్లుగా ఆధారాలు చూపాలని చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఆదేశించారు. అందుకు రామోజీరావు ససేమిరా అన్నారు.
మరోవైపు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై సీఐడీ విభాగం 2022, నవంబరులో కేసు నమోదు చేసింది. సొమ్మును రామోజీరావు అక్రమంగా మళ్లిస్తున్నారని తెలియడంతో కొత్త చందాదారులు చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరడంలేదు. అప్పటి నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. దశాబ్దాలుగా మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఆ సంస్థలో మనీ టర్నోవర్ నిలిచిపోయింది. దాంతో ఇప్పటికే కొనసాగుతున్న చిట్టీ గ్రూపుల చిట్టీపాటల మొత్తం (ప్రైజ్‌మనీ) చెల్లించడం రామోజీకి తలకు మించిన భారంగా మారింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 16 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్‌మనీ సక్రమంగా చెల్లించలేకపోతోంది.
► ఇక రాష్ట్రంలో 37 బ్రాంచీల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు నెలనెలా రూ.260 కోట్ల టర్నోవర్ ఉంది. అందులో రూ.80 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉండగా.. రూ.180 కోట్లు వరకు చిట్టీ పాటల ప్రైజ్‌మనీగా చెల్లించాల్సి ఉంది. 2022 నవంబరు నుంచి ఆ ప్రైజ్‌మనీ మొత్తం సక్రమంగా చెల్లించకుండా బకాయిలు పేరుకుపోయాయి. ఆ ప్రకారం 16 నెలలకు రూ.2,880 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
► అలాగే, మార్గదర్శి చిట్‌ఫండ్స్ రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లు కాలపరిమితి ముగుస్తున్నా చెల్లించలేకపోతోంది. 4 శాతం నుంచి 5 శాతం వడ్డీ చొప్పున ఆరునెలల నుంచి రెండేళ్ల కాలపరిమితితో అక్రమంగా ఆ డిపాజిట్లను సేకరించింది. కాల పరిమితి ముగిసిన ఆ రశీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్ 16 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపితే మొత్తం మీద దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెరసి మార్గదర్శి చిట్‌ఫండ్స్ దాదాపు రూ.4,880 కోట్ల వరకు చందాదారులకు చెల్లించాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు అంచనా వేశారు.
కొర్రీలతో చందాదారులకు ముప్పుతిప్పలు
ఇదిలా ఉంటే.. చిట్టీ పాటల ప్రైజ్‌మనీ, కాలపరిమితి ముగిసిన డిపాజిట్ల సొమ్ము కోసం చందాదారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ, తమ గల్లాపెట్టే ఖాళీ కావడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొర్రీలు వేస్తూ చందాదారులను మొండిచేయి చూపిస్తోంది. నిబంధనల ప్రకారం మూడు ష్యూరిటీలు చూపించినా.. వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ తిరస్కరిస్తోంది.
పైగా.. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మళ్లీ రశీదు డిపాజిట్‌గానే తమ డిపాజిట్ చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం తాము ఆ మొత్తాన్ని చెల్లించలేమని చెబుతుండటం గమనార్హం. ఇలా అక్రమంగా రశీదు డిపాజిట్ల దందాను కొనసాగించాలని రామోజీరావు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇంధనం ఆ అక్రమ డిపాజిట్లే కాబట్టి. కానీ, సీఐడీ అధికారులు నిశితంగా కేసు దర్యాప్తు చేస్తుండడంతో అక్రమ డిపాజిట్ల దందాకు చెక్ పడింది.
చందాదారులకు సీఐడీ రక్షణ..
మరోవైపు.. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లకు కూడా సీఐడీ నివేదించింది. దాంతో రామోజీ ఆర్థిక అక్రమాల ఆట కట్టింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు మోసపోకుండా, వారి చిట్టీల మొత్తం, డిపాజిట్లకు న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించేందుకు సీఐడీ ఉద్యుక్తమైంది. తద్వారా అగ్రిగోల్డ్ తరహాలో రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులను ముంచేయకుండా సీఐడీ కార్యాచరణను చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment